ఉలిక్కిపడిన తిరుపతి ఆధ్యాత్మిక నగరం
తిరుపతిలో కలకలం చెలరేగింది. తీవ్రవాదుల పేరిట హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో హోటళ్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే తిరుపతి నగరంలో శుక్రవారం ఉదయం తీవ్ర కలకలం చెలరేగింది. పోలీసుల ఆకస్మిక తనిఖీలతో కలవరం చెందారు. కొన్ని హోటళ్ళకు వచ్చిన ఈ-మెయిళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని స్టేషన్ల పోలీసు సిబ్బందితో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో యాత్రికులే కాకుండా, హోటళ్లలో బసచేస్తున్న వారు కూడా ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఆందోళనకు గురయ్యారు.
తిరుపతి నగరంలోని అన్ని హోటళ్లు, యాత్రికులతో రద్దీగా ఉండే అనేక ప్రదేశాలను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రికుల వసతి భవనాల సముదాయంలో కూడా తనిఖీలు సాగిస్తున్నారు. తిరుపతి నగరంలోని ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి మార్గంలో ఉన్న ప్రధాన హోటళ్లకు గురువారం రాత్రి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలిసింది. "హోటళ్లను బాంబులతో పేల్చి వేస్తాం" అనే ఈ-మెయిల్ సందేశంతో హోటళ్ల యజమానులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు అలిపిరి బైపాస్ రోడ్ లోని లీలామహల్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్ల, రామానుజసర్కిల్లోని మరో హోటల్ కు వచ్చిన ఈ-మెయిల్ సందేశాన్ని పరిశీలించిన పోలీసులు. అనువణువునూ గాలించారు. బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు.