ఆముదాల వలసలో ఆ ఇద్దరి మధ్యే పోటీ

ఆముదాల వలసలో ఆ ఇద్దరి మధ్యే పోటీ జరుగనుంది. ఎవరు ఆ ఇద్దరు? ఎందుకు వరిద్దరి మధ్యే పోటీ జరుగుతుంది. ఇంకా పార్టీలు సీట్లు ఇవ్వలేదు కదా అనే అనుమానం రావచ్చు.;

Update: 2024-02-02 08:40 GMT
Kuna Ravikumar and Tammineni Seetaram

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బావ, బావమరుదుల మధ్య పోటీ జరగనుంది. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. తమ్మినేని సీతారాం గెలుపొంది రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యారు. కూనంనేని రవికుమార్ ఓడిపోయారు.

బావ బావమరుదులే పోటీ దారులు

తెలుగుదేశం పార్టీ తరపున తిరిగి కూనంనేని రవికుమార్ కు టిక్కెట్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ కూడా తిరిగి తమ్మినేని సీతారామ్ కే టిక్కెట్ ఇవ్వనుంది. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా వీరే అక్కడ పోటీ దారులు అవుతున్నారు.

౧౯౮౩ నుంచి వరుసగా పోటీలో తమ్మినేని

1983 నుంచి వరుసగా తమ్మినేని సీతారామ్ పోటీ చేస్తూ వస్తున్నారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలుపొందారు. అనతరం 1994, 1999ల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత 2004, 2009ల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డెపల్లి సత్యవతిపై ఓటమి చెందారు. 2014లో వైఎస్సార్సీపీ తరపున సీతారాం పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన కూనరవికుమార్ పై ఓటమి చెందారు. వరుసగా మూడు సార్లు ఓటమిపాలైన సీతారామ్ తిరిగి వైఎస్సార్సీపీ తరపున 2019 ఎన్నకల్లో కూనరవికుమార్ పై పోటీ చేసి గెలుపొందారు. అంటే 1983 నుంచి ఆముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారామ్ తన ముద్రను వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేస్తూనే ఉన్నారు. ఈ సారి తమ్మినేనికి సీటు రాకపోవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ఊహలకు తెరదించుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి సీతారామ్ కే టిక్కెట్ కేటాయించనున్నారు.

రవికుమార్ 2014 నుంచి రాజకీయాల్లోకి

కూన రవికుమార్ మొదట 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. రవికుమార్ తమ్మినేని సీతారామ్ భార్య తమ్ముడు. అంటే స్వయానా బావమరిది కావడం విశేషం. ఎన్నకల్లో రక్త సంబంధాలకు పెద్దగా తావుండదు. పార్టీలు సీట్లు ఇవ్వగానే ఎవరు ఎవరిపైనైనా పోటీ చేస్తారు. తమ్మినేనిని ఓడించాలనే నిర్ణయంతో కూన రవికుమార్ ను రంగంలోకి దించిన టీడీపీ 2014లో సక్సెస్ అయింది. ఆ తరువాత 2019 లో జరిగన ఎన్నికల్లో రవికుమార్ ఓటమి చవి చూశారు. తమ్మినేని సీతారామ్ ను ఏకంగా స్పీకర్ పదవి వరించింది.

తిరిగి 2024 సాధారణ శాసనసభ ఎన్నకల్లో పోటీ పడనున్నారు. బావ, బావ మరుదుల మధ్య పోటీ రసవత్తరంగా వుంటుందనే వ్యాఖ్యలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News