భక్తుల వీడ్కోలు మధ్య ఈ ఆలయం కృష్ణా జలాల్లో మునిగిపోయింది...
నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరుడి 2024 జలనివాసం ఎలా మొదలయిందో చూడవచ్చు.
శీతాకాలంలో ప్రకృతి శక్తుల్లో ఆలయం విలీనం కావడం, వేసవిలో ప్రత్యక్ష కావడం కేదారనాథ్, అమర్ నాథ్ వంటి హిమాలయ ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటన హిమాలయాల దిగువన దేశంలో మరెక్కడా కనిపించదు, ఒక్క నంద్యాల జిల్లాలో తప్ప. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపాన సంగమేశ్వర ఆలయం వర్షాకాంలో శ్రీశైలం జలాశయ నీటి ( ప్రకృతి) లో విలీనమవుతూ ఉంటుంది. వేసవిలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. పచ్చటి నల్లమల సౌందర్యం మధ్య చిరు జల్లుల్లో, కృష్ణానది ఒడ్డున నిలబడి ’ఈ వింతని చూడవచ్చు. ఆలయంలో నీరు మెల్లిగా ప్రవహిస్తూ ఉండటం, ఆలయంలో చివరి పూజ, మునిగిపోతున్న గోపురానికి మరొక పూజ, పూజారి రఘురామ శర్మ మంత్రాలు, అలల సవ్వడి...అంతా ఉద్వేగభరితమయిన వాతావారణం సృష్టిస్తాయి. అందుకే ఇది తప్పకుండా చూడాల్సిన విచిత్రం. ఇది తెలుగు వాళ్లందరికి సమీపానే ఉన్న క్షేత్రం కాబట్టి ఈ వింత చూసేందుకు వీలవుతుంది. ఈ ఏడాదికి సంగమేశ్వరుడి జలాధివాసం నిన్ననే మొదలయింది. అంటే ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో మునిగిపోయింది.
మంగళవారం ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆరోజు చివరి పూజ జరిగింది. దేవుడికి వీడ్కోలు పలికారు. ఆలయ పూజారి తెలకపల్లి రఘురామ శర్మ పైకి కనిపిస్తున్న ఆలయ గోపురానికి పూజ చేశారు. తర్వాత గోపురమూ మునిగిపోవడం మొదలయింది.
మరొక ఏడెనిమిది నెలలు ఈ ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ జలాల్లోనే ఉంటుంది. అంటే సంఘమేశ్వరుడు జలాధివాసంలో ఉంటాడు. ఆలయం కృష్ణా జలాల్లో మునిగిపోతున్నపుడు, వేసవిలో తేలుతున్నపుడు చూడటం ఒక అరుదైన అనుభవంగా ఉంటుంది. మీరంతా ఇపుడే ప్లాన్ చేసుకుంటే వచ్చే ఏడాది చూడవచ్చు. ఈ సంగమేశ్వరానికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు కూడా ఉంది. కృష్ణానది నల్లమల అడవుల్లోకి ప్రవేశించానికి ముందు నదికి అటు ఇటు రెండు క్షేత్రాలున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నది నివృత్తి సంగమేశ్వరం. తెలంగాణ వైపు ఉన్నది సోమేశ్వరం లేదా సోమశిల.
నేను హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి సంగమేశ్వరం వెళ్లాను. విజయవాడ నుంచి కూడా నేరుగా ఆత్మకూరు, నంద్యాల కు బస్సులు న్నాయి. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లడం బాగుంటుంది.
నేను వెళ్లే సరి ఆలయానికి వరద తాకిడి మొదలయింది. కృష్ణా నది నీళ్లు ఆలయం చుట్టుముడుతున్నాయి మెల్లిగా.
