తెలంగాణ ప్రభుత్వం వద్దనింది..ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది
హైదరాబద్‌లో చోటు చేసుకున్నట్లు సంధ్యా థియేటర్ వంటి దుర్ఘటన ఏపీలో జరిగితే దానికి బాద్యులు ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.;
By : The Federal
Update: 2025-01-05 06:34 GMT
తెలుగు సినిమాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ధోరణలు భిన్నంగా ఉన్నాయి. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం వాటికి నో అని చెబితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాటికి ఎస్ అని చెప్పి ఆశ్చర్య పరిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షకుల ప్రాణాలను పరిగణలోకి తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కేవలం సినిమా పెద్దల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుంది. పుష్ప 2 సందర్భంగా హైదర్‌బాద్ సంధ్యా థియేటర్ దుర్ఘటన సినిమా పరిశ్రమనే కాదు..తెలుగు రాష్ట్రాలను సైతం కుదిపేసింది. అయితే ఆ సంఘటన జరిగింది తెలంగాణలో కదా.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు కదా అనే భావించేందో ఏమో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వాటిని చేసుకోండని సినిమా పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినిమాల పట్ల తెలంగాణ ప్రభుత్వం తాలూకు ఆలోచన ధోరణి మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన కొన్ని అంశాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. వాటిల్లో ప్రధానంగా బెనిఫిట్ షోలు ఒకటి. సంధ్యా థియేటర్ ఘటన జరిగింది ఈ బెనిఫిట్ షో వల్లనే. బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రావడం, దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం, వేలు ఖర్చు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకోవడం అందరినీ కలచి వేసింది. దీనిపైన పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. బినెఫిట్ షోలు వేయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, సామాన్య ప్రేక్షకులను దోచుకునే ఇలాంటి బెనిఫిట్ షోలను బంద్ చేయాలని సామాజిక కార్యకర్తలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు నిర్వహించొద్దని తెలంగాణ ప్రభుత్వం సినిమా పెద్దలను ఆదేశించింది. దీంతో పాటుగా టికెట్ల ధరలపై కూడా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది. సామాన్య ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉండాలి కాని టికెట్ల ధరలు పెంచి దానిని దూరం చేయడం సబబు కాదని, టికెట్ల ధరలు కూడా పెంచడానికి వీల్లేదని సినిమా పెద్దలకు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగానే వ్యవహరిస్తోంది. బెనిఫిట్ షోలు వేసుకోవచ్చని సినిమా పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాకుండా టికెట్ ధరలు కూడా పెంచుకోవచ్చని పచ్చ జెండా ఊపేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాతో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చని, టికెట్ ధరలు పెంచేసుకోవచ్చని ధారాళంగా అనుమతులు ఇచ్చేసింది. ఈ నెల 10న తెల్లవారుజామున ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని రామ్‌చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక్కో టికెట్ ధర రూ. 600గా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ధరలపై అదనంగా భారీగానే పెంచుకోవచ్చని పచ్చ జెండా ఊపేసింది. మల్టీప్లెక్స్‌లో అయితే ప్రస్తుతం ఉన్న ధరలపై రూ. 175, సింగిల్ థియేటర్లలో అయితే ప్రస్తుతం ఉన్న ధరలపై రూ. 135 చొప్పున టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. పవన్ కల్యాణ్ అన్న కుమారుడు రామ్‌చరణ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రేమ అంతిటితో ఆగలేదు. సినిమా విడుదలయ్యే జనవరి 10న ఆరుషోలు, తర్వాత రోజు నుంచి జనవరి 23 వరకు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని రెడ్ కార్పెట్ పరిచి మరీ అవకాశం కల్పించింది. ఇక బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్‌కు కూడా అదే స్థాయిలోనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జనవరి 12న తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో వేసుకోమని చెప్పింది. ఒక్కో టికెట్ ధర రూ. 500కు విక్రయించుకోవచ్చని అవకాశం కల్పించింది.
గేమ్ చేంజర్ సినిమా నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డిసీ చైర్మన్ దిల్ రాజు ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసినప్పడు బెనిఫిట్ షోలు కానీ, టికెట్ల ధరల పెంపులు కానీ ఆంధ్రప్రదేశ్‌లో వద్దని పవన్ కల్యాణ్ వారించారని ఆ రోజు టాక్ వినిపించింది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.
మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సర్కార్ నిర్ణయాలను సమర్థిస్తున్న ప్రజలు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతున్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వంటి దుర్ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరనే ప్రశ్నలను సంధిస్తున్నారు. బెనిఫిట్ షోల సందర్బాల్లో అలాంటి దుర్ఘటనలు జరగవని ఎలా చెబుతారనే ఆర్గ్యూమెంట్స్ కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి. కేవలం సినిమా పెద్దల లాభాలే చూసుకుంటున్నారు కానీ.. ప్రేక్షకుల భద్రతలను పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.