రాజంపేట బరిలో వారసుల మధ్యే పోరు...

తిరుపతి: ఇద్దరు రాజకీయ వారసులు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ పడుతున్నారు.

Update: 2024-03-30 09:36 GMT
ప్రచారం చేస్తున్నా కిరణ్ కూమార్ రెడ్డి

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఇద్దరు రాజకీయ వారసులు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ పడుతున్నారు. అజ్ఞాతం వీడిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా టీడీపీ సహకారాన్ని నమ్ముకున్న ఆయన బీజేపీ జెండా పట్టుకుని వస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల రాజకీయ భవిష్యత్తుకు నిచ్చెన అవుతుందని ఆయన భావిస్తున్నారు. నియోజకవర్గంలో పదేళ్లుగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... తండ్రి బలం ప్రోత్సాహం, వైఎస్ఆర్‌సీపీ నేతల అండతో మళ్ళీ పోటీకి సిద్ధమయ్యారు.
వీరిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందంటే..
"జనం కోసం జీవిస్తే... జనంలో ఉంటావ్..,! నీకోసం జీవిస్తే నీవుగా మిగిలిపోతావ్!’’ ఈ మాట మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి-ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఇద్దరి నేపథ్యం తండ్రుల వారసత్వమే. కుటుంబాల మధ్య ఘర్షణాత్మక రాజకీయమే. ఒకరు రాజధానుల వెంట మేధావి వర్గంతో ఉంటారు. ఇంకొకరు పల్లెల్లో జనంలో ఉంటారు. అది కిరణ్ కుమార్ రెడ్డి... మిథున్ రెడ్డి మధ్య కనిపించే వ్యవహార సరళి. ఇదంతా ఎందుకంటారా.. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి వై‌ఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎం, ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకుడుగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పోటీ పడుతున్నారు. 2014లో డీకే సత్యప్రభ, 2019లో మాజీ సీఎం ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిపై మిథున్ రెడ్డి సునాయాసంగా గెలుపొందారు.

అజ్ఞాతం వీడి...
పదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారు. అది కూడా బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటు స్థానానికి టికెట్ దక్కడంతో... వెలుగులోకి వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటుతో పీలేరులో పోటీ చేసిన ఆయన 56,636 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకుని, మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. 2024 ఎన్నికలకు రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి రంగంలోకి దిగారు.
ఇంటి పోరే .. ఎక్కువే
పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితోనే సత్సంబంధాలు లేవు. ఇక జనంలో ఎలా ఉంటుందో అనేది అందరి నోట వినిపించే మాట. 25 సంవత్సరాల పాటు వాల్మీకిపురం, ఆ తర్వాత పీలేరుగా ఏర్పడిన నియోజకవర్గం పదవుల‌ను ఆస్వాదించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా టీడీపీ శ్రేణులు, నాయకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన నల్లారి కుటుంబంలో

ఆత్మవిశ్వాసం ఎక్కువగా ప్రదర్శించే కిరణ్ కుమార్ రెడ్డికి ఆత్మీయులు తక్కువ. మాటల్లో నేను మోనార్క్ కనిపిస్తూ ఉంటుంది. కలికిరి మండలం నగిరిపల్లి చెందిన వ్యక్తి అయినా, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ఆయనకు నగర వాసనలే ఎక్కువ.
కుటుంబాల మధ్య పోరాటం
పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబంతో చింతల కుటుంబం మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకు సమాంతరంగానే జిల్లాలో చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఏమాత్రం తక్కువ కాదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నల్లారి కుటుంబం ఉప్పు నిప్పుల ఉంటారు. 1972 నుంచి చింతల రామచంద్రారెడ్డి కుటుంబం. ఆ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఇదే తరహా వైరం ఉంది. అది ఏ స్థాయిలో ఉండేదంటే..
అది.. 2003: దివంగత సీఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో రంగంలో దిగారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం యాత్ర మహోద్రంగా సాగుతోంది. వైయస్సార్‌తో పెద్దిరెడ్డి సత్సంబంధాలు లేవు. అయినా.. చిత్తూరు: అప్పటి పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణ రావు ద్వారా చిత్తూరు డిసిసి అధ్యక్షులు బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో తన పట్టు నిలుపుకోవాలని భావించారు. కుప్పం నుంచి మదనపల్లి మీదుగా సత్యవేడు వరకు పెద్దిరెడ్డి పాదయాత్ర సాగిస్తున్న సందర్భం అది.

