టీడీపీ vs వైసీపీ.. ముదురుతున్న మాటల యుద్ధం

ఏపీని వరదలు ముంచెత్తినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వరదలకు వాళ్లు కారణమంటే వాళ్లే కారణమంటూ ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

Update: 2024-09-06 14:43 GMT

ఏపీని వరదలు ముంచెత్తినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బెజవాడ బెంబేలెత్తే పరిస్థితులు తలెత్తాయని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం ఇదంగా టీడీపీ నేతల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ప్రజలు అల్లాడే పరిస్థితులు తలెత్తాయంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయించకుండా, ఇసుక అక్రమ దందాపై పెట్టిన ఫోకస్‌ను వైసీపీ ప్రాజెక్ట్‌ల నిర్వహణపై పెట్టిఉంటే ఇలాంటి దుస్థితి పట్టేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇదే తరహాలో ఇదంతా మానవ తప్పిదం వల్ల వాటిల్లిన విపత్తేనని, దీనిని హ్యూమన్ మేడ్ కలామిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతూనే పోతోంది. రెండు పార్టీల అధినేతలపై ఇరు పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఏపీకి జగన్ వల్లే ప్రమాదం: రామ్మోహన్‌నాయుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అసలు ప్రమాదం వైఎస్ జగన్ వల్లేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్‌తోనే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రానికి జగన్ వల్లే పెను ప్రమాదం ఉంది. అందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గుణపాఠం నేర్పారు. అయినా ఆయన తన పద్దతి మార్చుకోలేదు. రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలకు ప్రమాదమే. బుడమేరు కాలువ గేట్లు ఎత్తేశారని.. అమరావతి అంతా మునిగిపోయిందని లేనిపోని తప్పుడు ప్రచారాలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలన్న ఆలోచన జగన్‌కు రావడం దురదృష్టకరం. ప్రజలు అల్లాడుతున్న వరదల్ని కూడా తన రాజకీయాల కోసం వాడుకున్న ఏకైక నేత జగన్’’ అని రామ్మోహన్‌నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ తప్పుల వల్లే విపత్తు: అనగాని

ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన వరదల బీభత్సానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తప్పిదాలే కారణమని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘‘ఐదేళ్ల పాలనలో జగన్ తీసుకోవాల్సిన కనీస చర్యలైనా తీసుకుని ఉంటే ఇప్పుడు ఏపీకి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు. ఈ వరదలతో పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దీనిని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్ అంటున్నారు. అందులో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, వెలిగొండ, పట్టిసీమను జగన్ పట్టించుకోలేదు. సాగునీటి ప్రాజెక్ట్‌లలో పేరుకుపోయిన పూడికను తట్టెడు కూడా తీయలేదు. జగన్ చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. 2021లో పింఛ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దానికి అప్పటి ఇసుక మాఫికా కారణం. వారిని ఏం చేయకుండా చూతులు ముడుచుకు కూర్చున్నారు ఆనాటి సీఎం జగన్. అదే ఏడాది అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాని వెనక కూడా ఇసుక మాఫియానే ఉంది. జగన్ చేసిన తప్పులన్నీ ప్రజల పాలిట శాపాల్లా మారాయి. బుడమేరు నుంచి వరద నీటిని కృష్ణా నీటిని తరలించడనాికి 2017-2018 మధ్య టీడీపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ఆ పనులను ఆపేసింది. అందువల్ల ఇప్పుడు వరద బీభత్సం సృష్టించింది’’ అని స్పష్టం చేశారు.

బాబు వల్లే సహాయక చర్యలు ఆలస్యం: సుధాకర్ బాబు

ఏపీ ప్రజలు వరదల్లో తల్లడిల్లిపోతుంటే సీఎం చంద్రబాబు మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వరదల్లో సంభవించిన మరణాలకు చంద్రబాబే కారణం. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబుకు రవ్వంత కూడా బాధ్యత లేదు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఇద్దరూ కూడా సమావేశం అంతా ఒకరినొకరు పొగుడుకుంటూనే గడిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆగస్టు 28నే వర్షాలు, వరదల గురించి హెచ్చరించింది. కానీ చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుకున్నారు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆ సమయమంతా కూడా వైసీపీ నేతలను కొనుగోలు చేయడం, ముంబై నటి వ్యవహారాలపైనే బాబు ఫోకస్ అంతా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ప్రజలకు ఇంతటి అవస్థలు దాపురించాయి. బుడమేరు ఆధునికీకరణ పనులను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? టీడీపీ నేతల భూములు పోతాయనే కదా. ఇప్పుడు మళ్ళీ వరదల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మళ్ళీ వైసీపీ నేతల అరెస్ట్‌లను ప్రారంభించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు సుధాకర్ బాబు.

జగనన్న క్రెడిట్‌కు బాబు కొట్టేస్తున్నారు: రోజా

విజయవాడ వరదల్లో అందిస్తున్న సహాయక చర్యల క్రెడిట్ అంతా కూడా జగన్‌ది అయితే అదంతా చంద్రబాబు కాజేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. ‘‘ఇప్పుడు బెజవాడ ముంచెత్తిన వరదల్లో ప్రజలకు సహాయక చర్యలు అందించడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జగనన్న తెచ్చిన సేవలపైనే ఆధారపడి చేస్తోంది. జగనన్న ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగులు మొదలు, జగన్ ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలు, అంబులెన్స్ సర్వీస్ వాహనాలు, క్లీన్ ఆంధ్ర వాహనాల సహాయంతోనే ప్రజలకు సహాయక చర్యలను అందిస్తున్నారు చంద్రబాబు. ఇలా జగనన్న తెచ్చిన సేవలు ప్రతిదానిని వినియోగించుకుంటూ క్రెడిట్ మాత్రం చంద్రబాబు కొట్టేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను కూడా వినియోగించుకుంటుందీ ప్రభుత్వం. దాంతో పాటుగా జగన్ ప్రభుత్వం కట్టించిన రిటైనింగ్ వాల్.. ఈ వరదల్లో 80 వేల మందిని వరద బారిన పడకుండా కాపాడింది. జగన్ ఆలోచన, ముందుచూపు వల్లే విజయవాడ ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు’’ అని ఆమె అన్నారు.

Tags:    

Similar News