DEAD BODY | పార్శిల్ శవం మిస్టరీ వీడింది!

పార్శిల్ శవం (Parcel Corpse) మిస్టరీ వీడింది. ఆస్తి కోసం సొంత వదినను బెదిరించేందుకు ఆ ఆస్తితో ఏ సంబంధం లేని ఓ వృద్ధుణ్ణి చంపి పార్శిల్ చేసినట్టు తేలింది.

Update: 2024-12-27 03:08 GMT
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి వచ్చిన పార్శిల్ శవం (Parcel Corpse) మిస్టరీ వీడింది. ఆస్తి కోసం సొంత వదినను బెదిరించేందుకు ఆ ఆస్తితో ఏ సంబంధం లేని ఓ వృద్ధుణ్ణి చంపి పార్శిల్ చేసినట్టు తేలింది. దాదాపు పది రోజుల తర్వాత ఈ కేసు డిసెంబర్ 27వ తేదీకి ఓ కొలిక్కి వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో సాగి తులసి అనే ఒంటరి మహిళకు ఒక చెల్లలు ఉంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని కాజేసేందుకు తన భర్తతో కలిసి తన అక్క తులసిని బెదిరించేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. తన వదిన తులసిని బెదిరించి ఆస్తి కాజేసేందుకు శ్రీధర్‌ వర్మ, అతని రెండో భార్య రేవతి (తులసి చెల్లెలు), వర్మ ప్రియురాలు సుష్మ కలిసి పర్లయ్య అనే వృద్ధుణ్ణి హత్య చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని నిందితులు పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం.

శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టాలని చూశారు. ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని గాలించారు. దొరక్కపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నైలాన్‌ తాడు మెడకు బిగించి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.
పర్లయ్యను చంపిన తర్వాత శవాన్ని గాంధీనగరంలో ఇంట్లోని చెక్కపెట్టెలో పెట్టారు. మర్నాడు ఆటోలో యండగండిలోని తులసి ఇంటికి పార్సిల్‌ పంపారు. చెక్కపెట్టె తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైన తులసితో శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ‘సంతకం పెడతావా లేదా నువ్వూ శవమవుతావా?’ అని ఆమెను బెదిరించారని, ఆమె దగ్గర సెల్‌ఫోన్‌ లాగేసుకున్నారని చెబుతున్నారు. బాత్రూమ్ కని వెళ్లిన తులసి, తన దగ్గరున్న మరో ఫోన్‌ ద్వారా తెలిసిన వారికి మెసేజీ పంపడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరిగ్గా ఈ సమయంలో శ్రీధర్‌వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు.
మంగినపూడి బీచ్ లో...
శ్రీధర్‌వర్మ తన ప్రియురాలు సుష్మ, తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్‌ చేరుకున్నారు. అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్జిలో ఒకరోజు ఉన్నారు. ఆ తర్వాత సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తుండగా ఎవరో కొత్తగా వచ్చారంటూ స్థానికులు సమాచారం ఇవ్వడంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడు 40కి పైగా సిమ్‌ కార్డులు వాడారు.
శ్రీధర్‌వర్మ బ్యాంకు ఖాతాలో సుమారు రూ. 2 కోట్లు ఉన్నాయని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.
ఇంతకుముందు ఏమి జరిగిందంటే...
డిసెంబర్ 19న సాగి తులసి అనే ఒంటరి మహిళ ఇంటికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ శవాన్ని పార్శిల్ చేసి ఆమె ఇంటికి పంపారు. గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్‌ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడింది. అయితే ఈ శవం ఎక్కడి నుంచి వచ్చిందీ, ఎవరు పంపారనే దానిపై గత పది రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
యండగండికి చెందిన తులసీ అనే ఒంటరి మహిళ చాలా కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో తనకో గూడు కట్టించుకోవాలని పలువురి సాయం కోరారు. అందుకు పలువురు అంగీకరించారు. వాళ్లకు తోచినవి పంపారు. కొందరు రంగులు, టైల్స్‌ వంటివి పంపారు. మరికొందరు ఇతరత్రా సామాగ్రి పంపారు. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల ఓ మెసేజ్ వచ్చారు. విద్యుత్తు సామగ్రి, మోటారు పంపుతున్నామన్నది ఆ మెసేజ్‌ సారాంశం. వాటిని కూడా అప్పటి దాతలే పంపారనుకున్నారామె. ఆటోలో వచ్చిన పెద్ద పెట్టెను ఇంట్లో పెట్టించారు. దుర్వాసన వస్తుండడంతో తెరిచి చూడగా లోపల ఓ కుళ్లిన శవం కనిపించింది.
ఈ పార్శిల్ లో వచ్చిన శవం వార్త ఓ పెద్ద కలకలం సృష్టించింది. యండగండి గ్రామానికి చెందిన తులసికి నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజు (శ్రీనుబాబు)తో 20 ఏళ్ల కిందట పెళ్లి అయింది. ఈ కాపురం కొంతకాలం బాగానే సాగింది. శ్రీనుబాబు అప్పులు చేయడంతో కుటుంబంలో కలహాలు వచ్చాయి. అప్పులు తీర్చలేక పదేళ్ల కిందట ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో తులసి పుట్టింటికి వచ్చేశారు. భీమవరంలోని ఓ దుకాణంలో పని చేస్తూ కుమార్తెను పోషించుకుంటున్నారు. ఆమెకు స్థానికంగా ప్రభుత్వ స్థలం మంజూరు చేసింది. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇల్లు కట్టుకోడానికి సాయం కోరుతూ ఒక సేవా సంస్థను అభ్యర్థించారు. వారు సెప్టెంబరులో రాజమహేంద్రవరం నుంచి రంగు డబ్బాలు, టైల్స్‌ ఆటోలో పంపారు.

ఈ క్రమంలో ఆమెకు డిసెంబర్ 19న ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు సామగ్రి, మోటారు పంపుతున్నామంటూ ఆమె ఫోన్‌కు వాట్సప్‌ ద్వారా సందేశం వచ్చింది. సాయంత్రానికి ఒక పెద్ద చెక్క పెట్టెను ఆటోలో తెచ్చి డ్రైవర్, మరో వ్యక్తి ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. కరెంటు సామగ్రి కావచ్చని ఆమె అనుకున్నారు. అంతలో ఆ పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటంతో.. రాత్రి 10.30 గంటలకు అనుమానంతో తాళం పగలగొట్టి చూశారు. అందులో సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తులసి తండ్రి ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు. తులసి పెద్ద కుమార్తె. రెండో కుమార్తె రేవతి. రేవతి కొద్దికాలం కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలున్నాయని తెలుస్తోంది. శవం ఇంటికి చేరిన తర్వాత కొద్దిసేపటి నుంచి రేవతి భర్త కనిపించకుండా అదృశ్యం అయ్యారు. ఇప్పుడు పోలీసులకు చిక్కారు.
Tags:    

Similar News