మంళవారం మధ్యాహ్నం తర్వాత ఆలయం మునిగిపోనున్నదని వరద సమాచారం అందింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సంగమేశ్వరుడికి పూజారి చివరి పూజలుచేయడం మొదలుపెట్టారు. ఇక్కడి లింగం వేప మొద్దుతో చేసింది. నీళ్లలో ఎన్నాళ్లున్నా చెక్కు చెదరదని రఘురామ శర్మచెప్పాడు. రఘురామ శర్మ స్నేహశీలి. ఓపికగా జలాధివాసం గురించి, ఆలయ ప్రాశస్త్యం వివరిస్తారు. ఆర్నెళ్లకొకసారి వచ్చీపోయే ఆలయం కాబట్టి వాతావరణం బాగున్నా అభివృద్ధి లేదు.
చూస్తుండగానే ఆలయంలోకి నీళ్లు ప్రవేశించాయి.మొల్లిగా ఆలయమంతా అక్రమించాయి. గర్భగుడిలో ప్రవహించాయి.లింగం,నంది నీటిలో మునిగిపోవడం మొదలయింది.
పై భాగం మాత్రం కనిపిస్తూ ఉంది. దీనికి పూజారి పూజలు చేశారు. దీనితో ఈ ఏడాది ఆలయ పూజలు ముగిశాయి. మరుసటి రోజు పొద్దునికల్లా ఆలయం దాదాపు పూర్తిగా మునిగిపోయింది.
సప్తనది సంగమం
పడమటి కనుమల్లోని మహాబలేశ్వర్ వద్ద పుట్టిన కృష్ణానది తన యాత్ర పొడవునా అనేక నదులను కలుపుకుంటూ వస్తుంది. సంగమేశ్వరానికి వచ్చేసరికి నది ఆరు నదుల నీళ్లతో ఉంది. అవి కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మాల ప్రహారిణి, భీమరధి. ఏడోది భవనాశి. కృష్ణానదిలో కలిసే ఏడోనది భవనాశి. భవనాశిలో కృష్ణలో కలిసే ప్రదేశమయినందున దీనిని సంగమేశ్వరం అన్నారు. ఇక్కడ ఆలయం నిర్మించారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని సప్తనది సంగమమ్ అని కూడా అంటారు.
ఈ కారణంగా ప్రాంతానికి చాలా ప్రాముఖ్యం ఉందని పూజారి రఘరామ శర్మచెప్పారు. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడికి యాత్ర ఆహ్లాదకరంగా ఉంటుంది. చూట్టూర నల్లమల అడవులు. ఒక వైపు భవనాశి నది జాడ.
మరొకవైపు కనుచూపు మేర విస్తరించిన శ్రీశైల జలాశయ వెనకభాగం. పక్కనే ఉన్న కొండమీదికి వెళ్లిచూస్తే సోమశిల కనిపిస్తుంది..
ఇక్కడొక సరస్వతీ దేవాలయం ఉంది
కనువిందు చేసే ప్రకతి. ఆహ్లాదకరమయిన వాతావరణంలో కొద్ది సేపయినా గడపాలనుకుంటే ఒకసారైన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న సంగమేశ్వరానికి వెళ్లిరండి. వచ్చే ఏడాది కోసం ప్లాన్ చేసుకోండి. ఆత్మకూరు - సంగమేశ్వరం మధ్య మరిన్ని ఆలయాలున్నాయి. వాటినికూడా చూడవచ్చు. అన్నట్లు మరొకవిశేషం. ఇక్కడొక సరస్వతీ ఆలయం కూడా ఉంది. పేరు కొలనుభారతి ఆలయం. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కాలేదు. ఇది గుర్తుంచుకోండి. సంగమేశ్వరం దగ్గిర భోజనం దొరకదు. మీరు తీసుకెళ్ళాలి. లేదా ఆత్మకూరు లేదా నంద్యాల వెళ్లే దాకా ఆగాలి.
