AUTO EXPO | 'చిన్న' కార్లకు 'పెద్ద' కష్టం.. అందరికీ పెద్దవే కావాలట!
ముఖేష్ అంబానీ వాడే రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారు ధర ₹13.5 కోట్లు, నటుడు అల్లు అర్జున్ వాడే రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర ₹6.95 కోట్లు.. ఇలా ఎన్నో..;
By : The Federal
Update: 2025-01-19 10:26 GMT
ముఖేష్ అంబానీ వాడే రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII కారు ధర సుమారు ₹13.5 కోట్లు,
నటుడు అల్లు అర్జున్ వాడే రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ధర సుమారు ₹6.95 కోట్లు..
ఆకాశ్ అంబానీ వాడే మెర్సిడెస్-బెంజ్ S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ కారు ధర సుమారు ₹15 కోట్లు..
ఇలా లెక్కకు మిక్కిలి కార్లు మార్కెట్ కి వస్తున్నాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాడే చిన్న కార్లు కనుమరుగవుతున్నాయి... ఎందుకలా జరుగుతుందో చూద్దాం..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025 (Bharat Mobility Global Expo) దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 17న మొదలైంది. ఈ ఎక్స్‌పో జనవరి 22 వరకు ఉంటుంది. ఈ ప్రదర్శన తొలిరోజు అచ్చంగా మీడియా వాళ్లకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మిగతా రోజుల్లో ప్రజలను రానిస్తారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఇది ప్రఖ్యాత ఈవెంట్. ఈ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి 40కుపైగా కొత్త కార్లను ఆవిష్కరించారు. అయితే చిత్రంగా వీటిలో ఏ ఒక్కటీ చిన్న కారు లేదు. కాంపాక్ట్ కార్ కూడా ఆవిష్కరకు నోచుకోలేక పోవడం మార్కెట్ రంగ ధోరణిని సూచిస్తోంది. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఒకప్పుడు పరిశ్రమకు మూలస్థంభం చిన్న కార్లు లేదా కాంపాక్ట్ కార్లు. 2006లో కేంద్ర ప్రభుత్వం కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు, భారతదేశాన్ని చిన్న కార్ల తయారీ కేంద్రంగా నిలిపేందుకు ప్రత్యేక పన్ను రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. కార్ల తయారీ కంపెనీలను రా.. రమ్మని పిలిచి పెద్ద పీట వేస్తే ఇప్పుడు ఈ విభాగం అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. ఒకప్పుడు చిన్న కార్లకు పెట్టింది పేరైన మారుతీ సుజుకీ కూడా ఈ ఏడాది ఒక్క చిన్నకారునూ ఆవిష్కరించ లేదు.
విశ్లేషకులు చెబుతున్నట్టు.. చిన్న కార్లు, (small car) కాంపాక్ట్ కార్ల తయారీకి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో చిన్న కార్లు తయారీ రంగం వెనకడుగు వేస్తోంది. ఉదాహరణకు, కఠినమైన కాలుష్య నియంత్రణ విధానాలు, భద్రతా ప్రమాణాలు. అలాగే కొనసాగుతున్న ద్రవ్యోల్బణం. గత ఏడేనిమిది ఏళ్లలో కంపెనీలు కార్ల ధరలను 55-60% పెంచాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు 70 శాతం పెరిగాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఏదైనా కారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎంట్రీ-లెవల్ కార్ల కొనుగోలు పట్ల విముఖత చూపుతున్నారు. కొనేదేదో పెద్దదే కొనుక్కుంటే మేలు కదా అనే భావనలోకి ప్రతి ఒక్కరూ పోతున్నారు.
ఒకప్పడు లగ్జరీ అయిన కారు ఇప్పుడు అవసరం, అనివార్యంగా మారింది. దీనికి తోడు ఇంథన ధరలు కూడా పెరగడంతో అందరూ గ్రీన్ ఎనర్జీ లేదా బ్యాటరీ, ఎలక్ట్రికల్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కాలుష్య నియంత్రణ పేరిట పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వాహనాల తయారీకే కార్ల తయారీ కంపెనీలు కూడా మొగ్గు చూపుతున్నాయి.
