ప్రొద్దుటూరులో గురు శిష్యుల సమరం
రాజకీయ కురువృద్ధుల్లో ఆయన కూడా ఒకరు. ఒకప్పటి శిష్యుడే ఆయనకు ప్రత్యర్థిగా మారారు.
(ఎస్. ఎస్. వి. భాస్కరరావ్)
తిరుపతి: గురు శిష్యుల మధ్య పోటీ అనివార్యమైంది. ఒకరిది నిష్కలంకమైన వ్యక్తిత్వం. సూటిగా మాట్లాడే తత్వం మాజీ ఎమ్మెల్యేది. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆయన శిష్యుడు మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఈ ఎన్నికల్లో ఎలా ఆదరిస్తారు? స్వపక్షంలోనే విపక్షాన్ని కూడా ఆయన మూటగట్టుకున్నారు. అసలే కాక మీద ఉన్న ఆ నియోజకవర్గంలో.. రోజుల వ్యవధితో ప్రధాన పార్టీల అధ్యక్షులు ఇటీవల ఇద్దరు పర్యటించి వెళ్లడం మరింత వేడి రగిల్చింది.
"కురువృద్ధ రాజకీయ నాయకుడికి సీనియారిటీ ప్రధాన క్వాలిఫికేషన్. మరో ఇద్దరు నుంచి ఆయనకు సహకారం లభించేది సందేహమే..!" కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న గురుశిష్యుల ఇద్దరిలో ఒకరు పట్టు కోసం ఆరాటపడుతుంటే.. మరొకరు ఎలాగైనా ఆధిపత్యం సాధించాలని శ్రమిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వస్త్ర వ్యాపారానికి కాదు. బంగారు ఆభరణాల తయారీ విక్రయాల్లో రెండో ముంబైగా వాసికెక్కింది. వ్యాపార లావాదేవీలతో నిత్యం ప్రశాంతంగా ఉండే ఈ పట్టణంలో ఎన్నికల వేళ వాతావరణం వేడిగా మారింది. ఆదిపత్య పోరు సాగే ఈ నియోజకవర్గంలో కూడా అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి కూడా యధావిధి గానే వర్గపోరు రుచి చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఒకరికి సహాయ నిరాకరణ సమస్యగా మారితే. అధికార పార్టీ అభ్యర్థికి అవినీతి మరక, పక్షంలోనే విపక్షం ముల్లులా గుచ్చుకుంటున్నది.
వరదరాజుల రెడ్డి@ 82
నంద్యాల వరదరాజు రెడ్డి కడప జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన చలాకీగా తిరుగుతూ, వృద్ధాప్యం అంటే ఏమిటో మరిచినట్టు సాగుతున్నారు. వృద్ధాప్యమనేది ఆయన మాటలు.. తీరు, నడకలో ఎక్కడా కనిపించదు. యువకులతో పోటీ పడే స్థాయిలో చురుకుగా ఉండే ఆయన వ్యక్తిత్వం కూడా మచ్చలేనిదే. ఆయన వ్యక్తిత్వం ముక్కుసూటితనం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఆయన మాట తీరు పాతతరం వాసనలను, నిజాయితీని గుర్తు చేస్తుంది. ఈ లక్షణాన్ని ప్రోది చేసుకున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకుడు.
వైఎస్ జగన్‌కు ఎందుకు దూరం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మిగతా నాయకులు మాదిరే నంద్యాల వరదరాజ రెడ్డి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఒకటి రెండు కార్యక్రమంలో ప్రొద్దుటూరులో పాల్గొన్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల సరళితో మనస్థాపానికి గురికావడమే వరదరాజుల రెడ్డి వైఎస్సార్సీపీ ఛాయలకు కూడా వెళ్లకపోవడానికి కారణమని ఆ ప్రాంత వాసులు చెబుతారు.
25 ఏళ్లు ఎమ్మెల్యే
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి 1985 లో నంద్యాల వరదరాజు రెడ్డి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ నుంచే ఆయన ఐదుసార్లు 2009 వరకు ఎమ్మెల్యేగా ఆయన 25 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం వరదరాజుల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
కారణం : టికెట్ వేటలో వై ఫై నుంచి చెందిన మల్లెల లింగారెడ్డి, ఆయన అనుచరులు సహకరించకపోవడమేనని చెబుతారు. 2019 ఎన్నికల్లో నంద్యాల వరదరాజుల రెడ్డికి అవకాశం దక్కలేదు. మల్లెల లింగారెడ్డి రాచమల్ల శివప్రసాద్ రెడ్డిపై పోటీ చేశారు. ఎన్నికల్లో నంద్యాల వరదరాజుల రెడ్డి సహకారం అందించలేదనే గుర్తు చేస్తున్నారు. 2024: ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ప్రధానంగా ముగ్గురు పోటీ పడ్డారు. వారిలో మల్లెల లింగారెడ్డితో పాటు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రెండేళ్ల క్రితం నుంచి యాక్టివ్ అయిన నంద్యాల వరదరాజు రెడ్డిని టిడిపి అభ్యర్థిత్వం వరించింది.