చాలా మందికి తెలియని కథ, వ్యథ
ఇంతవరకు చాలామందికి తెలుసు. ఈ ఆలయం మునిగి పోవడానికి, బయల్పడటం ఈ మధ్య మొదలయింది. ప్రాజక్టు కట్టినపుడు ఈ ప్రాంతంలోని అనేక ఆలయాలను అలంపూర్, కర్నులు తరలించారు. ఈ ఆలయంలో శిల్పకళ విశేషంగా లేకపోవడం వల్ల ఈ ఆలయాన్ని తరలించలేదు. ఆలాగే ఉండిపోయింది. శ్రీశైలం ప్రాజక్టు లో నీటి మట్టం 854 అడుగులు ఉన్నపుడు ఆలయం నీటిలో మునుగుతుంది. నీటి మట్టం తగ్గే కొద్ది ఆలయం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. చాలా కాలం నీటి మట్టం 854 అడుగుల దగ్గిరే ఉండింది. అందువల్ల ప్రాజక్టు కట్టిన రెండు దశాబ్దాల పాటు సంగేమేశ్వరుడు జలాధివాసంలోనే ఉన్నాడు. అయితే, కృష్ణానది దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీరు అవసరం రావడం, కృష్ణా డెల్టారైతుల అవసరాలకు, విద్యుదుత్పాదనకు నీళ్లు విపరీతంగా విడుదలచేయడంతో నీటి మట్టం 854 అ. కంటే కిందికి పడిపోవడం మొదలయింది. ప్రభుత్వం 834 దాకా నీళ్లు వాడుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. ఇపుడు 834 అడుగుల దిగువకి కూడా నీళ్లు వాడుకోవాలనుకునే ప్రతిపాదన ఉంది.
అంటే గతంలో ఏడాదికి 8 నెలలు సంగమేశ్వరుడు జలాధి వాసంలో ఉండే వారు. ఇది ఇపుడు 6 నెలలకు తగ్గిపోయింది. అంటే ఎక్కువ కాలం ఆలయం కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఆలయంలో నిత్యపూజలకు ఆస్కారం ఏర్పడింది.
ఆలయం ప్రకృతిలో విలీనం కావడం, మళ్లీ ప్రత్యక్షం కావడం అనే వలయం పవిత్రమయినదని పూజారి రఘురామ శర్మ చెబుతారు. రిజర్వాయర్ లో నీరింకిపోయి, వేసవిలో సంగేమేశ్వరుడు మళ్లీ దర్శనమీయడం శుభశూచకం, ఈ ప్రాంతానికి సుఖశాంతులు కలిగిస్తుందని ఆయన చెబుతారు. అందువల్ల ఆలయం ప్రత్యక్షమయ్యే సమయంలో జరిగే పూజలకు చాలా విశేషం ఉందంటున్నారు. నిన్నటి నుంచి పూజారి ఆలయం పున: ప్రారంభమయ్యే ఘడియకోసం ఎదురుచూస్తుంటారు. పూజారి దృష్ఠిలో సంగమేశ్వరుడి జలాధివాసం తాత్కాలికమే.
వెయ్యేళ్ల నాటి ఆలయం
ఆలయం బాగా నిర్లక్ష్యానికి గురయింది. ఇక్కడి ఆలయం ఒక సారి ధ్వంసం చేశారు. అయితే, కంచి పరమాచార్యసూచనలకు మేరకు మళ్లీ పాక్షిక పునరుద్ధరణ జరిగింది. రాళ్లమీద శాసనాలున్నాయి. వాటిని తెలుగీకరించి పక్కన ఒక బోర్డు మీద ప్రదర్శించి ఉండవచ్చు.చేయలేదు. అందువల్ల ఆలయం విశిష్టణ స్పష్టంగా తెలియదు. దీనిని రాష్ట్రకూటులు కట్టినట్లు కొందరు చెబుతారు. మరికొందరు బాదామి చాళ్లుక్యులు కట్టి నట్టు చెబుతున్నారు. మొత్తానికి 11వ శతాబ్దం ఉత్తరార్ధంలో కట్టినట్లున్నారు. ఈ ప్రాంతానికి ఛత్రపతి శివాజీ కూడా సందర్శించారని చెబుతారు.
(ఆలయం పున: ప్రారంభం తదితర వివరాలకు పూజారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ : 9866460305. ఆత్మకూరు, నంద్యాలలలో లాడ్జ్ సౌకర్యం ఉంది. క్యాబ్ కూడా దొరుకుతుంది.)