ఇకనైనా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి రూటు మారేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీటీడీ దాదాపు వదిలేసినట్టే .ఆయన్ను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.;
By : The Federal
Update: 2025-04-06 08:13 GMT
ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీటీడీ దాదాపు వదిలేసినట్టే భావించాల్సి వస్తోంది. వివాదాస్పద వ్యక్తిగా మారిన నేపథ్యంలో ఆయన్ను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించినట్టు అర్థమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ఆయన్నే పట్టించుకోకపోవడంతో పార్టీ స్థానిక నాయకులు కూడా ఇప్పుడాయనతో మాట్లాడడానికి కూడా జంకుతున్నారు. కొలికపూడి స్వయంకృపరాధమే ఇందుకు కారణంగా పార్టీ నాయకులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే...
స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు. ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. కొలికపూడిని మాత్రం పలకరించలేదు. చంద్రబాబు ఒక్క క్షణం ఆయన్ను చూసి.. పక్కనున్న నేతను భుజం తట్టారు. ఈలోపు టీడీపీ మహిళా నేతలు వారి మధ్యలోకి వచ్చేశారు. వారితో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఇతర నేతలు ముందుకు రావడంతో కొలికపూడి వెనక్కి వెళ్లిపోయి నిలబడ్డారు. తిరువూరులో ఎమ్మెల్యేకు, సొంత పార్టీ నేతలకు కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కొలికపూడి తీరుపై సీరియస్‌గా ఉంది.
ఈ క్రమంలో చంద్రబాబు టూరుకు వచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడిని దాదాపు విస్మరించారు. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. కొలికిపూడిని చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. కరచాలనం చేయలేదు.
మరోవైపు.. ప్రజావేదిక స్టేజ్‌పైన కూడా కొలికపూడికి అవకాశం దక్కలేదు. చంద్రబాబు సెక్యూరిటీ.. కొలికపూడిని దూరంగా పంపించేసినట్టు తెలుస్తోంది. అయితే, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నాడే దళిత ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరగడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలికపూడి వ్యవహార శైలిలో స్థానిక నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆయన్ను గట్టిగానే మందలించారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా కొలికపూడి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడి అనుచరులు మాత్రం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కొలికపూడికి వేరే దారేమీ లేకపోవడంతో సర్దుకుపోయే ధోరణిలో ఉన్నారు.