Tirumala | ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి విహారం ఎప్పుడంటే..

తిరుమల మినీ బ్రహ్మోత్సవానికి సిద్ధం అవుతోంది. వాహనాల ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి ఉత్సవాల క్యాలెండర్ కూడా ప్రకటించింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-31 02:59 GMT

తిరుమల శ్రీవారి క్షేత్రం నిత్యకల్యాణం. పచ్చతోరణంగానే ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానంగా శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు. తరువాత రథసప్తమికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికులు కూడా లక్షల్లోనే ఉంటారు. విశేష పర్వదినాల్లో శ్రీవారి మూలమూర్తితో పాటు మాడవీధుల్లో ఉభయ దేవేరులతో కలిసి విహరించే మలయప్పస్వామి వారి ఉత్సవాలను చూడడానికి ప్రత్యేక ఆస్తక్తి చూపిస్తారు.

తిరుమలలో ఫిబ్రవరి నాల్గవతేదీ నిర్వహించనున్న రథసప్తమికి టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 15 రోజుల కిందటి నుంచే మాడవీధుల్లో పటిష్ట భద్రత, యాత్రికులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి అవసరమైన చర్యలకు టీటీడీ అధికారులు సమీక్షలకు శ్రీకారం చుట్టారు. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అన్ని విభాగాలను సమన్వయం చేయడంతో పాటు బాధ్యతలు కూడా వికేంద్రీకరించారు. తాజాగా శ్రీవారి ఉత్సవమూర్తుల విగ్రహాలను ఊరేగించే పల్లకీల నాణ్యత పరిశీలనకు ట్రయల్ రన్ నిర్వహించారు.

వాహనాల పటిష్టతపై దృష్టి
రథసప్తమి అంటే మినీ బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. సూర్యోదయం మొదలు సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉభయదేవేరులతో మలయప్ప రెండు గంటల విరామంతో మాడవీధుల్లో విహరిస్తారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందే యాత్రికులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకారభూషితుడైన మలయమప్పస్వామి వారు ఊరేగించే పల్లకీల నాణ్యతను పరిశీలించడం ఆనవాయితీ. ప్రస్తుతం రథసప్తమి నాడు స్వామివారిని ఊరేగించే వాహనాల తనిఖీ సాగిస్తున్నారు. తాజాగా సర్వభూపాల వాహనాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు. వాహనబేరర్లు (పల్లకీమోసే మోతగాళ్లు) ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా అధికారులు పరిశీలించారు.
ఎందుకంటే..
చెక్కు చెదరని బరువైన తుండ్లు, మధ్యలో చెక్కతో తయారు చేసిన పల్లకీ అమర్చి ఉంటారు. ఇది కనీసం అంటే అర్ధ టన్ను బరువు ఉంటుంది. ఇక వాహన సేవ జరిగే సమయంలో అలంకరణకు వాడే వస్తువులు, స్వామివారి విగ్రహాలను అలంకరించి ఆశీనులు చేసే మరో పల్లకి, విగ్రహాల ముందు ఇద్దరు అర్చకులు, గొడుగులు పట్టుకున్న మరు ఇద్దరు అయ్యవార్లు, వారికి తోడు మరొకరు పల్లకిపై కూర్చొంటారు. దీంతో ప్రతివాహనం రెండు నుంచి రెండున్నర టన్నుల బరువు ఉంటుంది. దీనిని వాహనబేరర్లు మాడవీధుల్లో భుజాలపై మోయడం తెలిసిందే.
విశేష పర్వదినాల సమయంలో వాహనసేవ నిర్వహించడానికి వీలుగా ముందస్తుగా, పల్లకీల నాణ్యతను పరిశీలించడం పరిపాటి. అదే కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరిగే సమయంలో ఎలాంటి అపశృతి లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోటెత్తనున్న యాత్రికులు
ఈ ఉత్సవాలకు యాత్రికులు పోటెత్తుతారు. అందకు ప్రధాన కారణంగా బ్రహ్మోత్సవాల్లో అయితే ఉదయం, రాత్రి మాత్రమే శ్రీవారి ఉత్సవమూర్తులను పల్లకిపై ఊరేగిస్తారు. అంటే పది రోజుల పాటు ఉత్సవాలు సాగిస్తారు. అదే.. రథసప్తమి రోజూ అన్ని వాహనసేవలను ఒకో రోజు చూసే భాగ్యం ఉంటుంది. దీంతో యాత్రికులు సాధారణ రోజులతో పోలిస్తే, సుమారు మూడు లక్షలకు పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో తిరుమల మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఇబ్బంది లేకుండా అల్పాహారం, పాలు, టీ, కాఫీతో పాటు మంచినీరు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి బాధ్యతలు విభాగాల వారీగా వికేంద్రీకరించారు.
"శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టత పరిశీలనకు ట్రయల్ రన్ నిర్వహించాం మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లోకి సర్వభూపాల వాహనం ఎక్కువ బరువు ఉంటుంది" అని టిటిడి అధికారులు స్పష్టం చేశారు. ఈ వాహన సేవ సమయంలో వాహన బేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాం" అని తెలిపారు.
ఫిబ్రవరిలో విశేష పర్వదినాలు
ప్రతి కార్యక్రమానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాలకు ప్రతినెలా క్యాలెండర్ ఉంటుంది. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న కార్యక్రమాలను టీటీడీ వెల్లడించింది.
ఫిబ్రవరి 2 - వసంత పంచమి
ఫిబ్రవరి 4 - రథ సప్తమి
ఫిబ్రవరి 5 - భీష్మాష్టమి
ఫిబ్రవరి 6 - మధ్వనవమి
ఫిబ్రవరి 8 - భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి 12 - శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ
ఫిబ్రవరి 24 - సర్వ ఏకాదశి
ఫిబ్రవరి 26 - మహాశివరాత్రి


Tags:    

Similar News