బ్రెజిల్ నుంచి విశాఖకు భారీగా డ్రగ్స్ రవాణా, కొన్నదెవరు? ఎవరికోసం?

ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ డ్రగ్స్ కంటైనర్ అంశం కలకలం రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి.

Update: 2024-03-22 08:10 GMT
Source: Twitter

ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖ పోర్ట్‌కు వచ్చిన ఒక కంటైనర్‌ను సీజ్ చేసిన సీబీఐ అందులో 25వేల కిలోల డ్రగ్స్‌ను బ్రెజిల్ నుంచి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వెంటనే ఆ కంటైనర్‌‌ను సీజ్ చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ఇంత మొత్తంలో డ్రగ్స్ దొరకడం అందరినీ కలవరపెడుతోంది. అందులోనూ ఎన్నికల సమయం కావడంతో అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడితే చాలు ప్రత్యర్థి పార్టీపై విమర్శలు, ఆరోపణలు గుప్పించడానికి ఏ చిన్న అవకాశం వదులుకోరు రాజకీయ నేతలు. అలాంటిది ఈ డ్రగ్స్‌ను మాత్రం వదులుతారా అంటే ససేమిరా అంటున్నారు. డ్రగ్స్‌ను సీబీఐ సీజ్ చేసింది అన్న వార్తలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా రచ్చ మొదలైంది. ఈ డ్రగ్స్ వెనక వైసీపీ హస్తం ఉందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుంటే వారికి అదే రీతిలో వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

వైసీపీ పాపాల పుట్ట బద్దలవుతోంది: లోకేష్
డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వైసీపీ నేతలే టార్గెట్‌‌గా మండిపడ్డారు. విశాఖను క్యాపిటల్ చేసే మాట దెేవుడెరుగు, జగన్ ఈ నగరాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేశాడని లోకేష్ ట్వీట్ చేశారు.
 ‘‘ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ పాపాల పుట్ట ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇక ఎలాగూ అధికారంలోకి రాబోమని తెలియడంతో ఆఖరి గడియల్లో చీకటి మాఫియాలతో జాక్‌పాట్‌లు కొట్టే పనిలో వైసీపీ నిమగ్నమైపోయింది. విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డ వార్త విని కలవరపడ్డా. రాష్ట్ర పరిస్థితి ఇలా మారిపోయిందా అని ఆవేదన చెందాను’’అని లోకేశ్ పోస్ట్ పెట్టారు. ‘‘ ఈ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ వందకు వందశాతం తాడేపల్లి ప్యాలెస్. కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ (ఆషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే జరుగుతోందని టీడీపీ ఎప్పటి నుంచో చెబుతోంది. విశాఖను రాజధానిని చేస్తా అని చెప్తూ ఇప్పుడు డ్రగ్స్ రాజధానిగా మార్చేశావ్ కదా.. జగన్’’అని సెటైర్లు పేలుస్తూ లోకేశ్‌ ప్రశ్నించారు.



ఎన్నికల టైంలో డ్రగ్స్ ఎందుకో?: చంద్రబాబు
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టబడిన వార్త విని షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘సీబీఐ అధికారుకులకు ఆంధ్ర పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం అనేక అనుమానాలకు తావివ్వడంతో పాటు ఈ డ్రగ్స్ దందాలో వారి పాత్రను స్పష్టం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ డ్రగ్స్‌తో ఏం చేస్తారో? ఐదేళ్లలో ఆంధ్రాను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చేశారు. వైసీపీ హయాంలో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న నా భయాన్ని ఈ ఘటన ధ్రువీకరిస్తోంది. దీనికి కారకులను ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదు. కఠినంగా శిక్షించాలి’’అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
డ్రగ్స్ అడ్డాగా ఆంధ్ర: పవన్
జగన్ అధికారంలో ఆంధ్ర అంధకారంలోకి వెళ్లిపోయిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తన హయాంలో ఆంధ్రను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్.. మాదక ద్రవ్యాలకు రాజధానిగా ఆంధ్రను మార్చారు. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డా వాటి మూలాలు ఆంధ్రలోనే ఉండటం సిగ్గుచేటుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒకేసారి 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు విజయవాడలోని ఆషి ట్రేడర్స్ పేరు మీద ఉన్నట్లు తేలాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వెనక కూడా ఆ సంస్థ పేరే వినిపస్తోంది. కాబట్టి ఆ సంస్థ పెద్దలు ఎవరో లోతుగా విచారించాలి. జగన్ పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టిపోయింది’’అని మండిపడ్డారు.
రివర్స్ కౌంటర్ వేసిన వైసీపీ
విశాఖలో దొరికిన డ్రగ్స్ వెనక వైసీపీ హస్తం, తాడేపల్లి ప్యాలెస్ ప్లాన్ ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ శ్రేణులు ఘాటుగా బదులిస్తున్నాయి. డ్రగ్స్ రవాణాలో టిడిపి, బిజెపి నేతలకు సంబంధం ఉందని వైసిపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరోపించారు. బ్రెజిల్ నుంచి కంటైనర్ ని తెప్పించుకున్న సంధ్యా అక్వా బిజెపి అధ్యక్షరాలు డి పురందేశ్వరికి బంధువులని, అందువల్ల ఆమెకు ఈ డ్రగ్స్ సంబంధం ఉందని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్షాల ఆరోపణలకు వివరణ ఇస్తూ.. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారంతా టీడీపీ నేతలు కాదా అని ఎదురు ప్రశ్నిస్తున్నాయి. ‘‘టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కామ్‌లు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం. కానీ కాదు.. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని ఇప్పుడు తెలిసింది. ఫొటోలతో సహా దొరికినా వాళ్లు బుకాయించడం విడ్డూరంగా ఉంది’’అని వైసీపీ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌లో డ్రగ్స్ కేసుల్లో పేర్లు వినిపిస్తున్న వారు టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను వైసీసీ షేర్ చేస్తోంది.
అయితే విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు రాజకీయ రంగు పులిమి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ దొరికితే ఏం చేయాలో, ఎవరిని పట్టుకోవాలో దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, రాజకీయ పార్టీలు తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, మొన్నటి వరకు ఉన్న ఉమ్మడి రాజధాని కూడా ఇప్పుడు లేదని, ఎవరికైనా చెప్తే మనపై ఉమ్మేస్తారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News