సింహాచలం ప్రసాదాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. టీటీడీ వివాదంపై పీఠాధిపతుల ఆగ్రహం

టీటీడీ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే వివాదంపై చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-09-21 09:28 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందన్న విషయం ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే వివాదంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవడానికి, ఆలయాల్లో జరిగే అన్ని అంశాలను పరిశీలించడానికి జాతీయస్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇతర దేవాలయాల్లోని ప్రసాదం నాణ్యతపై కూడా సర్కార్ దృష్టి సారించిన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిశీలనను విశాఖ నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. సింహాచలం ఆలయంలో పర్యటించారు. ఆలయ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. వాటి నాణ్యత విషయంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పెదవి విరవడం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగానే ఆలయాలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లకు సంబంధించి గత ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కనీస ఆలోచన కూడా లేకుండా గత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఆలోచన రావొద్దా..?

సింహాచలం ఆలయ దర్శన చేసుకున్న అనంతరం ప్రసాదం నాణ్యతను గమనించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సింహాచలం లడ్డూలో కూడా నెయ్యి వాసన లేకపోవడం, రుచి కూడా అంతంత మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం ప్రసాదం నాణ్యతపై ఎమ్మెల్యే పెదవి విరవడం ప్రస్తుతం కీలకంగా మారింది. ‘‘కిలో నెయ్యి రూ.341కే సరఫరా చేస్తామని టెండర్ వేశారు అంటే ఆ నెయ్యి నాణ్యతను పరిశీలించరా? తక్కువ ధరకు వస్తే చాలా.. నాణ్యత ఉండాల్సిన అవసరం లేదా? తక్కువ ధరకే టెండర్లు తీసుకొచ్చి తెగ ఆదా చేసేస్తున్నాం అన్న పేరు తెచ్చుకోవాలని గత ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాపత్రయపడ్డారు. ఆ తాపత్రయంలో రవ్వంతైనా నాణ్యతపై పెట్టి ఉంటా బాగుండేది. ఇవన్నీ కూడా పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో జగన్ తెచ్చిన రివర్స్ టెండరింగ్ పద్దతి వల్ల వచ్చిన అనార్థలే’’ అని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే.

శిక్షను భక్తులే నిర్ణయించాలి..

‘‘భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్‌కు ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలు, భక్తులే నిర్ణయించాలి. టీటీడీ ప్రసాదం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇతర ఆలయాల్లో కూడా ప్రసాద నాణ్యతపై దృష్టి సారిస్తున్నాం. అన్ని ఆలయాల్లో వినియోగిస్తున్న ముడిసరుకులను అతి త్వరలోనే పరిశీలిస్తాం. ఇప్పటికే టీటీడీ ప్రసాదానికి సంబంధించి విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ విభాగాలు కూడా రంగంలోకి దిగాయి. శరవేగంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వదిలి పెట్టం. కాకపోతే ఇందులో ఎంతటి వారి పాత్రలు ఉన్నాయన్నది అసలు ప్రశ్న. ఎవరున్నా వారిని ప్రజల ముందు నిలబెడతాం. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తాం. గత ప్రభుత్వం పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రతి వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికే చంద్రాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

అన్యమతస్థులకు ఉద్యోగం ఉండకూడదు: పీఠాధిపతులు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అంశంపై పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు వినియోగించారన్న విషయం ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. ‘‘భక్తుల దుస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ దేవుడి ప్రసాదంలో ఏం కలుస్తుందో అర్థంకాక భయాందోళనకు గురి కావాల్సిన దారుణ పరిస్థితిని భక్తులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో అన్యమతస్థులు ఉద్యోగాలు ఉండకూడదు. శ్రీవారిపై భక్తి శ్రద్ధలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ధర్మాన్ని రక్షిండంలో ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకోవాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవే కల్తీ జరిగిందని, అపవిత్ర పదార్థాల వినియోగం జరిగిందని పేల్చినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ల్యాబ్‌ల రిపోర్‌లతో కోర్టులకు వెళ్లాలి. కోర్టు విధించిన శిక్షలను తూచా తప్పకుండా అమలు చేస్తేనే ఇలాంటివి పునరావృతం కావు’’ అని పీఠాధిపతులు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News