శ్రీకాళహస్తి : అఘోరి ఆత్మహత్యాయత్నం

ముక్కంటి క్షేత్రం వద్ద కలకలం చెలరేగింది. తెలంగాణ నుంచి వచ్చిన మహిళ అఘోరి కలకలం రేపింది.

Byline :  The Federal
Update: 2024-11-07 07:05 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి తీరు చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయం వద్ద గురువారం ఉదయం నాగ సాధువుగా చెప్పుకుంటున్న ఆ మహిళ అఘోరి ఆత్మార్పణకు విఫయయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెపై నీళ్ళు పోసి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనతో శ్రీకాళహస్తి ఆలయం వద్ద కలకలం చెలరేగింది.



ఇప్పటి వరకు తెలంగాణలో కొద్దిరోజులుగా లేడీ అఘోరి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈమె వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. సనాతన ధర్మం కోసం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మర్పణం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఆ మహిళ అఘోరీని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుస్నేపల్లి లో ఉన్న ఆమె ఇంటిలోనే నిర్బంధించారు. తర్వాత ఆ మహిళ అఘోరీని మహారాష్ట్ర సరిద్దులోని వాంకిరి మండలం లక్డీకోట వరకూ తీసుకువెళ్లి వదిలేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో తన ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడంతో మహిళా అఘోరి ఆంధ్రాలోకి ప్రవేశించింది. తెలంగాణాలో తన ప్రయత్నం విఫలం కావడంతో..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం వద్దకు చేరుకున్నారు. దిగంబరంగా ఉన్న ఆ మహిళా అఘోరీని ఆలయ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆమె వచ్చిన కారు వద్ద ఆపివేశారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, అఘోరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

భద్రతా సిబ్బందిని ఏమాత్రం ఖాతరు చేయని ఆ మహిళా అఘోరి శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిస్తుండగానే పెట్రోల్ క్యాన్ కారు నుంచి బయటికి తీసింది. కాసేపటికి డ్రైవర్ కూర్చునే వైపు డోర్ తెరిచిన మహిళా అఘోరి ముందుకు కదలడంతో క్యాన్ లోపలి పెడుతోందని పోలీసులు భావించారు. వెంటనే ఐదు లీటర్ల క్యాన్ మూత తీసి పెట్రోలు మొత్తం తన శరీరంపై పోసుకుంది. ఆ తర్వాత తాను వచ్చిన కారుపై కూడా పెట్రోల్ వెదజల్లింది. దీంతో సమీపంలోనే ఉన్న పోలీసులతోపాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా పెట్రోల్ పడింది. ఈ చర్య ద్వారా
మహిళా అఘోరీ ఆత్మా అర్పణ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఎంతో వెంటనే అప్రమత్తమైన శ్రీకాళహస్తి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, సివిల్ మహిళ పోలీసులు మహిళా అఘోరిని అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకున్న మహిళ అఘోరీరపై చన్నీళ్లు కుమ్మరించారు. ఆ తర్వాత దిగంబరంగా ఉన్న ఆ మహిళ అఘోరికి వస్త్రం చుట్టారు..
ఈ సందర్భంలో కూడా పోలీసు, ఆలయ సెక్యూరిటీ సిబ్బందీని మహిళా అఘోరి ప్రతిఘటించారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయం సమీప ప్రాంతాలతో పాటు పట్టణంలో కలకలం చెలరేగింది.

ఆలయంలోకి అనుమతించాలని మహిళా అఘోరీ పట్టు పట్టింది. "ఎలాగైనా సరే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తీరుతా" అని భీష్మించడంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దిగంబరంగా వెళ్లడానికి అనుమతించమని తెగేసి చెప్పారు. దీంతో ఆ మహిళ అఘోరి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ముందస్తు విహంతోనే పెట్రోల్ క్యాన్లు నింపుకొని వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆలయ ముందు బైఠాయించిన అగోరి తన నిరసన కొనసాగిస్తున్నట్లు సమాచారం అందింది.కాగా, అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News