అక్కడ ఒక్క సారే.. సెకండ్ టైమ్ నో చాన్స్
ఒక్క సారి గెలిపించడం ఆ నియోజక వర్గం ప్రత్యేకత. రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఒక సారి గెలిచిన వారే నేడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉన్నారు.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం ఒక విలక్షణమైన నియోజక వర్గం. ఏ పార్టీ అభ్యర్థి అయిన ఒక్క సారి మాత్రమే ఆదరించడం ఈ నియోజక వర్గం ప్రత్యేకత. ఒక సారి పోటీ చేసి గెలిచిన వారు రెండో సారి పోటీ చేసినా వారిని తిరస్కరించడం ఈ నియోజక వర్గం ఓటర్లు స్పెషాలిటీ. అదే ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. టీడీపీ నుంచి ఒక సారి గెలిచి రెండో సారి బరిలోకి దిగిన బండారు సత్యనారాయణ , కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా ఒక సారి గెలిచి రెండో దఫా బరిలోకి దిగిన ద్రోణంరాజు సత్యనారాయణలను ఓడించిన చరిత్ర పెందుర్తి అసెంబ్లీ నియోక వర్గం సొంతం. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నంరెడ్డి ఆదీప్‌రాజ్ ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇద్దరూ గతంలో ఒక సారి గెలిచిన వారే. కాంగ్రెస్ నుంచి పిండి భగత్, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి కన్నేపల్లి మహదేవ్ కల్యాణ్ శ్రీకాంత్‌లు బరిలో ఉన్నారు. వీరిద్దరు కొత్తగా రంగంలోకి దిగారు. అయితే ఈ సారి ఎవరిని విజయం వరిస్తుందనేది స్థానికుల్లో ఆసక్తి కంరగా మారింది. ఒక సారి గెలిచిన వారినే రెండో సారి గెలిచి పాత రికార్డును బద్దలు కొడతారా లేదా కొత్తగా రంగంలోకి దిగిన అభ్యర్థులు గెలుపొంది పాత రికార్డును కొనసాగిస్తారా అనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.