ఆ పాప ప్రాణం ఎంత విలవిలలాడిందో..

చాక్లెట్ తీసిస్తానంటే ఆ పాప వెంట వెళ్లింది. పొదల్లోకి తీసుకువెళ్లిన కామాంధుడు హత్యాచారం చేసిన అమానవీయ ఘటన పుత్తూరు వద్ద జరిగింది.

Update: 2024-11-02 08:23 GMT

ఓ పసిపాప ప్రాణం విలవిలలాడింది. చాక్లెట్ తీసిస్తా అని ఓ యువకుడు మభ్యపెట్టి, అత్యాచారం చేశాడు. పాప మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చాడు. ఏమి తెలియనట్లు గ్రామస్తులతో కలిసిపోయాడు. సాయంత్రంమైనా పాప కనిపించకపోవడంతో గాలింపు చేపట్టారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కామాంధుడి వ్యవహారం బట్టబయలైంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలం అబ్బీ కండ్రిగ (ఏఎం పురం) ఎస్టీ కాలనీలో జరిగిన ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆమె తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడిని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కూడా ఆమె హామీ ఇచ్చారు. హోం మంత్రి ఆదేశాల నేపథ్యంలో తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అబ్బీకండ్రిగను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు.

"సొంత తమ్ముడిగా భావించాం. అక్కా, బావ అని పిలుస్తూనే నా బిడ్డను బలి తీసుకున్నాడు. నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. వాడిని ఉరి తీయండి" అని పాప తల్లి మమత కన్నీరుమున్నీరవుతోంది.
"దీపావళి పండుగ అయిపోయింది. పనుల కోసం అత్తారింటి వద్దకు వచ్చిన మేము తిరిగి వెళ్ళాలని అనుకున్నాం. నా బిడ్డను కళ్ళ ముందు లేకుండా చేశాడు. వాడిని వదలవద్దు" అని పాప తండ్రి మధు గుండెలు మండుతుండగా పోలీసుల వద్ద తన వేదనను వెళ్లగట్టాడు.
ఈ సంఘటన పూర్వాప్రాల్లోకి వెళితే...
సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం మండలానికి చెందిన మధుకు, నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలం అబ్బీ కండ్రిగ (ఏఎం పురం)కు చెందిన మమతతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. పాపకు నాలుగేళ్లు. ఇంటి నిర్మాణ పనుల కోసం మధు తన భార్య మమతతో కలిసి అత్తగారి ఊరికి వచ్చాడు. దీపావళి పండుగ తర్వాత పనులు పూర్తి కావడంతో తిరిగి సొంత ఊరికి వెళ్లాలని భావించాడు. దీపావళి పండుగ కావడంతో ఏఎస్ పురంలోని ఎస్టీ కాలనీలో అత్తవారింటి వద్దనే ఉన్నారు.
ఇదే కాలనీకి చెందిన సమీప బంధువు సుశాంత్ (22) చాక్లెట్ కొనిస్తానంటూ పాపను శుక్రవారం సాయంత్రం తీసుకుని వెళ్ళాడు. సాయంత్రమైనా పాప ఇంటికి రాకపోవడంతో తల్లి మమత ఆందోళన గురైంది. ఈ విషయం తన భర్త మధుకు కూడా సమాచారం అందించింది. కాగా బామ్మర్దికి కాలు విరగడంతో పుత్తూరు ఈసలాపురంలోని శల్య వైద్యుల వద్ద ఉన్నాడు. "ఈ సమాచారం అందడంతో ఆందోళనగా ఇంటి వద్దకు చేరుకున్నా" అని మధు భోరున విలపించాడు. "మా పాపను సుశాంత్ ఎక్కువ దగ్గరకి తీసుకునేవాడు. నా భార్యను అక్కా, నన్ను బావ అనిపించేవాడు. బంధువు కదా అని మేము నమ్మినాం" అని మధు వివరించారు. సుశాంత్ పై సందేహంలో రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని మధు వివరించారు.
అసలు విషయం వెలుగులోకి..
పాప అదృశ్యం వెనుక సందేహాస్పదంగా ఉన్న సుశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన పద్ధతిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. పాపకు చాక్లెట్ తీసేస్తానని తీసుకువెళ్లి శుక్రవారం సాయంత్రం 4: 30 గంటల ప్రాంతంలో పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన ప్రదేశం వద్దకు తీసుకు వెళ్ళాడు. పాపను చంపేసి అక్కడే ఉన్న కాలువలో పూడ్చిన చోటును కూడా నిందితుడే పోలీసులకు చూపించాడు. దీంతో పాప మృతదేహాన్ని వెలికి తీసి పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సుశాంత్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ సంఘటనతో ఎస్టీ కాలనీ కూడా శోకసముద్రంలో మునిగిపోయింది. బాలిక తల్లి మమత, తండ్రి మధు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
"ఆడబిడ్డ పుట్టాలని దేవుడికి ఎన్నో పూజలు చేశాం. కోరుకున్నట్టే పుట్టిన బిడ్డను కళ్ళ ముందు లేకుండా చేశాడు. వాడిని జనం ముందే ఉరి తీయండి" అని పాప తల్లి మమత కన్నీటి పర్యంతమైంది. "పసిబిడ్డ అనే కనికరం లేకుండా మానవత్వాన్ని మరిచాడు. పరుపుపై పడుకోబెట్టె అల్లారుముద్దుగా చూసుకునే నా పాపను మురికి కాలువలో పూడ్చాడు. వాడికి అంత కసాయితనం ఉంది" అంటూ నా బిడ్డను అంతం చేసిన వాడిని వదలొద్దు అని పోలీసుల ముందు శోకించింది.
కఠినంగా శిక్షించండి : ఎమ్మెల్యే
పసిపాప ప్రాణం తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెంట అమెరికా పర్యటనలో ఉన్న గాలి భానుప్రకాష్ తన నియోజకవర్గంలో జరిగిన సంఘటన సమాచారం తెలిసిన వెంటనే స్పందించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే ఏఎస్ పురం ఎస్టీ కాలనీకి వచ్చి మాట్లాడుతా అని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
హోంమంత్రి దిగ్భ్రాంతి
నగిరి నియోజకవర్గంలో ఓ పసిపాప హత్యాచారానికి గురైన పసంఘటనలై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభంశుభం తెలియని చిన్నారిని చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.
గ్రామంలో ఏఎస్పి విచారణ
ఘటన సమాచారం తెలియడం, రాష్ట్ర హోం మంత్రి ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వడమాలపేట మండలం ఏఎం.పేట ఎస్సీ కాలనీకి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు మాట్లాడి ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన వెనుక జరిగిన అమానవీయ పరిణామాలపై ఆయన గ్రామంలో విచారణ చేశారు. పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ప్రస్తుతం వడమాలపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసును తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్పి రవిమనోహరాచారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Tags:    

Similar News