డిజిపి చేతికి సిట్ నివేదిక.. చర్యలు ఎలా ఉంటాయో..
సిట్ పని పూర్తయింది. ఇక ఎన్నికల కమిషన్ చర్యలు మిగిలాయి. రాజకీయ నాయకులు, ఎన్నికల అధికారులు, ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ౧౩ మంది సిట్ సభ్యుల టీమ్ నివేదిక సోమవారం సాయంత్రం సిట్ హెడ్ వినీత్ బ్రిజ్ లాల్ కు సభ్యులు అందించారు. అనంతరం వినీత్ బ్రిజ్ లాల్ డిజిపికి అందజేశారు. అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాల్లోని తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న అల్లర్లపై విచారణ జరిపేందుకు సిట్ ను ఎన్నికల సంఘం నియమించింది. రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారించిన సిట్ సభ్యులు నివేదికను అందజేశారు. మొత్తం నమోదైన ౩౩ కేసులను పరిశీలించినట్లు సమాచారం.
అన్ని కోణాల్లో..
జరిగిన సంఘటనలను అన్ని కోణాల్లో పోలీసులు విచారించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎఫ్ఐఆర్ లను పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రదేశాలకు వెళ్లి అక్కడ కొంత మంది స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో చేయాల్సిన మార్పుల గురించి రిపోర్టుల్లో పేర్కొన్నారు. దాడులు చేసిన వారిని, దాడులకు గురైన వారిని కూడా సిట్ సభ్యులు కలిసి మాట్లాడారు. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని కేసులో లోపాలు ఉంటే వాటిని వివరిస్తూ నివేదికలు రూపొందించారు.
దాడులు జరిగిన ప్రదేశాలను పరిశీలించడం ద్వారా, అక్కడి వారి స్టేట్ మెంట్స్ రికార్డు చేయడం ద్వారా కేసుల్లో ఉన్న బలం ఏమిటో ఉన్నతాధికారులకు అర్థమయ్యే విధంగా రిపోర్టులు రూపొందించారు. గ్రౌండ్ రియాలిటీ ఏమిటనేది రిపోర్టుల్లో చెబుతూ పోలీసుల వైఫల్యాలు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు చేసిన దౌర్జన్యాలపై కూడా సమగ్రమైన రిపోర్టును అందజేశారు. సభ్యులందరితో ఐజి వినీత్ బ్రిజ్ లాల్ మాట్లాడుతూ సకాలంలో స్పందించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయంలో రిపోర్టు ఇచ్చినందుకు సభ్యులను అభినందించారు.
ఎవరిపై ఏ విధమైన చర్యలు ఉంటాయో?
ఎన్నికల హింసలో సిట్ రిపోర్టు వల్ల ఎవరిపై ఎటువంటి చర్యలు ఉంటాయోననే ఆందోళన ఎన్నికల సిబ్బందిలో మొందలైంది. ఎన్నికల రోజు జరిగిన గొడవల కంటే మరుసటి రోజు పల్నాడులో జరిగిన గొడవలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో పోలీసుల్లో ఎక్కువ మందిపై చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో నివేదిక తయారైనందున నమోదైన కేసుల్లో కూడా చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కేసుల్లో స్థానికుల స్టేట్ మెంట్స్, సాక్ష్యం లేకుండా స్టేషన్ హెడ్స్ నమోదు చేశారు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల నేపథ్యంలో పలు మార్లు పలువురు ఎస్పిలు, కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఒక ఎస్పి, 13 మంది సబార్డినేట్ పోలీసు ఉద్యోగులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.