అన్నింటిపైనా అధ్యయనాలేనా?

ఏదీ తమ మీద ఉండకూడదు. అందుకే అధ్యయనాలు. ఆ తరువాత ఏమి చేసినా అన్నీ ఆలోచించే చేశామనొచ్చు. ఇంతకీ ఏమిటీ అధ్యయనాలు. ఎందుకు?

Update: 2024-08-04 03:18 GMT

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి 55 రోజులైంది. నేటికీ అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం తప్పులు చేసిందని, వాటిని సరిదిద్దే పనిలో ముందుకు సాగుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తమ శాఖలతో మంత్రులు సమీక్షలు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి అన్ని శాఖలతో సమీక్షలు మొదులు పెట్టారు. ఈనెల 5,6 తేదీల్లో కలెక్టర్‌లు, ఎస్‌పిలతో సమీక్ష సమావేశం జరగనుంది.

ప్రస్తుతానికి రాష్ట్రంలో నాలుగు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు అంశాల్లో ఒకటి కొత్తది కాగా మిగిలిన మూడు అంశాలు గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం వల్ల జరిగిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలు. ఈ అంశాలపై ప్రభుత్వం వేసిన జాతీయ, అంతర్జాతీయ నిపుణుల బృంధాలు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వం భావించి ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇందులో ప్రధాన మైనది రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం నిర్మించిన భవనాలు. ఈ భవనాల నాణ్యత గురించి అధ్యయనం చేసేందుకు ఐఐటీ ఇంజనీర్ల కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో శుక్రవారం చెన్నైకి చెందిన కమిటీ పలు భవనాల నాణ్యతపై రిపోర్టు ఇచ్చింది. శనివారం హైదరాబాద్‌కు చెందిన నిపుణుల కమిటీ మరికొన్ని భవనాలు పరిశీలించి రిపోర్టు తయారు చేసింది. ఇంత వరకు భవనాలను ఇలాగే మురమ్మతులు చేసి కొనసాగిద్దామా? మరో ప్రాంతంలో కొత్త భవనాలు నిర్మిద్దామా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇందులో సచివాలయంతో పాటు మిగిలిన భవనాల పునాదులు, కట్టిన భవనాలు ఉన్నాయి.
Delete Edit
రెండవది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్‌ వరద నీటికి కొట్టుకుపోయి నాణ్యత లోపించిందని అంతర్జాతీయ నిపుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌ను ఆనుకుని మరో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించి దానిపై ఆనట్ట కడితే మంచిదనే అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తరువాత అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించిన మొదటిది పోలవరం ప్రాజెక్టు. ఇది జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్రం చొరవ తీసుకుని ఇటీవల పెట్టని యూనియన్‌ బడ్జెట్‌లో రూ. 15వేల కోట్లు కేటాయించింది. ఈ మొత్తం 30 సంవత్సరాల్లో అప్పు తీర్చాల్సి ఉంటుందని, అది కేంద్రం తీరుస్తుందా? రాష్ట్రం తీర్చాల్సి ఉంటుందా అనేది తర్వాత నిర్ణయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు.
Delete Edit
మూడో అంశం నూతన మద్యం పాలసీ గురించి అధ్యయనం. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ మద్యం పాలసీలు ఎలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారిందని, మద్యం నిల్వలు పూర్తవగానే ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్‌లు మార్కెట్లోకి వస్తాయని మద్యం ప్రియులు ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. పాత బ్రాండ్‌లే కొనసాగుతున్నాయి. ధరలు కూడా అవే కొనసాగుతున్నాయి. మద్యం విధానం ఎలా ఉంటుందో? ఏవిధంగా రూపొందించాలో తెలుసుకునేందుకు అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. కనీసం మరో నెలైనా సమయం తీసుకునే అవకాశం ఉంది. నాలుగు బృంధాలు రాష్ట్రంలో పర్యటించి నివేదిక రూపొందించాల్సి ఉంది. 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం వారి హయాంలో మద్యం మాల్స్‌ కూడా పెద్ద నగరాల్లో ఏర్పాటు చేశారు. నేరుగా మాల్‌లోకి కొనుగోలు దారులు ప్రవేశించి వారికి నచ్చిన మద్యం బాటిల్స్‌ కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా మాల్స్‌ విధానం కొనసాగుతోంది. షాపులు నిర్వహించే వారి నుంచి డిపాజిట్లు స్వీకరించి లాటరీ ద్వారా ఎంపిక చేసి షాపులు దక్కించుకున్న వారి నుంచి తీసుకున్న డిపాజిట్స్‌ ప్రభుత్వం తీసుకుని వారికి షాపును అప్పగించింది. మిగిలిన వారి డిపాజిట్లు తిరిగి ఇచ్చేసింది. ఇప్పుడు ఆ విధానం కూడా బాగోలేదని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఏ విధమైన విధానం అమలులోకి రానుందో వేచి చూడాల్సిందే.
Delete Edit
నాలుగో అంశం రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణ సౌకర్యం. ఈ అంశంపై ఇప్పటికే పలు అధ్యయనాలు చేశారు. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న మహిళలకు ఉచిత ప్రయాణంపై అధ్యయనాలు పూర్తయ్యాయి. ఆ రాష్ట్రాల్లో పథకం అమలు తీరుకంటే భిన్నంగా మరేమైనా చేయొచ్చా అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. పూర్తిగా ఉచితం కాకుండా టిక్కెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. రవాణా శాఖ మంత్రి ఈ విషయంపై మరింత లోతుగా ఆలోచనలు చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇవే కాకుండా సూపర్‌ సిక్స్‌లో ఉన్న మరికొన్ని పథకాలపై కూడా ప్రత్యేక సమీక్షలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3వేలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. నెలనెలా ఒక్కో నిరుద్యోగికి మూడు వేలు ఇవ్వాలంటే భారంతో కూడిన విషయమేననే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదోతరగతి చదువుకున్న వారితో కలిపి ఇవ్వాలా, పది పైన చదువుకున్న వారికి భృతి ఇవ్వాలా? అనే అంశంపై కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. నిరుద్యోగి అంటే పది పాసైన వారి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉన్న స్కిల్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది వారు ఎంత మంది ఉన్నారనే లెక్కలు త్వరలోనే వెల్లడించనుంది. ఇలా ప్రతి అంశాన్ని ఆచితూచీ ఆలోచిస్తోంది. అలాగే ప్రతి మహిళకు నెలకు రూ. 1500లు ఇవ్వాలని ఇచ్చిన హామీపై కూడా తర్జన భర్జనలు జరుగుతున్నయి. అంటే సంవత్సరానికి రూ. 18,000 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి మహిళకు అంటే కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారిని తీసుకోవాలా? లేక సామాజికంగా వెనుకబడిన వారిని మాత్రమే తీసుకోవాలా? అనే అంశంపై కూడా సమాలోచనలు జరుగుతున్నయి. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులోనూ ఆర్థికంగా వెనుబడిన వారికి ఇవ్వాలా? లేక అందరికీ ఇవ్వాలా? అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఆర్థిక అంశాలతో ముడి పడిన ప్రతి పథకంపై ప్రభుత్వం ఆచీ తూచీ అడుగులు వేయాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం సుమారు పది లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు అమలు చేయాలంటే తిరిగి అప్పులు చేయడం తప్ప మరో మార్గం లేదని రాజకీయ మేధావులు చెబుతున్నారు.అన్నింటిపైనా అధ్యయనాలేనా?
Tags:    

Similar News