బాబు, పవన్ ల మధ్య బాండింగ్ చాలా గట్టిగా ఉంది
ఇచ్చిన మాటకు చంద్రబాబు నాయుడు, తీసుకున్న మాటకు పవన్ కల్యాణ్ లు కట్టుబడి ఉన్నారు. వారి బంధం తెగిందనే ప్రచారానికి తెరదించారు.;
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు సుమారు గంటకు పైగా చర్చించుకున్నారు. పొత్తులు, భవిష్యత్ పరిణామాలు, వైఎస్సార్ సీపీ వ్యవహారాలపైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. చాంబర్ లో వారిద్దరు తప్ప మూడో మనిషి లేనందున ఏమి జరిగిందనేది వారి నుంచి వస్తే తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేదు. ఏమి జరిగిందని వారిని అడిగే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఇద్దరూ వేరువేరు పార్టీలకు చెందిన వారు. అధికారంలో ఉన్నవారు. ఆయా పార్టీల అధినేతలు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే స్థాయి పార్టీల్లోని మరెవరికీ లేదని చెప్పొచ్చు.
వారిద్దరు ఏ నిర్ణయం తీసుకున్నారో...
మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకటించిన వెంటనే మంత్రి పదవి ఇవ్వొచ్చు. ఆరు నెలల లోపు ఎమ్మెల్సీగా గెలవొచ్చు. అయినా ఎన్నికైన తరువాత పదవి ఇద్దామనే ఆలోచనలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందనేది పవన్ కల్యాణ్, చంద్రబాబుకు తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. తండ్రి తీసుకునే నిర్ణయాలన్నీ కుమారుడైన లోకేష్ కు చెబుతారని అనుకోవడం కూడా సరైంది కాదని టీడీపీ వర్గాల్లో ఉంది. తప్పనిసరిగా తెలుసుకోవాలని భావించి లోకేష్ అడిగితే తప్ప చంద్రబాబు తనంతకు తాను చెప్పే అవకాశం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో నిజం ఉందని చెప్పాల్సిందే. అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా నాగబాబుకు అన్నీ చెబుతారని అనుకోలేము. నాగబాబు అడిగితే చెప్పే అవకాశాలు లేవని భావించాల్సిందే.
నాగబాబుకు మంత్రి పదవి లేదనే ప్రచారం ఎందుకొచ్చింది..
నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని కొందరు, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని కొందరు మూడు నెలల తరువాత ప్రచారం చేయడం మొదలు పెట్టారు. మంత్రి పదవి లేదనే అర్థం వచ్చేలా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంతా కోడై కూసింది. దీంతో కూటమిలో ఏమి జరుగుతోందనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కల్యాణ్ కు మధ్య గ్యాప్ పెరిగిందని, వారి బంధం కాస్త బలహీనమవుతోందనే ప్రచారం కూడా ముందుకొచ్చింది. కూటమి అనుకూల మీడియాలోనే నాగబాబుకు మంత్రి పదవి లేదని వార్తలు రావడంతో ఎవరిలోనైనా ఈ ఆలోచన వస్తుంది. అటువంటిదేమీ లేదని వారిద్దరు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో మాట్లాడుకున్న తరువాత స్పష్టమైంది. వారి బంధం చాలా బలంగా ఉందని నిరూపించబడింది.
అన్ని ప్రచారాలకు తెరదించిన పవన్
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాతే పవన్ ఈ ప్రకటన చేశారు. కూటమిలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని, చిన్న చిన్న మాట పట్టింపులు వస్తే ఎవరో ఒకరు సర్దుకు పోతారని నిరూపించారు. పైకి వస్తున్న ప్రచారాలకు ఎలా తెరదించాలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. పైగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే తప్పకుండా ఎన్డీఏలో స్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి అవకాశాలకు తావు ఇవ్వకుండా ప్రతి సభ, సమావేశాల్లోనూ పవన్ పేరును ప్రస్తావిస్తూ వస్తున్నారు.
లోకేష్ ఆలోచనే అనే ప్రచారం
నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం లేదనే ప్రచారం బయటకు రావడానికి మంత్రి లోకేష్ ఆలోచనే కారణమనే ప్రచారం సాగుతోంది. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ చెప్పకుండా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం లేదనే ప్రచారం జరగటం సాధ్యమయ్యే పని కాదని పలువురు మేధావులు అంటున్నారు. అందులోనూ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రెండు పత్రికల్లో వార్తలు వెలువడటంతో క్యాడర్ కూడా అయోమయంలో పడింది. జనసేన విషయంలో మొదటి నుంచీ లోకేష్ కాస్త ఎడమొఖం, పెడమొఖం గానే ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. పవన్ కల్యాణ్ తనకు పోటీ కాబోతున్నారని, కాస్త ప్రయారిటీ తగ్గిస్తే మంచిదనే ఆలోచనతో లోకేష్ ఈ విధమైన ఆలోచనే చేసి ఉంటారనే ప్రచారం కూడా ప్రజల్లో ఉంది.
తెలుగుదేశం, జనసేన మధ్య కొన్ని చోట్ల స్పర్థలు
కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య స్పర్థలు ఉన్నాయి. ఆ స్పర్థలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ, బీజేపీల మధ్య కూడా స్పర్థలు ఉణ్నాయి. అధికారంలో కూటమి ఉన్నందున తెలుగుదేశం పార్టీ పైచేయిగా ఉండాలని భావిస్తోంది. తమ ఓట్లతో అధికారం చేపట్టిన జనసే, బీజేపీలు తమపైనే పెత్తనం చేస్తున్నాయనే భావన టీడీపీ వారిలో ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా స్పర్థలు లేని, గొడవలకు తావివ్వని విధంగా పాలక పార్టీలు ముందుకు సాగాలని, అందుకు మా ఇద్దరి బంధం గట్టిగా ఉండాలనే ఆలోచనకు సీం, డిప్యూటీ సీఎం వచ్చినట్లు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నిరూపించింది.