ఈ పరిస్థితుల్లో మిగతా ఇద్దరూ సహకారం ఎంతవరకు ఉంటుందని వేచి చూడాలి. ప్లస్ పాయింట్స్: నంద్యాల వరదరాజులు రెడ్డిపై అవినీతి ఆరోపణ లేకపోవడం ప్లస్ పాయింట్‌గా భావిస్తారు. ఆయనకున్న సీనియారిటీ రాజకీయాల్లో అవకాశాలు దక్కడానికి, ప్రజల చెంతకు చేరడానికి అవకాశం కల్పించిందంటారు. పార్టీ శ్రేణులు ఎవరికైనా ఇబ్బందులు వస్తే వెంటనే రంగ ప్రవేశం చేసే ఆయన, అధికారులు కూడా ముక్కుసూటిగానే ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు.. " నీ రాజకీయ అవినీతిని వెంటాడుతా. నూరేళ్లు వచ్చినా సరే నిలబడే ఉంటా" అని నంద్యాల వరదరాజు రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. "అవినీతి అసాంఘిక కార్యకలాపాలను తొక్కి వేస్తా.." వీటిని సహించే ప్రసక్తే లేదని ఆయన ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నారు.
గురువు పైనే సమరం
కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధ నాయకుడు నంద్యాల వరదరాజు రెడ్డి. ఈయన శిష్యరికంలోనే మల్లెల లింగారెడ్డి, ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎదిగారని చెబుతారు.. ఆ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు 1998లో ఆయన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2003లో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, 2004 సెప్టెంబర్ నుంచి 2005 మార్చి 5వ తేదీ వరకు మున్సిపల్ ఇంచార్జి చైర్మన్‌గా పని చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత..
సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అలా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా దగ్గర కాలేదు. ఈ పరిస్థితి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కలిసొచ్చిందని ఆ ప్రాంత నాయకుల ద్వారా తెలుస్తోంది. అదృష్టం కలిసి రావడంతో, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మొదటిసారి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వరదరాజుల రెడ్డి పై ఆయన 13025 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టిడిపి అభ్యర్థి మల్లెల లింగారెడ్డి పై 43148 మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మళ్లీ నంద్యాల వరదరాజులరెడ్డి పై సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
బాంబుల్లా పేలుతున్న మాటలు..
మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. మినహా, మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ఆరోపణకులపై మాట్లాడలేని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి.. " టిడిపి ఒకటి కాదు. నాలుగైదు టిడిపిలు ఉన్నాయి. వాళ్లలో వాళ్లకే సరిపోదు. నన్ను ఏం చేస్తారు" అని శివప్రసాద్ రెడ్డి ధీమాగా అంటున్నారు. ఈయన పై ప్రొద్దుటూరు పట్టణంలో అనేక ఆరోపణ వినిపిస్తున్నాయి. నాయకులు కూడా బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
10 ఏళ్లలో ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెచ్చుమీరాయి అని అంటున్నారు. ఇసుక మాఫియాతో పాటు అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన బామ్మర్ది పెత్తనం ఎక్కువ అయిందని, ఇదే వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకు దెబ్బ కొడుతోందని కూడా చెబుతున్నారు. ఇలా చాలా విషయాలపై ఆయన అపవాదులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ పాలకమండలిలో కీలకమైన కౌన్సిలర్లే కాకుండా.. తిరుగుబాటు చేసిన సర్పంచ్ శివచంద్రారెడ్డిని సముదాయించడానికి తాడేపల్లి వర్గాలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది.
ఆదర్శం రాచమల్లు స్పందన
ఇటీవల తన కుమార్తె ప్రేమించిన ఓ దళిత యువకుడితో వివాహం జరిపించారు. కుమార్తె విషయం చెప్పగానే ఏ మాత్రం సంకోచం లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తీసుకువెళ్లి నిరాడంబరంగా జరిపించారు. తద్వారా ఆయన పేరు ప్రముఖంగా మారుమోగడంతో పాటు ఆయన ఆదర్శానికి అన్ని వర్గాలు హ్యాట్సాఫ్ చేశాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలు, ముస్లింలు, దళితులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ అభినందనలు అన్ని అవినీతి ఆరోపణలను మరకను మాపివేస్తాయా? వ్యక్తిత్వాన్ని నమ్ముకున్న, రాజకీయ కురువృద్ధుడిని అక్కున చేర్చుకుంటాయా? అనేది తేలాలంటే పోలింగ్ వరకు ఆగక తప్పదు.