టీడీపీ, వైసీపీలు రీ పోలింగ్ కోరిన బూత్‌లు ఇవే
రీ పోలింగ్‌కు అధికార, ప్రతిపక్షాలు డిమాండ్. సీఈఓకి పోటా పోటీగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకరు రిగింగ్‌కు పాల్పడ్డారని, ఫిర్యాదులు చేయగా, మరొకరు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేశారు. హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకోవడం, గాలులోకి కాల్పులు జరపడం, అభ్యర్థుల మీద దాడులు చేయడం, గృహనిర్భందాలకు పాల్పడటం, ఈవీఎంలు మొరాయించడం వంటి పలు సంఘటనలతో పోలింగ్‌కు అంతరాయం కలిగిందని, దీంతో ఆ ప్రాంతాల్లో తిరిగి రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఆ మేరకు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు పోటా పోటీగా ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్‌మీనాను కలిసిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వినతులు అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండూరి అఖిల్ తదితరులు ముకేష్ కుమార్ మీనాను కలువగా, మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ముకేష్ కుమార్ మీనాను కలిసారు.