తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టైల్ వేరుగా ఉంటుంది. నిత్యం తలకు ఆకుపచ్చ కండువా చుట్టి ఇంటి నుంచి బయటకొస్తాడు. తల పాగా కూడా వెరైటీగా ఉంటుంది. తల చుట్టూ టోపీలా బిగించి చుట్టి ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లోనూ ఈ తలగుడ్డ అలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అమరావతిలో ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకునిగా రైతుల పక్షాన పోరాటాలు చేశాడు. ఆయన పోరాటాల ఫలితమే తిరువూరు ఎమ్మెల్యే టిక్కెట్ రావడం. పచ్చ కొక్కా ఎక్కువగా ధరిస్తాడు. అప్పుడప్పుడు వేరే రంగుల చొక్కాలు కూడా వేస్తాడు. తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో చంద్రబాబు ఆయనకు అక్కడ సీటు ఇచ్చారు. ఉండవల్లి నుంచి తిరువూరుకు వెళ్లాడు. డ్రస్ కోడ్‌కు పెద్దగా ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపించడు. అయితే తలపాగాతో ఫిట్ షర్టు, ప్యాంట్‌తో వెరైటీగా కనిపిస్తాడు.
జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ లాల్చీ ఫైజామాతోనే ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇదే రకమైన డ్రెస్‌లు వేసే వారని చెబుతారు. ఎక్కువగా తెల్ల దుస్తులు వాడతారు. వేరే రంగులు వాడినా లైట్ కలర్స్‌పై ఎక్కువ దృష్టి ఉంటుంది. అప్పుడప్పుడు మెడలో జరీ కండువా వేస్తారు. మెడ నుంచి ముందుకు రెండు వైపుల కిందకు దగవేసి కండువాను వదిలేస్తారు.
కాంగ్రెస్ పార్టీలో 1980లో చేరాడు. 1989లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి అప్పలనరసింహంపై 9 ఓట్ల మెజారిటీతో గెలిచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి 1991లో పదవ లోక్‌సభకు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1990, 1992 సంవత్సరాలలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. 1999లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2004లో దాడి వీరభద్రరావుపై 17వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, తెలుగు దేశం అభ్యర్థి దాడి వీరభద్ర రావు, తనకు మధ్య జరిగిన త్రిముఖ పోరులో స్వల్ప ఓట్లు తేడాతో గంటా శ్రీనివాసరావు గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా చేశారు. రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన రామకృష్ణ ఆయన మరణానంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఈయన తమ్ముడు కొణతాల రఘునాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. విశాఖ ఎంపీగా పోటీకి దిగిన వైఎస్ విజయమ్మ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించాడు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తన కులం మీద మాత్రమే కాకుండా ఇతర కులాల్లో కూడా ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు 2024 జనవరి 25న జనసేన పార్టీలో చేరారు.
కొణతాల రామకృష్ణ 1957, జనవరి 4న అనకాపల్లి పట్టణంలో జన్మించారు. ఇతని తండ్రి పేరు కొణతాల సుబ్రహ్మణ్యం. ఆయన విద్యాభ్యాసం అనకాపల్లిలోని అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కాలేజిలో జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకాం పట్టా పొందారు. వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామిక వేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా పేరు సంపాదించారు. ఈయన గవర కమ్యూనిటీకి చెందినవారు. గవర అనకాపల్లి ప్రాంతంలో బలమైన వ్యాపార కులం.