శిరస్సు లేని దేవత .. పసుపు నీళ్లతోనే పరవశం!

ఓంకార రూపంలో అమ్మవారి దర్శనం. ప్రతి బుధవారం వేలాది బిందెలతో జలాభిషేకం. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తుల రాక. విశాఖలో విశేష పూజలందుకుంటున్న ఎరుకుమాంబ. నేడు అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం.

Update: 2024-10-17 03:40 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

శిరస్సు లేని దేవుడు గాని, దేవత గాని ఎక్కడైనా ఉంటారా? అలా ఉంటారని ఎవరైనా ఊహిస్తారా? అదేమి ప్రశ్న అని అనుకుంటున్నారా? అనుకోకండి! నిజంగానే అలాంటి దేవత ఉంది. శిరస్సు లేకపోవడం ఒక విచిత్రమైతే.. ఆ శిరస్సును కాళ్ల వద్దనే ఉంచుకోవడం.. ఆ తల లేని మొండేనికే వారం వారం జలాభిషేకం చేయడం మరో విశేషం! పండ్లు, పూలకంటే బిందెడు పసుపు నీళ్లతోనే పరవశించిపోయే ఆ దేవత పేరు ఎరుకమాంబ. భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఆమె ఖ్యాతి ఎల్లలు దాటింది. ఎన్నో వింతలు, విడ్డూరాల ఆ దేవత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కొలువై ఉంది. ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం మీ కోసమే!!

అమ్మవారికి శిరస్సు ఎందుకు లేదంటే?

ఈ ఎరుకుమాంబ అమ్మవారిని భక్తులు గౌరీ దేవి స్వరూపంగా భావిస్తారు. మూడో శతాబ్దంలోనే వెలసినట్టు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది. స్థల పురాణం ప్రకారం.. ఒకప్పుడు విశాఖ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న వైర్లెస్ కాలనీలో ఈ అమ్మవారు పూజలందుకునే వారు. రైల్వేస్టేషన్ నిర్మాణ సమయంలో అమ్మవారిని అక్కడే వదిలేసి అంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే భక్తులు ఎక్కడ ఉంటే తానూ అక్కడే ఉంటానని, తనను ఎద్దుల బండిపై తీసుకెళ్లాలని, ఆ బండి ఎక్కడ ఆగిపోతే అక్కడే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఓ భక్తుడి కలలోకి వచ్చి చెప్పారు. దీంతో ఎరుకుమాంబ విగ్రహాన్ని ఎద్దులబండిపై తీసుకొస్తుండగా అక్కయ్యపాలెం దొండపర్తి జంక్షన్ వద్దనే ఆగిపోయింది.

 

ఆ సమయంలో అమ్మవారి శిరస్సు విరిగిపడింది. అతికించేందుకు ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు. తన శిరస్సును అతికించే ప్రయత్నించవద్దని, తన కాళ్ల వద్ద ఉంచాలని, కంఠంపై నుంచి పసుపు నీళ్లు పోస్తే చాలని చెప్పారని స్థల పురాణంలో ఉంది. అప్పట్నుంచి ఈ గుడికి వెళ్లి భక్తులు అమ్మవారికి పసుపు నీళ్లు పోయడం ఆనవాయితీగా వస్తోంది. విగ్రహానికి శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది. దీంతో అమ్మవారు భక్తులకు ఓంకార రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం వెనక భాగంలో పరమ పవిత్రమైన శ్రీచక్రం కూడా ఉందని పూజారులు చెబుతారు. చాన్నాళ్ల క్రితం నుంచే ఈ ఆలయం దేవదాయశాఖ అధీనంలో ఉంది.

ప్రతి బుధవారం జలాభిషేకం..

ఎరుకుమాంబ అమ్మవారికి ప్రతి బుధవారం పవిత్రమైన పసుపు నీళ్లతో జలాభిషేకం చేస్తుంటారు భక్తులు. మూడు వారాల పాటు (ప్రతి బుధవారం) మూడు బిందెల చొప్పున పసుపు నీళ్లు శిరస్సు లేని అమ్మవారికి పోస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. అలా మూడు దశాబ్దాల క్రితం ప్రతి బుధవారం రెండంకెలకు మించని నీళ్లు పోసే భక్తుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. గతంలో ఖాళీగా ఉండడం వల్ల నేరుగా నీళ్లు పోసుకునే వారు. ఇప్పుడు భక్తుల రద్దీ వేలల్లో ఉండడంతో చాలా దూరం క్యూలో నిలబడాల్సి వస్తోంది. బుధవారం రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు పసుపు నీళ్లు పోయడానికి అవకాశం కల్పిస్తారు. సాయంత్రం నాలుగ్గంటలకు నీళ్ల పోతకు కాస్త విరామం ఇచ్చి అమ్మవారి విగ్రహానికి పసుపు పూస్తారు. అనంతరం మళ్లీ నీళ్ల పోతను కొనసాగిస్తారు. భక్తులకు కావలసిన పసుపు నీళ్లను ఆలయ ప్రాంగణంలోనే అందుబాటులో ఉంచుతారు. భక్తులు మూడు బిందెలకు రూ.15 చెల్లిస్తే పసుపు నీళ్లు ఇస్తారు. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ అమ్మవారి ఆలయం తెరిచే ఉంటుంది. అయితే ఆ రోజుల్లో భక్తుల తాకిడి నామమాత్రంగా ఉంటుంది. స్థానిక దొండపర్తి వాసులు ఎరుకుమాంబ అమ్మవారిని తమ గ్రామదేవతగా కొలుస్తారు.

 

108 బిందెల మొక్కు..

కొంతమంది భక్తులు తమ కోర్కెలు తీరితే అమ్మవారికి 108 బిందెల పసుపు నీళ్లు పోసుకుంటామని కూడా మొక్కుకుంటారు. ఇందుకు రూ.500 టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో సగటున పది మందికి మించని 108 బిందెల భక్తులు ఇప్పుడు వందలకు చేరుకున్నారంటే ఈ దేవతపై నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బుధవారం పసుపు నీళ్లు పోసుకున్న భక్తులు ఆ మర్నాడు గురువారం ఉదయం అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ' ఎన్నో ఒడుదొడుకులతో ఉన్న నాకు ఎరుకుమాంబ అమ్మవారిని నమ్ముకున్నాక నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఇద్దరు పిల్లలను, మంచి జీవితాన్ని అమ్మవారు ప్రసాదించారు. ఆ అమ్మవారు గురించి ఎంత చెప్పినా తక్కువే'నని కాకినాడ జిల్లా తునికి చెందిన భక్తురాలు కసిరెడ్డి అశ్వని 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో తన నమ్మకాన్ని పంచుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచీ..

తొలినాళ్లలో అమ్మవారికి పసుపు నీళ్లు పోయడానికి ఆలయం సమీప ప్రాంతాల వారే వచ్చేవారు. కానీ కాలక్రమంలో విశాఖ నగరంతో పాటు కొన్నేళ్ల నుంచి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడుల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించుకుంటే తమ కోర్కెలు తీరాయని భక్తులు చెప్పుకోవడం ఆనోటా ఈనోటా ఇతర రాష్ట్రాలకూ పాకింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ముందు రోజే విశాఖ చేరుకుని మర్నాడు ఎరుకుమాంబకు జలాభిషేకం చేసుకుని వెళ్తుంటారు.

స్థల మార్పునకు ససేమిరా..

పాతికేళ్ల క్రితం అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణలో ఎరుకుమాంబ విగ్రహాన్ని ఆలయ వెనక భాగానికి మార్చే ప్రయత్నం చేశారు. 'గర్భగుడిలో ఉన్న ఘనాపాటీలు అమ్మవారి విగ్రహంపై చేయి వేయగానే 'నన్నే కదుపుతారు రా' అంటూ ఆకాశవాణి వినిపించడంతో భయకంపితులై.. మహాకాళీ స్వరూపం ఈ అమ్మవారు. కదపడం అసాధ్యం.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పట్నుంచి కదిపే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ జంతు బలి నిషిద్ధం. శిరస్సు లేని ఈ అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. అందుకే ఓంకారం ఏర్పాటు చేసి పసుపు నీళ్లతో శాంతింపజేస్తారు. 20 ఏళ్ల క్రితం బుధవారం వంద మంది లోపే భక్తులు పసుపు నీళ్లు పోసేవారు. ఇప్పుడు వేలల్లో పోస్తున్నారు' అని ఆలయ ప్రధానార్చకుడు గంగవరపు శ్రీనివాసరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు తెలిపారు.

గౌరమ్మ ఉపాసకురాలు హైమావతి..

ఈ ఆలయంలో ఎరుకుమాంబకు శిరస్సు లేకపోవడం, వారం వారం జలాభిషేకం చేయడం ఒక ప్రత్యేకతగా చెప్పుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నుంచి విశాఖకు చెందిన మహిళ హైమావతి ఈ అమ్మవారికి ఉపాసకురాలిగా ఉన్నారు. ఆమెపై అమ్మవారు ఆవహించి భవిష్యవాణి చెబుతుంటారు. పర్వదినాల్లో ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 'ఎరుకుమాంబ అమ్మవారి మహిమలు అన్నీ ఇన్నీ కావు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తారు. సత్యానికి మారు పేరు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి పసుపు నీళ్లు పోస్తారు. ఈ అమ్మవారు పసుపు నీళ్లే తప్ప ఇంకేమీ అడగరు' అని హైమావతి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

 

పర్వదినాలు ఎప్పుడంటే?

ఎరుకుమాంబ అమ్మవారికి ఏడాదిలో నాలుగు పర్వదినాలు జరుపుతుంటారు. మహా శివరాత్రి, భీష్మ ఏకాదశి, శ్రావణ పౌర్ణమి, అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం (అక్టోబర్ 16)లను విశేషంగా నిర్వహిస్తారు. వీటిలో మహా శివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుతారు. ఆవిర్భావం రోజున ఎరుకుమాంబకు భారీ అన్న రాశిని పోస్తారు. వేలాది మందికి అన్నదానం చేస్తారు.

Tags:    

Similar News