పిసిసి పెద్దల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ వచ్చింది. "మదనపల్లికి వచ్చే మీరు.. పీలేరు మీదుగా వెళ్ళకండి. మార్గం మార్చుకోండి" అనేది ఆ సందేశం సారాంశం. మదనపల్లి నుంచి పెద్దిరెడ్డి పాదయాత్ర నిమ్మనపల్లి వరకు సాగింది. డిసీసీ కార్యదర్శి రెడ్డివారి సాయి ప్రసాద్ రెడ్డి కొన్ని ఏర్పాట్లు చేశారు. మీడియా సారథ్య బాధ్యతలు జింక వెంకట చలపతి నిర్వహించారు. నిమ్మనపల్లెలో పెద్దిరెడ్డి పాదయాత్ర రాత్రి ఆగింది.
తనను పీలేరు నుంచి రాకుండా అడ్డుకుంటాడా... అనే ఆగ్రహంతో ఉన్న పెద్దిరెడ్డి.. అదే సమయంలో వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ బి. నరేష్ కుమార్ రెడ్డినీ ఉద్దేశించి." ఏం...పా... కిరణ్ కుమార్ రెడ్డి చూస్తాడని కారు అద్దాలు ఎక్కించుకొని వచ్చావా"? అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. మరుసటి రోజు పీలేరు నియోజకర్గాన్ని టచ్ చేయకుండా అడవిపల్లెల మీదుగా భాకరాపేట (చంద్రగిరి నియోజకవర్గం) లోకి పాదయాత్ర సాగించారు. ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఆ స్థాయిలో వైరం ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
టీడీపీ శ్రేణులే దిక్కు..
కాంగ్రెస్ పార్టీలో.. 1989 నుంచి 24 వరకు అనేక రాజకీయ పదవులను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుభవించారు. 15 సంవత్సరాల పాటు ఆయన పదవులు మాటను తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రాబల్యం పెంచుకున్నారు. ఇద్దరికీ ప్రస్తుతం పొసగని పరిస్థితుల్లో.. ఇంటి పోరే ఎక్కువగా ఉంది. బయటి ప్రాంతాల్లో అందే సహకారం ఎంత ఉంటుంనేది టిడిపి అందించే సహకారం పై ఆధారపడి ఉంటుంది రాజంపేట పార్లమెంటు స్థానంలో బిజెపి ప్రాబల్యం తక్కువగానే ఉంటుంది. అయితే బిజెపి జనసేన టిడిపి కూటమి కావడం వల్ల.. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల్లో టిడిపి ఓటు బ్యాంకు పైనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు ఉంచుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
రాజంపేట శాసనసభ స్థానంలో టిడిపి కాస్త బలం ఉందని చెప్పవచ్చు. రైల్వే కోడూరు టిడిపి కోటలో జనసేన అభ్యర్థి తెరమీదకి వచ్చారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం సభ్యతగా ఉంది. రాయచోటి నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నుంచి సహకారం అందవచ్చు. నాటి కాంగ్రెస్ పార్టీ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీలో రాంప్రసాద్ రెడ్డి కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి, 3500 ఓట్లకు పరిమితమయ్యారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి వర్గపోరుతో సతమతమవుతోంది.

మదనపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి గ్రూపులే ఎక్కువైనది సందేహం లేదు. ఇక టిడిపి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న షేక్ షాజహాన్ బాషా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కిరణ్ కుమార్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈయన నుంచి కాస్త సహకారం అందువచ్చని భావిస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తండ్రి కాలమాటి ఇంట్లో కిషోర్ కుమార్ రెడ్డి ఒకడే ఉంటున్నారు. అక్కడికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లడం లేదు. పీలేరు నియోజకవర్గాన్ని పులివెందులతో పోటీపడి మరి సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేశారు జాతీయ సంస్థలను నెలకొల్పారు ఇది ఎంతవరకు ఆయనకు తోడ్పాటు అందిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పుంగనూరు నియోజకవర్గం కూడా ఉంది ఇక్కడ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిడిపి అభ్యర్థితో పాటు పారిశ్రామిక వేత్త , బీసీ వైఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సహకారం అందువచ్చు. మినహా కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ అంత ఆదరణ ఉండకపోవచ్చు అనేది అక్కడ పరిస్థితి చెబుతున్నాయి.
సంబంధాలు తక్కువే..
బిజెపి జాతీయ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పీలేరులో ఉన్న సంబంధాలే చాలా స్వరూపం. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన పాత పరిచయాలను పునరుద్ధరించుకుని వారి ద్వారా నాయకులు పత్రం చేసుకోవలసిన అవసరం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత లేదా అంతకుముందు ఒకసారి కూడా ఈ ప్రాంతంలో ఆయన తొంగి చూసిన సందర్భాలు ఎంత మాత్రం లేవు. తాజాగా రాజంపేట పార్లమెంటు తెరపైకి వస్తున్న ఆయన వ్యూహాత్మక ఆలోచన సరళి ఎలా ఉంటుందనేది ఆయనకు మాత్రమే తెలుసు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి అభ్యర్థులే గత ఎన్నికల్లో గెలుపొందారు రాజంపేటలో అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మళ్లీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మిగతా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు యధాతనంగానే ఉన్నారు.
రాజకీయ శత్రువుతో పోరాటం..
సాధారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటల్లో గంభీరం కనిపిస్తుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటేనే భగ్గుమంటారు. అలాంటిది మూడోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈయనపై మాజీ సీఎం, బిజెపి జాతీయ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి. వీరి పోటీ మొదటిసారి ఈ ప్రాంతంలో ఆసక్తి రేపింది.

మిథున్ విజయకేతనం..
తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసత్వంగా రాజకీయ కలపాలం నేర్పిన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మొదటిసారి 2014లో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ సీఎం ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి పై 1,74, 762 ఓట్ల మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో డిఏ సత్యప్రభ పై 2, 68,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పుంగనూరు నియోజకవర్గంలోని మిథున్ రెడ్డికి 46,069 మెజారిటీ వచ్చింది.
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తన సొంత నియోజకవర్గం పుంగనూరు, బాబాయ్ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గం, అమ్మమ్మగారి ఊరు ఉన్న కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం లో గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధి కొరమట్ల శ్రీనివాసులు తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు నియోజకవర్గ సమన్వయకర్తల సహకారం ఈయనకు మెండుగా ఉంటుంది. అందుకు ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు.
మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయకముందు నుంచే రైల్వే కోడూరు రాజంపేట రాయచోటితోపాటు అనేక ప్రాంతాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారి కంపెనీ నుంచి సహకారం తీసుకున్న వ్యక్తులకు కొదవలేదు. ఎన్నికల్లో కూడా దన్నుగా నిలిచే అవకాశాలను మెండుగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో 40 ఏళ్లుగా పైగానే రాజకీయాలతో జీవితాన్ని ముడివేసుకున్న మాజీ సీఎం బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. చతురత మేధావితనంతో కూడుకున్నది కూడా. జెంటిల్మన్ రాజకీయాలు సాగించే కిరణ్ కుమార్ రెడ్డి, అదే స్థాయిలో రాజకీయ కుటుంబం వచ్చిన వయసు రీత్య చిన్నవాడైన మిథున్ రెడ్డితో పోటీపడుతున్నారు. యువతరం నెగ్గుతుందా సీనియారిటీ మేధస్సు ప్రతిఫలిస్తుందా అనేది వరకు వేచి చూడాలి.


Tags:    

Similar News