ఈసారి ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఏ పార్టీది పైచేయి

గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 60 శాతంకుపైగా స్థానాలకు దక్కించుకుంది.

Update: 2024-03-19 10:08 GMT
Constitution

జి. విజయ కుమార్ 

ఆం«ధ్రప్రదేశ్‌లోని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోక వర్గాలను 2024 ఎన్నికల్లో ఏ పార్టీ దక్కించుకోబోతున్నదనే ఆసక్తి చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో సాగుతోంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మిగిలిన అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కొండపి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాల్లో తమ పట్టు నిలుపుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తుండగా, ఈ సారి ఎలాగైనా అధిక స్థానాలను కైవసం చేసుకొని తమ పార్టీ జెండాను ఎగుర వేయాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది.
సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా..
సంక్షేమ పథకాలను బేస్‌ చేసుకొని ఇరు పార్టీలు దళితుల ఓట్లను రాబట్టుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. నవరత్నాల పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది. టీడీపీ మాత్రం అందుకు భిన్నమైన లైన్‌ ఎంచుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రద్దు చేసిన 27 పథకాలు, వాటి ఆవశ్యకతను ఎస్సీల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో వివరించనున్నారు. భూమి కొనుగోలు, ఇన్నోవ వాహనాల పంపణీ, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు కోచింగ్‌ వంటి పథకాల అమలు, వాటి వల్ల ఎలాంటి లబ్ధి చేకూరిందనే అంశాలను దళితుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హయాంలో దళితులపై జరిగిన దాడులను కూడా ప్రధాన అస్త్రంగా సంధించేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.
2019తో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆదిక్యం
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలు మొత్తం 29 ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యం వీటిల్లో కనబరిచింది. మొత్తం 29 స్థానాలకు గాను 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఎస్సీ రిజ్వుడు సీట్లు దక్కించుకోలేక తెలుగుదేశం పార్టీ టోటల్‌గా కుప్పకూలింది. కొన్ని స్థానాల్లో పోటీ ఇవ్వలేక చతికిల పడింది. మరి కొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కేవలం ఒక్క నియోజక వర్గాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ దక్కించుకోగలిగింది. ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజక వర్గంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డోలా బాలవీరాంజనేయస్వామి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డాక్టర్‌ మదాసు వెంకయ్యపై గెలుపొందారు. 2014లో కూడా బాలవీరాంజనేయస్వామి ఇక్కడ నుంచి గెలుపొందారు. నాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన జూపూడి ప్రభాకరరావుపై బాలవీరాంజనేయస్వామి విజయం సాధించారు.
2014లో టీడీపీ ఆదిపత్యం..
2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎస్సీ రిజర్వుడు స్థానాలను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. హోరా హోరీగా సాగిన ఆ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం ప్రదర్శించింది. మెజారిటీ స్థానాలను దక్కించుకొని ఆ పార్టీ జెండాను ఎగుర వేసింది. మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 16 అసెంబ్లీ నియోజక వర్గాలను దక్కించుకొని ఆధిక్యతను ప్రదర్శించింది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ 13 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలను సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కంటే అధికంగా మూడు స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ తమ పట్టును నిలుపుకుంది.
ఎస్సీల కోసం అమలు చేసిన పథకాలు నాశనం చేశారు
రాష్ట్రంలోని 29 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలు చేస్తోందనే దానిపై ది ఫెడరల్‌ ప్రతినిధి ఆ పార్టీ సీనియర్‌ నేత, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను సంప్రదించగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరించిన దళిత వ్యతిరేక విధానాలనే దళితుల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో దాదాపు రూ. 45వేల కోట్లు దళితులకు సంక్షేమానికి ఖర్చు చేసింది. రాష్ట్రంలోని దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు 27 సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇన్నోవా కార్లు ఇచ్చాం. భూమి కొనుగోలు పథకం ద్వారా దళితులకు భూములు అందించాం. పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌ను ఇప్పించాం. అందుకు కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. విదేశీ విద్యను దళితులకు అందుబాటులోకి తెచ్చాం. వేలాది మంది దళిత విద్యార్థులు ఈ పథకం ద్వారా విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించాం. దళిత న్యాయవాదులకు స్టైఫండ్‌ అందించడంతో పాటుగా వారికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా అవకాశాలు కల్పించాం. ఇవన్నీ జగన్‌ నాశనం చేశారు. దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. సీఎం జగన్‌ హయాంలో దళితులపై దాడులు పెచ్చరిల్లాయి. రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణం చేపట్టాలని 25 ఎకరాలు కేటాయించడంతో పాటు రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశాం. కానీ దీనిని సీఎం జగన్‌ నాశనం చేశారు. దీంతో ఇది శిథిలావస్థకు చేరుకుంది. సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ రద్దు చేయడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. చివరకు విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్‌ పేరును తొలగించి సీఎం జగన్‌ పేరు పెట్టుకున్నారు. దీంతో దళితులు సీఎం జగన్‌ ప్రభుత్వంపై రగిలి పోతున్నారు. అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు. ఈ అంశాలను దళితుల్లోకి తీసుకెళ్లనున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని 29 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంట్‌ స్థానాలకు కూడా కైవసం చేసుకుంటామని వర్ల రామయ్య చెప్పారు.
కొండపి ఎమ్మెల్యే డోలా వీరబాలాంజనేయ స్వామిని సంప్రదించగా 29 రిజర్వుడు స్థానాలను గెలుచుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీ పెద్దలు చూసుకుంటారని, తన వరకు తన కొండపి నియోజక వర్గంలో దళితులపై సీఎం జగన్‌ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నా తల్లికి ఆరోగ్యం బాగా లేనందు వల్ల చికిత్స కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానన్నారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబును సంప్రదించగా తాను వేరే సమావేశంలో ఉన్నానని తర్వాత మాట్లాడుతానని బదులిచ్చారు.
Tags:    

Similar News