ఇకపోతే, మార్కెట్ కూడా మధ్య తరహా (మిడ్ సైజ్), పెద్ద SUVల వైపు మరలింది. ఈ వాహనాలు ఎంట్రీ-లెవల్ కార్ల కంటే రెండు, మూడు రెట్ల ఎక్కువ ధర కలిగి ఉంటాయి. సెమీ-ఆటోనామస్ డ్రైవింగ్ సామర్థ్యాలు, ఆధునిక భద్రతా ఫీచర్లు, కారు లోపల వినోద వ్యవస్థలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. బ్యాంకులు రుణాలు ఇస్తామంటూ వెంటపడుతుంటాయి. దీంతో నగర, పట్టణ వాసులు నాలుగు రూపాయలు ఎక్కువైనా పెద్ద కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
చారిత్రాత్మకంగా మారుతీ సుజుకీ కంపెనీ చిన్న కార్లకు పెట్టింది పేరు. ఒకప్పుడు మధ్యతరగతిని బాగా ఆకట్టుకున్న ఈ కంపెనీ కూడా చిన్న కార్ల తయారీ పట్ల మొగ్గు చూపడం లేదు. మారుతీ 800, ఆల్టో, వాగన్ ఆర్ వంటి కార్ల పేరు చెబితే మారుతీ సుజుకీయే గుర్తుకు వచ్చేది. ఈ మాటనే జర్నలిస్టులు ఆ కంపెనీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ్ ను అడిగినపుడు.. అబ్బే, అటువంటిదేమీ లేదని, 2026 ఆర్థిక సంవత్సరంలో చిన్న కార్ల తయారీని పునరుద్ధరించి గ్రామీణ ప్రాంత మార్కెట్ ను ఆకట్టుకుంటామన్నారు. ఈ ఏడాది ఈ కంపెనీ కూడా ఓ ఎస్.యు.వీని మార్కెట్ కి విడుదల చేసింది.మొత్తం SUV పోర్ట్ ఫోలియోలో మారుతీ SUV వాహనాల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి.
హుండాయ్, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా కంపెనీలు పూర్తిగా పెద్ద కార్ల వైపే మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఏమన్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఓ ట్రెండ్ మొదలైంది. క్లీన్, పూర్తి కాలుష్య రహిత కార్ల అనివార్యత పెరిగింది. దీంతో మేము కూడా త్వరితగతిన ట్రెండ్ మార్చుకుని గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ ఉండే కార్ల తయారీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందన్నారు.
కియా, ఎంజీ మోటార్స్ వంటివి చిన్న కార్ల తయారీని దాదాపు నిలిపివేసి పూర్తిగా పెద్ద వాటివైపే దృష్టి సారించాయి.
మొత్తంగా చూసినపుడు చిన్న కార్లకు పెద్ద కష్టమే వచ్చేలా ఉంది. గతంతో పోల్చుకుంటే చిన్న కార్ల ప్రొడక్షన్ కూడా బాగానే తగ్గింది. 5 సీట్ల మారుతీ ఆల్టూ, రేనాల్ట్ క్విడ్ వంటి కార్ల అమ్మకాలు కూడా తగ్గాయి. 2019తో పోల్చుకుంటే 2024 ఆర్ధిక సంవత్సరంలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాల్లో 14 శాతం తరుగుదల కనిపిస్తోంది.
ఈ తరుగుదల ఇప్పటికిప్పుడు మొదలైందేమీ కాదని, 2006 బడ్జెట్ నుంచే మొదలైందని కార్ల తయారీరంగ నిపుణులు చెబుతున్నారు. 2006లో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం 4 మీటర్ల పొడవుండే కార్లు, నిర్దిష్ట ఇంజిన్లు ఉండే కార్లపై ఎక్సైజ్ డ్యూటీని 24 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. దాంతో అప్పుడప్పుడే మధ్య తరగతి నుంచి ఉన్నత స్థితికి చేరుతున్న వారు, అప్పటికే సంపన్నలుగా ఉన్న వారు ఖరీదైన, పొడవైన కార్ల వైపు మొగ్గుచూపారు. దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన టాటా నానో, హోండా బ్రియో, ఆల్టో వంటి వాటికి ఆదరణ లేకుండా పోయింది. ఇప్పుడందరి చూపూ పెద్ద కార్ల వైపే ఉందనేది స్పష్టమైంది.
ఒకప్పుడు లక్షన్నర రెండు లక్షల రూపాయలుగా ఉండే కార్లు ఇప్పుడు లేవు. కోటిన్నర, రెండు కోట్లు, మూడున్నర కోట్ల రూపాయల కార్లు కూడా మార్కెట్ లో ఉన్నాయి. జర్మన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Porsche ఇటీవల మార్కెట్ కు విడుదల చేసిన SUV మకాన్ కారు ప్రారంభ ధర 1.22 కోట్లు.
మూడు కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ కార్లు ఇండియాలోనూ అందుబాటులో ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, మెర్సిడెస్-బెంజ్ వంటి ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారుల మోడళ్లు ఉన్నాయి.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII: ఈ కారు ముఖేష్ అంబానీ తన కలెక్షన్‌లో ఉంచారు. దీని ధర సుమారు ₹13.5 కోట్లు ఉంటుంది. రోల్స్ రాయిస్ కల్లినన్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఈ కారును సొంతం చేసుకున్నారు. దీని ధర సుమారు ₹6.95 కోట్లు ఉంటుంది. మెర్సిడెస్-బెంజ్ S680 గార్డ్: ఆకాష్ అంబానీ ఇటీవల ఈ బుల్లెట్‌ప్రూఫ్ కారును సుమారు ₹15 కోట్లకు కొనుగోలు చేశారు。