జనం పట్టించుకోవడం లేదు.. జగన్ పట్టించుకోవడం లేదు
గెలవకు ముందు ఒక మాట.. గెలిచాక మరో మాట. అవతలి వారు ఊగిసలాటలో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని సాధిస్తా. లేదంటే నా వల్ల కాదు. ఇది జగన్ వ్యవహారం.
Byline : The Federal
Update: 2024-05-02 12:48 GMT
గత ఎన్నికల సందర్భంగా హోదా పేరు చెప్పి ఓట్లు రాబట్టడంలో వైఎస్ జగన్ కృతకృత్యుడయ్యారు. అయితే అధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు దక్కించుకున్న సీఎం జగన్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నందు వల్ల మనమేమీ చేయలేక పోతున్నామే తప్పా హోదాపై తమ పోరాటం ఆగదని, కేంద్రం ప్రకటించే వరకు ప్రధాని మోదీని నిలదీస్తూనే ఉంటామనే మాట చెప్ప లేక పోయారు. హోదా ఇవ్వాల్సిందేనని, రాష్ట్ర విభజన సందర్భంలో బిజెపీ పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీసిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు మరచి పోలేదు.
ప్రతిపక్ష నేతగా జగన్ మాటలు
ప్రతి ఓటు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కు పటేట్టు చూసుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీకి వచ్చేట్టు చూసుకొని మొత్తం మనమే పెట్టుకుందాం. మొత్తం మనమే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధాని మంత్రి కావాలనుకున్నా కూడా వాళ్లకు మనము చెప్పేది ఒక్కటే ఎప్పుడో చేస్తామంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత మేము మద్దతు ఇస్తామని చెబుదాం. 2019, మార్చి 11న ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలు. కే్రందంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రం మెడలు వంచి మరీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని గర్జించారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరం మార్చిన జగన్
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ గర్జించిన స్వరంలో మార్పులు వచ్చాయి. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన తర్వాత మాట్లాడిన జగన్ ప్రత్యేక హోదాపై మాట మార్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపీ ప్రభుత్వానికి 250 కంటే అధిక స్థానాలు వచ్చాయని, వారికి మన అవసరం లేకుండా పోయిందని మాట్లాడారు. దీంతో రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాపై మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని చేతులెత్తేశారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. సీఎం అయిన తర్వాత 2019 మే 25న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనే ఒక్క అంశం మీదనే 250 సీట్లు బిజెపీకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు బిజెపీకి మన అవసరం వచ్చి ఉండేది. మద్దతు కోసం కోరే వారు. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టిన తర్వాతనే నూతన ప్రభుత్తం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేది. దురదృష్ట వశాత్తు అది జగర లేదు. అది జరగ లేదు కాబట్టి, వారితో మన అవసరం లేదు. కాబట్టి మన బాధ ఇది అని చెప్పుకో గలుగుతామని జగన్ చెప్పడం విశేషం. కేంద్రంలో సంపూర్ణమైన మెజారిటీ రాకపోయి ఉండుంటే మద్దతు కోసం మన మీద ఆధారపడే వాళ్లు. దీంతో రాష్ట్రానికి మంచి జరిగి ఉండేది. కే్రంద ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తే మేము మద్దతిస్తాము సంపూర్ణంగా అని చెప్పి అన్నారు.
సంఖ్యా బలమున్నా ప్రయత్నం సున్నా
లోక్ సభ, రాజ్య సభలో కలిపి వైఎస్‌ఆర్‌సీపీకి సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. అయినా ఒక్క సారి కూడా కే్రందంపైన, ప్రధాని నరేంద్ర మోదీపైన ఎందుకు ఒత్తిడి తేలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మోదీ తీసుకొచ్చిన వివాదాస్పాద బిల్లులకు కూడా వెనుకా ముందుకు చూడకుండా మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు తెలుపుతామనే షరతు ఏ నాడు తెరపైకి తీసుకొని రాలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఇదే అంశంపై ఆంధ్రా యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి డాక్టర్ గోవాడ వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు ఒక మాట చెప్పి నేడు ఒక మాట మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయ పడ్డారు. హోదా అనేది రాష్ట్రానికి అయుపట్టు అనుకున్నప్పుడు అది సాధించేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉండాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నందు వల్ల మనమేమి చేయలేక పోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేయడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు అనాల్సిన మాట కాదని, ఎలాగైనా హోదా సాధించే వరకు పట్టు విడవకుండా ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన వారవుతారని అభ్రిపాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.