అందుకే చాగంటి కోటేశ్వరరావుని అడ్వైజర్‌గా పెట్టాం: సీఎం చంద్రబాబు
ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సమాజంలో విలువలు పడిపోతూ, పతనావస్థకు వస్తుయని, విలువలు కాపాడటానికి, నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని పెట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలో సోమవారం ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో విలువలు పతనమై పోతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయమేస్తోంది. లెక్కలేని పరిస్థితి వచ్చేస్తోంది. వాటినన్నింటినీ ఏమి చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తనకు విలువలను ఎలా కాపాడాలనే ఆలోచన వచ్చిందని, అందుకే చాగంటి కోటేశ్వరరావుని ప్రభుత్వ సలహాదారుగా పెట్టామన్నారు. స్టూడెంట్స్‌లో ఎథిక్స్, వాల్యూస్‌ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజరుగా పెట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణలు విద్యా వ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఇంగ్లీషనేది బతకడానికి అవసరమన్నారు. అలా అని తెలుగు భాషని మర్చి పోకూడదన్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నట్లు సీఎం తెలిపారు.