రాజ్య హింస మాపై కొనసాగింది
ప్రొఫెసర్ సాయిబాబా పోరాట పటిమను కీర్తిస్తూ ప్రచురించిన పుస్తకాలను విరసం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.;
సమాజానికి ఎంతో చేయాలనుకున్నాం. సమకాలీన సమాజం గురించి నిత్యం చర్చించే వాళ్లం. రచించే వాళ్లం. అని ప్రొఫెసర్ జీఎస్ సాయిబాబా సహచరి ఏఎస్ వసంతకుమారి అన్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ‘ప్రపంచ విప్లవ మానవుడు కామ్రేడ్ సాయిబాబా’ అంటూ అరుణతార వేసిన ప్రత్యేక సంచికను సాయి బాల్యమిత్రుడు కేఎంఎంఆర్ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం ‘నువ్వెళ్లిన దారిలో’ సాయిబాబాపై స్పూర్తి కవిత్వ సంకలనాన్ని సాయిబాబా సహచరి ఏఎస్ వసంతకుమారి ఆవిష్కరించారు. ఈ కవిత్వ సంకలనానికి వైష్ణవశ్రీ సంపాదకురాలుగా వ్యవహరించారు. వసంత కుమారి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. చదువుకునే రోజుల నుంచి సాహిత్యంపై సాయిబాబా అనేక పరిశోధనలు చేశారని, దానిని పుస్తక రూపంలో తీసుకు రావాలనుకుంటున్న సమయంలో సాయిబాబా అరెస్టు జరిగిందన్నారు. అరెస్టు అయిన తర్వాత జైలు జీవితం గురించి కూడా ఆయన పుస్తకం రాయాలని భావించారని అన్నారు. అయితే ఆలోపే జీవితం చాలించారన్నారు. ఏదైనా మాటలతో మభ్య పెట్టే ఆలోచనలు సాయిబాబా చేసే వారు కాదని, చెప్పింది ఆచరణలో పెట్టావారని అన్నారు.
ఆయన చేసిన రచనలన్నీ సమకాలీన సమాజం గురించి ఆలోచింప చేసేవిగానే ఉన్నాయన్నారు. చదువుకునే రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఎక్కువుగా స్నేహితులతో అందరం కలిసి ఉండేవాళ్లమని, కలవడం కుదరని సమయాల్లో మా ఇద్దరి మధ్య ప్రేమకు సంబంధించిన ఎన్నో ఉత్తరాలు రాసుకునే వాళ్లమని అన్నారు. గొప్ప వ్యక్తుల రచనలన్నీ దాదాపు అవపోసన పట్టారని, తన చేత కూడా ఆ పుస్తకాలను చదివించారన్నారు. చదవడంతోనే సరిపెట్టకుండా ఆ రచనలపై మా ఇద్దరి మధ్య ఎక్కువ సమయం చర్చ జరిగేదని, తాము చర్చించిన రచనల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే అంశాలను నోట్ చేసుకునే వాళ్లమని అన్నారు. భవిష్యత్ తరాల కోసం ఎన్నో రచనలను చేయాలని కలలు కన్నారని అన్నారు. అయితే ఆ అవకాశం రాకుండానే జైలు నుంచి వచ్చిన ఏడు నెలలకే సాయిబాబా చనిపోవడం తీరని బాధను మిగిల్చిందన్నారు. నడవలేని సాయిబాబాను నువ్వు ఎలా ప్రేమించావని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. సమాజంపై మా ప్రభావం ఏ విధంగా ఉండాలి.. అనే అంశంపై చర్చ జరిగినప్పుడు ఇద్దరి భావాలు ఒకే విధంగా ఉండేవని ఆ భావాలే.. మా మనసులను కూడా కలిపాయన్నారు.
సాయిబాబా బాల్య స్నేహితుడు కేఎంఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సాయిబాబాతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గోదావరి తీరంలో వెన్నల రాత్రులు, సముద్రం తీరంలో సూర్యోదయాలు ఎన్నో గడిపామన్నారు. ఏమి ఆలోచించినా.. ఏది రాసినా సాయిబాబా అణగారిన, దళిత, ఆదివాసీల ఉన్నతిని కాంక్షించే విధంగానే రాస్తారన్నారు. మా స్నేహం సాయిబాబా సహచరి వసంతకుమారితో కలిసి సాగిందన్నారు. అందరం ఎన్నో రాత్రులు ఒకే చోట కూర్చుని చలం పుస్తకాలపై చర్చించిన సందర్భాలు ఉన్నాయన్నారు. చలం రచనలు సాయిబాబాను ఎంతగానో ప్రేరణకు గురి చేశాయన్నారు. ఇంటర్ చదువుతూ పదో తరగతి వారికి, డిగ్రీ చదువుతూ ఇంటర్ వారికి సాయిబాబా ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పేవారన్నారు. సాయిబాబా ఇంగ్లీషుపై మంచి పట్లు సాధించారని, తెలుగులోను అదే స్థాయిలో పట్టు సాధించారన్నారు. సమాజం చైతన్య వంతం కావడాన్ని జీర్ణించుకోలేని పాలకులు సాయిబాబాను నిర్భంధించి ఆయన జీవితంతో ఆటలాడారన్నారు. జైలులో ఉన్న కాలంలోను ఇంగ్లీషు భాషలో చాలా రచనలు చేశారన్నారు. బాల్య జీవితం, విద్యార్థి దశ, ఉద్యోగ నిర్వహణ, ఉద్యమాలకు ప్రోత్సాహం వంటి అనేక అంశాలను ప్రసాద్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.