నాన్నా.. ఈ సౌదీ నరకం నేను భరాయించలేను!

నన్ను ఈ నరకం నుంచి తప్పించు నాన్నా.. సౌదీ నుంచి తల్లిదండ్రులకు వీడియో పంపిన కుమారుడు..;

Update: 2025-05-15 05:02 GMT
నజీర్ బాష చిత్రం ఆధారంగా గీసిన గ్రాఫిక్
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన నజీర్‌బాషా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. తండ్రి కాలేషా, తల్లి బీబీ – ఇద్దరూ కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని నిలదొక్కుకోవాలని, బాధ్యతలు తీర్చేయాలని ఆశించిన నజీర్‌బాషా గత డిసెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లాడు. ముప్పుతిప్పలు పడి అప్పు చేసి మరీ పంపించారు. అక్కడ ఓ యజమాని వద్ద ఉపాధి కోసం చేరారు. అయితే అది అనుకున్న పని కాదని, వేరే పనికి కేటాయించడంతో భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది.
చెట్టు ఎక్కించిన యజమాని..
అసలు పని కాకుండా చెట్టు ఎక్కి కొమ్మలు నరికే పని అప్పగించారు. ఆ పని చేయడం చేతకాకపోయినా, నజీర్‌బాషా ప్రయత్నించాడు. చెట్టుపైకి ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం చేయించుకుని, కొన్ని రోజులు అక్కడే పరిచయస్తుల వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అయినా యజమాని మాత్రం ఒప్పంద కాలం మిగిలిపోయిందని వాదిస్తూ మళ్లీ పనికి పిలిపించాడు.
చితకబాదిన యజమాని..
తిరిగి పనిలో చేరిన నజీర్‌ను మూడు నెలల పాటు పనిలో ఉంచుకున్నారు. చేసిన పనికి జీతం అడగడంతో అగ్గిమీద గుగ్గిలమైన ఆ యజమాని మానవత్వాన్ని మరచిపోయాడు. చిత్రహింసలు పెట్టాడు. చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటనను పక్కవారు వీడియో తీసి, కుటుంబానికి పంపారు. నజీర్‌బాషా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఏడుస్తూ తన బాధను చెప్పాడు. చేతిలో ఫోన్ కూడా లాక్కున్నారు.

ఈ వీడియోను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ‘‘మా బిడ్డ భవిష్యత్తు కోసం వెళ్లాడు. అక్కడ నరకం అనుభవిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి స్వదేశానికి తీసుకురావాలి’’ అంటూ మొరపెట్టుకుంటున్నారు.
వీలైనంత త్వరగా సహాయం కావాలి
నజీర్‌ను పంపేందుకు సుమారు రూ. లక్ష ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటికే అప్పు చేసిన కుటుంబానికి ఇది తలకు మించిన భారం. ప్రభుత్వం, భారత ఎంబసీ, మానవ హక్కుల సంఘాలు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ విషాదకథ ఇప్పటికి ఎన్నో కుటుంబాల గుండెలను బాధిస్తోంది.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు లక్షల్లో ఉన్నారు. కానీ వారి హక్కులను కాపాడే వ్యవస్థలు మాత్రం కనిపించడం లేదు. నజీర్‌ బాషా విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని పౌరహక్కుల సంఘాలు కోరుతున్నాయి.
దళారుల నియంత్రణ, కఠినమైన ఒప్పందాలు, భారత దౌత్యపరమైన చర్యలు – ఇవన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఇది. విదేశాల్లో భారతీయులు వివక్షకు, దోపిడీకి గురవకుండా ఉండాలంటే, వ్యవస్థలు నిబద్ధతతో స్పందించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News