వాసంశెట్టి సుభాష్‌ మంత్రి పదవి సీఎం ఎందుకు పీకేస్తానన్నారు?

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి ఎలా టీడీపీలోకి వచ్చారు? ఏకంగా ఎమ్మెల్యే అయ్యి మంత్రి ఎలా కాగలిగారు? దీని వెనుకున్న వారు ఎవరు?

Update: 2024-11-10 04:30 GMT

తెలుగుదేశం పార్టీ సభ్యత్వంపై ఇటీవల టెలీ కాన్ఫరెన్స్‌ జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సక్రమంగా పనిచేయని ఎమ్మెల్యేలు, మంత్రులకు వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదులో ఇంత నిర్లక్ష్యం ఏమిటంటూ కఠినంగా మాట్లాడారు. అవసరమైతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను హెచ్చరించారు. సుభాష్‌ వ్యతిరేక వర్గం టెలీకాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డును సోషల్‌ మీడిలో పోస్టు చేసింది. టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు హెచ్చరిక ఎలా ఉంది...

చంద్రబాబు: సుభాష్‌ గారు చెప్పండి.
సుభాష్‌: సార్‌.. సార్‌.. అన్నీ నమోదవుతున్నయి సర్‌.. ఈ రోజు విఆర్‌వో గారితో పాటు కార్యకర్తలు అందరూ కూడా వెళ్లారు సార్‌..
చంద్రబాబు: చూడయ్యా నువ్వు ఇవన్నీ మాట్లాడొద్దు.. నువ్వు కూడా యంగ్‌స్టర్‌వి. నీలో సీరియస్‌నెస్‌ రాలేదు రాజకీయాలపైన. ఫస్ట్‌టైం ఎమ్మెల్యేవి. ఫస్ట్‌టైం మంత్రివి.
సుభాష్‌: సార్‌.. సార్‌..
చంద్రబాబు: ఇంతకూ నీ కానిస్టెన్సీ ఎక్కడుందో చూసుకున్నావా? 20 పర్సెంట్‌ చేశావ్‌... మీదొచ్చి రామచంద్రాపురం. 29 పర్సెంట్‌ అయింది. 9వేలు చెయ్యాల్సి ఉంటే 2,620 యే చేశావు. సీరియస్‌గా ఎందుకు తీసుకోవు.
సుభాష్‌: సార్‌.. సార్‌..
చంద్రబాబు: ఫస్ట్‌టైం వచ్చావు, నీకు పార్టీ ఎంత గౌరవం ఇచ్చింది. వేరే పార్టీ నుంచి వచ్చిన నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి ఇస్తే.. కనీసం నీకు ఆ పట్టుదల లేకపోతే ఎలా..
సుభాష్‌: సార్‌.. సార్‌..
చంద్రబాబు: ఏదో మిమ్మలందరినీ ఇది చేస్తున్నాననుకోకు. నా బాధ్యత నేను చేస్తున్నా... మీ బాధ్యత మీరు చేయండి. నేను కూడా సీరియస్‌గా ఆలోచిస్తా. పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు ఎందుకయ్యా మీకు..
సుభాష్‌: సార్‌.. సార్‌..
చంద్రబాబు: ఎందుకు పనిచేస్తున్నారు. ఏంచేస్తారు.. మీరు ప్రూవ్‌ చేసుకోవాలి. అప్పుడే సస్టైన్‌. మీరు ప్రూవ్‌ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్‌నేట్‌ ఆలోచిస్తా.
సుభాష్‌: సార్‌.. సార్‌..
చంద్రబాబు: ఎక్స్‌పెక్టేషన్‌ ప్రకారం పనిచేయలేదని ప్రూవ్‌ చేస్తా.. అన్ని ఎలక్షన్‌లలో నేను గెలిచా. నేను ఏ ఎలక్షన్‌లో ఓడిపోలా.. వెరీ సీరియస్‌..
అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు మంత్రి సుభాష్‌ నీళ్లు నములుతూ సార్‌.. సార్‌.. అంటూ ఉన్నారు తప్ప ఎందుకు సభ్యత్వ నమోదు చేయించలేకపోయారనే విషయం మాత్రం చెప్పలేదు.
ఎవరీ వాసంశెట్టి సుభాష్‌...
ఈ మంత్రిది అమలాపురం. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యకలాపాలు నిర్వహించే వారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనుచరుడు. ఒక విధంగా ఆయనే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈయన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న మాజీ మంత్రి విశ్వరూప్‌తో విభేదాలు రావడంతో ఎన్నికలకు ముందు 2024 జనవరి 20న రా.. కదిలిరా.. అంటూ చంద్రబాబు నాయుడు మండపేటలో నిర్వహించిన టీడీపీ సభలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే లోకేష్‌తో కూడా పరిచయం పెంచుకున్నారు. కూటమి గాలిలో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి గెలిచి సామాజిక వర్గాల సమీకరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు.
చంద్రబాబు ఎందుకు వార్నింగ్‌ ఇచ్చారు..
కొత్తగా ఎమ్మెల్యేవు, మంత్రివి అయ్యావు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్‌ ఇచ్చారంటే నియోజకవర్గంలో పార్టీలోని అందరినీ కలుపుకుని ముందుకు పోవడం లేదని స్పష్టమైంది. పార్టీలోని ముఖ్య నాయకులు చంద్రబాబుకు కంప్లైంట్‌ ఇచ్చారు. మంత్రికి మేము సహకరించేది లేదని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబుకు కోపం వచ్చింది. మంత్రి అని కూడా ఆలోచించకుండా సక్రమంగా పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీకి ఉపయోగ పడని రాజకీయాలు దేనికంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మలందర్నీ ఇది చేస్తున్నాననుకోకు. నా బాధ్యత నేను చేస్తున్నా.. మీరు బాధ్యత మచిచారని సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం వెనుక కేవలం సభ్యత్వ నమోదులో వెనుకబడటమేనా.. మరేదైనా ఉందా? అనేది కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మంత్రి కావటం, టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడిన మాటలు యాజ్‌టీజ్‌గా బయటకు రావటంతో మంత్రికి కాస్త అవమానం అనిపించింది. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ ఏక్‌దమ్మున ఎమ్మెల్యే, మంత్రి ఎలా కాగలిగాడనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీలో సాధారణ నాయకుడిగా ఉన్న సుభాష్‌ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సానా సతీష్‌ బాబు అనే వ్యక్తి కారణమని పలువురు చెబుతున్నారు. సతీష్‌ బాబు లోకేష్‌తో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అని టీడీపీలోని కొందరు నాయకులు చెబుతున్నారు. కిలారు రాజేష్‌ ద్వారా లోకేష్‌తో పరిచయం పెంచుకుని సుభాష్‌ను టీడీపీలోకి వచ్చేలా చేశారనే ప్రచారం జరుగుతోంది.
సానా సతీష్‌ బాబు ఎవరు?
సతీష్‌ బాబు కాకినాడకు చెందిన వ్యకి. విద్యుత్‌ శాఖలో సాధారణ ఉద్యోగి. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పాలిటెక్నిక్‌ చదివారు. కారుణ్య నియామకంలో విద్యుత్‌ శాఖలో ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత ఉద్యోగం మానేసి క్రికెట్‌లో ప్రవేశించాడు. హైదరాబాద్‌లో ఉంటూ దానిని కూడా పక్కనబెట్టి కొన్ని కంపెనీలకు ప్రారంభించాడు.
సతీష్‌ బాబు రసమ ఎస్టేట్స్‌ ఎల్‌ఎల్‌పి, గోల్డ్‌కోస్ట్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మ్యాట్రిక్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఈస్ట్‌ గోదావరి బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ప్రమోట్‌ చేసిన మరో కంపెనీ ఆర్‌ఏ మెరైన్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా ఉంది. గోల్డ్‌కోస్ట్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సతీష్‌ బాబుతో పాటు డైరెక్టర్‌గా ఉన్న మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి చాముండేశ్వరనాథ్‌ ఒక ఇంగ్లీష్‌ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ... ‘నేను దాదాపు ఎనిమిదేళ్ల క్రితం కాకినాడలో ఆస్తి లావాదేవీలకు సంబంధించి గోల్డ్‌కోస్ట్‌లో భాగమయ్యాను. గత కొన్నేళ్లుగా ఆయనతో టచ్‌లో లేను. ఆయన తూర్పుగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా ఉండడంతో ఆయనతో ప్రస్తుతం పరిచయం ఏర్పడిందని చెప్పారు.’
మొదట నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌ ప్రాజెక్టుతో సంబంధాలు ఉన్నాయి. 2015లో మాంసం ఎగుమతి చేసిన మోయిన్‌ ఖురేషీ పై ఈడీ నమోదు చేసిన కేసులో సతీష్‌బాబు పేరు పెట్టారు. ఖురేషీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసింది. అదే సమయంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని ఈడీ కూడా కేసు నమోదు చేసింది. 2017లో సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన నిందితుల తరపున మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించినట్లు సీబీసీ ఆధారాలు సంపాదించింది. అప్పట్లో పలువురు అధికారులను ప్రలోభపెట్టారని కేసు నమోదైంది. సీబీఐ డైరెక్టర్‌ పదవి కోసం అలోక్‌ వర్మ, రాకేష్‌లు పోటీ పడుతున్నారు. వీరు ఒకరినొకరు కొట్లాడుకునే స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ రాకేష్‌ తన వద్ద డబ్బులు తీసుకున్నారని సతీష్‌ బాబు ఆయనపై కేసు పెట్టారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సీబీఐ, ఈడీ సతీష్‌ బాబు వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతోంది. సతీష్‌పై దర్యాప్తు జరపటం సరైందేనని ఈడీ వాదనను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు నిచ్చింది. ఢిల్లీలో పవర్‌ బ్రోకర్‌గా మారారనే ఆరోపణలు సతీష్‌పై వచ్చాయి. వ్యాపారాలు, వివిధ కేసుల్లో నిందితుడు కావడంతో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ వారితో సంబంధాలు పెరిగాయి.
మరో క్యారెక్టర్‌ ఎంట్రీ...
ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సానా సతీష్‌బాబుకు కృష్టా జిల్లాకు చెందిన కిలారి రాజేష్‌ పరిచయం అయ్యారు. రాజేష్‌ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. వీరిరువురితో అప్పటికే వాసంశెట్టి సుభాష్‌కు పరిచయం ఉండటంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఈజీగా ఎంటర్‌ కాగలిగారు. సానా సతీష్‌ లోకేష్‌ యువగళం పాదయాత్రలోనూ కీలక పాత్ర పోషించారు. సుభాష్‌కు టిక్కెట్‌ ఇప్పించడంలోనూ, మంత్రి పదవి వచ్చేలా చేయడంలోనూ సానా సతీష్‌ బాబు కీలక పాత్ర పోషించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్‌తో పరిచయం ఉండటం, ఆయన ద్వారానే మంత్రి పదవి రావడంతో చంద్రబాబు కూడా వార్నింగ్‌తో సరిపుచ్చారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News