విధేయతకు ఇదీ బహుమానం

సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పీతల సుజాత మంత్రి స్థాయికి ఎదిగారు. టీడీపీకి, చంద్రబాబుకు విధేయురాలైన ఆమె భవిత్యం నేడు ప్రశ్నార్థకంగా మారింది.;

Update: 2024-03-26 12:30 GMT
Peetala Sujatha

జి. విజయ కుమార్ 

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్లు కోల్పోయిన దళిత వర్గానికి చెందిన నేతల్లో మాజీ మంత్రి పీతల సుజాత ఒకరు. తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయురాలు. చంద్రబాబుకు పీతల సుజాత వీర భక్తురాలు. 2019 ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన సుజాత ఈ దఫా అయినా బెర్తు ఖరారు చేస్తారని చంద్రబాబుపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సారి కూడా ఆమెకు టికెట్‌ దక్కక పోడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎలాంటి గ్రూపు రాజకీయాలకు పాల్పడకుండా జిల్లా నేతలతో కూడా సఖ్యతగా మెలిగే పీతల సుజాతకు ఈ సారి కూడా టికెట్‌ దక్కక పోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత రెండు దఫాలుగా ఆమెకు చంద్రబాబు టికెట్‌ నిరాకరించడంతో ఆమె రాజకీయ భవిత్యం ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ స్థానిక నేతల్లో సాగుతోంది.
2004లో ఎమ్మెల్యేగా
పీతల సుజాత దళిత వర్గానికి చెందిన మహిళా నేత. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఒక సారి మంత్రిగా కూడా చంద్రబాబు మంత్రి వర్గంలో పని చేశారు. తొలుత 2004లో ఆమెకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఆచంట నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ మేరకు టికెట్‌ ఖరారు చేశారు. బరీలోకి దిగిన తొలి సారే విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌ ప్రకాష్‌ను 5వేల పైచిలుకు ఓట్లతో ఓడించి సుజాత విజయం సాధించింది. తర్వాత ఆచంట జనరల్‌ స్థానంగా మారింది. దీంతో అక్కడ పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన మకాంను చింతలపూడికి మార్చుకుంది. 2009 ఎన్నికల్లో ఆమెకు సీటు రాలేదు. 2014లో మళ్లీ అవకాశం లభించింది. చింతలపూడి అసెంబ్లీ స్థానం ఆమెకు కేటాయించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన బూర్ల దేవీప్రియపై దాదాపు 15వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
మంత్రిగా పీతల సుజాత
రాష్ట్ర విభజన అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో ఆమె చింతలపూడి నుంచి గెలిచింది. చంద్రబాబు తన మంత్రి వర్గంలో పీతల సుజాతకు స్థానం కల్పించారు. మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు మైనింగ్‌ శాఖలు కూడా ఆమెకు అప్పగించారు. ఇదే సమయంలో ఆమె మీద అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు కూడా వచ్చాయి. వడ్డాణం తీసుకొందని నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు విమర్శలు చేశారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే నేటి మంత్రి రోజా పీతల సుజాత లావు, బరువును ఎక్కిరిస్తూ బాడీ షేమింగ్‌కు కూడా పాల్పడిందని సుజాతా విమర్శించింది. అయితే జిల్లా నేతలతో నెలకొన్న విభేదాల వల్ల సుజాతకు మంత్రి పదవి పోగొట్టుకుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఇక అప్పటి నుంచి సుజాతకు పార్టీలో పెద్దగా అవకాశాలు రాకుండా పోయాయని, అప్పుడప్పుడు ప్రెస్‌ మీట్లు పెట్టినా పెద్దగా గుర్తింపు లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలోనే ఆమెకు 2019, 2024ఎన్నికల్లో సీటు రాకుండా పోయిందని కూడా స్థానికులు చర్చించుకుంటున్నారు.
సీటు దక్కక పోవడంతో ఆమె అసంతృప్తిని వెళ్లగక్కారు. కేవలం డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. 20 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాని తనతో పాటు మాజీ మంత్రి జవహర్‌కు కూడా టికెట్లు కేటాయించక పోవడం బాధాకరమని ఇటీవల ఆమె ఆవేదనను వెళ్లగక్కడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News