సినిమాల్లోనే కాదు.. రాజకీయాలలోనూ వీరు 'హాస్యనటులేనా'?

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కెరీర్‌లను నాశనం చేసుకున్నారు పలువరు హాస్యనటులు. ఆఖరికి రాజకీయాల్లో కూడా వాళ్లు జోకర్లుగానే మిగిలిపోయారు.

Update: 2024-04-04 11:40 GMT
Source: Twitter

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమదైన శైలి హాస్యంతో స్టార్ కమెడియన్లుగా ఎదిగిన వారు రాజకీయాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. వెంటనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి పార్టీల కండువాలు కప్పుకుని ఆ పార్టీల తరపు జోరుగా ప్రచారాలు కూడా చేశారు. కానీ తీరా వాళ్లు పరిస్థితి సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా జోకర్‌గా మారిపోయింది. వాళ్లు ఆశించిందీ దక్కలేదు.. వాళ్ల నుంచి ఆశించింది కూడా దక్కలేదు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత కొందరు స్వచ్చందంగా సినిమాల నుంచి తప్పుకుంటే కొందరు మాత్రం రాజకీయాల్లోకి వచ్చీ రాగానే తాను పచ్చి రాజకీయ నాయకుడిని అన్న విధంగా వ్యాఖ్యలు చేసి సినిమా కెరీర్‌ని నాశనం చేసుకున్నారు. అందుకు అలీ, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉదాహరణలుగా నిలుస్తున్నారు. వీరు ముగ్గురూ కూడా తెలుగు సినిమాల్లో తమదైన నటనకు కేరాఫ్‌గా మారిన వారే.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు చేసిన వారే.. చివరికి సినిమాలకు కూడా దూరమైన వారే.

ఈ జాబితాలో మనకు ముందుగా అలీ గుర్తొస్తారు. టీడీపీ నుంచి రాజమండ్రి టికెట్ అలీకి వచ్చేసిందంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత జనసేన కండువా కప్పుకుని పవర్ స్టార్ పవన్ పక్కన నిలబడ్డారు అలీ. 2019 ఎన్నికల్లో జనసేన నుంచైనా తనకు టికెట్ ఖరారు అవుతుందని భావించారు. కానీ అదీ జరగలేదు. దాంతో నేరుగా వెళ్లి సీఎం జగన్ పార్టీ వైసీపీ కండువా కప్పుకున్నారు. దాంతో అలీకి పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా వైసీపీ తరపున ప్రచారం ప్రారంభించిన అలీ.. పవన్ ఎక్కడ నిలబడితే అక్కడే ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తానని సవాళ్లు విసరడంతో అగ్గిలో ఆజ్యం పోసినంత పనైంది. అలీకి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎప్పుడూ తన సినిమా అంటే అవకాశం లేకపోయినా అలీకి ఛాన్స్ ఇప్పించే పవన్.. ఇప్పుడు అలీ ఊసు కూడా ఎత్తట్లేదు. ఇదిలా ఉంటే తనకు వైసీపీ నుంచి టికెట్ పక్కా అన్న ధీమాతో ఉన్న అలీకి 2024లో కూడా ఎదురుదెబ్బే తగిలింది. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ ప్రకటించేసింది. ఆ జాబితాను జల్లెడ పట్టినా అందులో అలీ పేరు కానరాలేదు. బహుశా ఎంపీ టికెట్ ఇస్తారేమో అని మరికొన్నాళ్లు ఎదురుచూసినా లక్ తలుపుతట్టేలా కనిపించడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా అలీ దూరంగా ఉండటం మొదలు పెట్టారు. రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న అలీకి అన్ని అదృష్టం ఆమడ దూరం జరిగింది. మరి ఆయన భవిష్యత్ కార్యాచారణ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో మనకు థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కనిపిస్తారు. ఆయన కూడా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పుడే అందరిలానే రాజకీయాల్లో తన లక్‌ ఎలా ఉందో చూడాలనుకుని వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అంతా సవ్యంగానే జరుగుతోంది. 28 జూలై 2019న టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఛైర్‌ పర్సన్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత తనపై పలు ఆరోపణలు తీవ్రంగా రావడంతో 2020 జనవరి 12న ఆ పదవి, పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు కూడా దూరం పాటించారు. 2024 జనవరి 24న మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత అధికార వైసీపీ నేతలు, మంత్రివర్గం, ప్రభుత్వమే టార్గెట్‌గా పృథ్వీరాజ్ రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అయితే జనసేన పోటీ చేయనున్న 21 స్థానాల్లో ఎక్కడా పృథ్వీకి ఛాన్స్ దక్కలేదు. పార్టీలో ఏ పదవిని కూడా కట్టబెట్టలేదు. దీంతో రాజకీయాల్లో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్లుగానే మారింది పృథ్వీరాజ్ పరిస్థితి.
ఇక చూసుకుంటే నెక్స్ట్ ఈ జాబితాలో విలక్షణ నటుడు, విచిత్ర హాస్య నటుడిగా పేరు పొందిన పోసాని కృష్ణ మురళీ ఉంటారు. పోసాని రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన స్టైల్ కామెడీ, పంచులతో అందరినీ అలరించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికీ ఆయనకు సినిమా పరంగా, రాజకీయ పరంగా కూడా పరిస్థితులు అనుకూలించాయి. కానీ కొంతకాలానికే పోసాన రాజకీయాల్లో కూడా తన వెరైటీ స్టైల్‌ను మెయింటెన్ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ విమర్శించడమే తన పరమావధిగా పెట్టుకున్ని పెట్రేగి పోయారు. దీంతో పవన్ అభిమానుల నుంచి పోసానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా పలు కీలక అంశాలపైన కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంచలన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టికెట్ లభించలేదు. తనకు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసింది కూడా లేదు. కానీ రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ కావడం ప్రారంభించిన పోసానికి సినిమా అవకాశాలు మాత్రం భారీ తగ్గిపోయాయి. అర్థంపర్థం లేని విమర్శలకు కేరాఫ్‌గా మారిపోయారు.
మీరు ముగ్గురూ కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. సినిమాల్లో జోకర్లుగా నవ్వించిన వీరు ఇప్పుడు రాజకీయాల్లో కూడా జోకర్లుగానే మిగిలిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలు అంటేనే బురద అని తెలిసి కూడా వీరు చేజేతులారా అంతా చేసుకున్నారని వారి అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News