పవన్ కల్యాణ్‌తో బీజేపీ అగ్రనేతల రహస్య భేటీ ఎందుకు?

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలోనే సీట్ల కేటాయింపుపై బీజేపీ జాతీయ నేత షెకావత్.. ఆదివారం పవన్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. అందుకు కారణమేంటో..

Update: 2024-03-11 09:27 GMT
Source: Twitter


టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైనప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ-జనసేన పార్టీలకు 6 ఎంపీ, 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, బీజేపీకి ఏయే స్థానాలు అందిస్తారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రాష్ట్రమంతా దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఖరారు అయినప్పుడే సీట్ల సర్దుబాట్లపై త్వరలో మూడు పార్టీల నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల వెల్లడించారు. ఏ స్థానాలను కోరాలన్న అంశంపై చర్చించడానికి తమ జాతీయ నేతలు ఇద్దరు ఆంధ్రకు వస్తారని, పురందేశ్వరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. అదే విధంగా ఆంధ్రలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆదివారం బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా.. ఆంధ్రకు విచ్చేశారు.

పవన్‌తో రహస్య భేటీ

విజయవాడకు చేరుకున్న బీజేపీ జాతీయ నేతలు షేకావత్, జయంత్ పాండా.. తమ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అనూహ్యంగా ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. నిజానికి చంద్రబాబుతో కలిసి సోమవారం ఆంధ్రకు చేరుకోవాల్సిన పవన్.. బీజేపీ కమిటీ ఆహ్వానం అందడంతో ముందుగానే గన్నవరానికి చేరుకుని విజయవాడలో జరుగుతున్న బీజేపీ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి షేకావత్ సుమారు అరగంటసేపు చర్చలు చేశారు. ఈ సమావేశంలో జనసేన-బీజేపీ మధ్య ఏయే అసెంబ్లీ స్థానాలు ఇచ్చిపుచ్చుకోవాలి, ఎవరెవరిని నిలబెట్టాలని అన్న అంశాలపై పవన్, బీజేపీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.



 

చంద్రబాబుతో నేడే చర్చ

ఆదివారం రాత్రి పవన్, బీజేపీ నేతలు సీట్ల కేటాయింపులపై చర్చించారు. అదే అంశంపై వారు సోమవారం ఆంధ్రకు చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా భేటీ కానున్నారు. ఇందులో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం పూర్తయిన వెంటనే మూడు పార్టీలు సంయుక్త ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇప్పటికే బీజేపీ తమకు ఆసక్తి ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఓ ప్రతిపాదనను పవన్ ముందు ఉంచింది. దీనిపై చంద్రబాబుతో కూడా చర్చించనుంది.

రెండు రోజుల్లో స్పష్టత

పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏఏ సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది, తమ అభ్యర్థులెవరెవరు అన్న అంశాలను మరో రెండు రోజుల్లో పార్టీ ప్రకటిస్తుందని విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం పురందేశ్వరి స్పష్టం చేశారు. ‘‘పొత్తు ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నాం’’ అని తేల్చి చెప్పారు ఆమె. మరోవైపు తమ మేనిఫెస్టో కోసం నేతల అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నామన్నారు.

సీట్ల ప్రాథమిక అంచనా

పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఖాయం అయినట్లు సమాచారం. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న అంశంపై బీజేపీ నేతలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు కేటాయించిన ఆరు ఎంపీ స్థానాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాజమండ్రి - పురందేశ్వరి, నరసాపురం - రాఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్ర వర్మ, అరకు - కొత్తపల్లి గీత పేర్లను పరిశీలిస్తోందని సమాచారం. అదే విధంగా రాజంపేట - కిరణ్‌కుమార్ రెడ్డి, తిరుపతి - రత్నప్రభ లేదా నీహారిక, హిందూపురం - సత్యకుమార్‌ను ఎన్నికల బరిలోకి దించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా అనకాపల్లి, ఏలూరు స్థానాలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ.. విశాఖ నార్త్, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు, కైకలూరు, పి.గన్నవరం నియోజకవర్గాలను కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో గుంటూరు, పి. గన్నవరం విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వీటన్నింటిపై ఈరోజు జరిగే సమావేశంలో క్లారిటీ వస్తుంది.


Tags:    

Similar News