కమ్మవారి విమోచన దినంగా ఈ సంక్రాంతిని భావించాలి
విజయవాడ సమీపంలోని గంగూరులో కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు.;
గత ఐదేళ్లులో కమ్మ వారిపై బహిరంగ యుద్ధం ప్రకటించారని, ఈ సంక్రాంతిని కమ్మవారి విమోచన, విముక్తి దినంగా భావించాల్సిన అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గతంలో కమ్మ వారిపై జరగిన సంఘటనలు మళ్లీ భవిష్యత్‌లో ఎప్పుడూ పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత కమ్మ వారిపై ఎంతైనా ఉందని అన్నారు. కమ్మ వారి పూర్వీకులు ఎంతో మంచి మార్గదర్శనం చూపించారని దానిని భావి తరాలు అందిపుచ్చుకోవాలని, దీనిని ఒక బాధ్యతగా కమ్మ వారు తీసుకోవాలని అన్నారు. విజయవాడ గంగూరులో ఆదివారం కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథసత్యనారాయణ, కాకాని వెంకటరత్నం వంటి అనేక మంది జన్మించారని అన్నారు. అలాంటి కృష్ణా జిల్లాలను కొంత మంది విమర్శిస్తున్నారని, దమ్ముంటే ఆంధ్రబ్యాంక్‌ను పునరుద్దరించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే మరో రామోజీరావును చూపించడంటూ మరో సవాల్ విసిరారు. కమ్మ వారు మేధో వలసకు గురవుతున్నారని, వారి స్థితి గతులు స్థిరంగ లేవన్నారు. దీనిని భర్తీ చేసేందుకు కమ్మ వారందరూ ఆలోచనలు చేయాలన్నారు. కమ్మల్లో ఉన్న పేదవారిని ఆదుకునేందకు అన్ని విధాల సహకరించాలని, కమ్మ వారి సేవా సమితి మంచి కార్యక్రమాలు చేస్తోందని ఆయన అభినందించారు. పేద కమ్మలను ప్రోత్సహిస్తే వారిలో మరో సత్య నాదెళ్ల, ఎన్టీఆర్‌ను చూడొచ్చన్నారు. ప్రభుత్వాల్లో కమ్మ వారి ప్రాధాన్యత పెంచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. కమ్మ వారంతా విశాల దృక్పథంతో ముందుకెళ్లి సాయం చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషకరమని మరో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు.