సాయం చేయండి.. దానిని బ్యాంకులో దాచుకోండి!
అందుబాటులోకి రానున్న టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చేసిన సేవ ఈ బ్యాంకు ఖాతాలో జమ. అవసరమైనప్పడు ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ జిల్లాగా విశాఖ ఎంపిక.;
బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే అవసరమైనప్పుడు ఆ సొమ్మును తీసుకుని వాడుకోవచ్చు. ఇకపై మీరు ఎవరికైనా సాయం చేస్తే ఆ సమయాన్ని బ్యాంకులో భద్రంగా దాచుకోవచ్చు. మీకు అవసరమనుకున్నప్పడు ఆ సాయాన్ని తిరిగి ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ| అయితే అదేమిటో ఈ కథనాన్ని చదవండి!
పూర్వం రోజుల్లో సమష్టి, ఉమ్మడి కుటుంబాలుండేవి. కుటుంబంలో ఎవరికి ఏ అనారోగ్య, వ్రుద్ధాప్య సమస్యలు వచ్చినా ఆ కుటుంబ సభ్యులే చూసుకునే వారు. క్రమంగా రోజులు మారాయి. ఒంటరితనం పరిస్థితే ఉండేది కాదు. రానురాను ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగయ్యాయి. అప్పట్లో దంపతులకు కనీసం నలుగురైదుగురి సంతానం ఉండేది. ఇప్పుడది ఒకరిద్దరికే పరిమితమైంది. పుట్టిన ఒకరిద్దరు పిల్లలు ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలూ, ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇళ్లకే పరిమితమవుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. వీరి బాగోగులు చూసే వారే కరువవుతున్నారు. అలాంటి వారికి, నిస్సహాయకులకు, కుంగుబాటులో ఉన్న వారికి సాయపడేందుకు, వారి ఆరోగ్య, ఇతర అవసరాలు ఉచితంగా చూసేందుకు రాజస్థాన్‌కు చెందిన ప్రభోద్ చంద్ జైన్ మరికొందరితో కలిసి సరికొత్త సేవా మార్గానికి జీవం పోశారు. దానికి టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరిట ఓ ట్రస్టును 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు.
ఏమిటీ టైమ్ బ్యాంక్? ఎవరి కోసం?
ఈ టైమ్ బ్యాంకు ద్వారా వయో వ్రుద్ధులకు, దివ్యాంగులకు మానవ సేవ అందించాలనుకునే వారు, అలాగే ఈ వారి సేవలను పొందాలనుకునే వారు ముందుగా టైమ్ బ్యాంకు వెబ్‌సైట్‌లో రిజిస్టరు కావలసి ఉంటుంది. సేవ చేయాలనుకునే వారి వయసు 18 ఏళ్లు నిండాలి. సేవ చేసే వారి పూర్తి వివరాలు అందులో నమోదవుతాయి. సేవలందించే వారు, పొందే వారిని సమన్వయం చేయడానికి నేషనల్, స్టేట్, డిస్ట్రిక్్ట, లోకల్ స్థాయిల్లో అడ్మిన్లు ఉంటారు. వాటిలో ఉండే పిన్ కోడ్‌ను బట్టి సేవ అవసరమైన వారికి సమీపంలో ఉన్న సేవకుడికి తెలియజేస్తారు. ఆయన అక్కడకు వెళ్లి వారికి సేవ చేస్తారు.
వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లడం, అవసరమైతే అక్కడ చేర్చి సపర్యలు చేయడం, అవసరాలను తీర్చడం, వారికి తోడుగా ఎక్కడికైనా తోడ్కొని వెళ్లడం వంటి సేవలందిస్తారు. వీరు అందించిన సేవల సమయాన్ని ఈ టైమ్ బ్యాంక్ పాస్ బుక్ అకౌంట్‌లో గంటల చొప్పున జమ చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా ఒకరికి మూడు గంటల పాటు సేవలందిస్తే అతని ఖాతాలో ఆ సమయం నమోదవుతుంది. అలా సేవలందంచిన సమయం ప్రతిసారీ వారి ఖాతాలో చేరుతూనే ఉంటుంది. ఇలా తాము అందించిన సేవల మొత్తాన్ని ఎప్పుడైనా అవసరమైనప్పుడు తిరిగి వీరు పొందవచ్చు.
అంతా పకడ్బందీగా..
సేవలందించే వారి పేరిట సేవలు పొందే వారింటికి వెళ్లి మోసాలకు, అఘాయిత్యాలకు పాల్పడకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకుంటారు. ఈ టైమ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ట్రస్టులో చేరాలనుకునే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకుంటారు. వారి కేవైసీని పరిశీలించి సంత్రుప్తి చెందాకే చేరడానికి అనుమతిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. ఒకవేళ తక్కువ సమయం సేవలందించి ఎక్కువగా చూపేందుకు ఆస్కారం లేకుండా సేవ పొందిన వారి సమ్మతితో ఆ సమయాన్ని నమోదు చేస్తారు.
ఏపీలో విశాఖ జిల్లా ఎంపిక..
టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఇప్పటివరకు రాజస్థాన్‌తో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, సూరత్, పూణే, చెన్నై, అహ్మదాబాద్, లక్నో తదితర నగరాల్లో అమలవుతోంది. ఈ ట్రస్టు వినూత్న సేవా ధ్రుక్పధాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విశాఖలో పైలట్ జిల్లాగా ఎంపిక చేసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొన్ని జిల్లాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య ప్రతినిధులు విశాఖ వచ్చారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు.
ఈ సెమినార్‌కు పోలీసు, ఆర్టీసీ, సాంఘిక సంక్షేమ, యూసీడీ తదితర విభాగాలకు చెందిన అధికారులతో పాటు కాలేజీ విద్యార్థులు హాజరరయ్యారు. కాగా ఈ టైమ్ బ్యాంకులో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇప్పటి వరకు 6500 మందికి పైగా సభ్యులుగా చేరారు. విశాఖపట్నంలో 60 మంది వరకు నమోదు చేసుకున్నారు. విశాఖలో ప్రస్తుతానికి నలుగురైదుగురు అడ్మిన్లు ఉన్నారు. పిన్ కోడ్‌ల వారీగా వీరి సంఖ్య క్రమంగా పెరగనుంది. * ఇందులోని సభ్యులు స్థానికంగానే కాదు.. ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ అందుబాటులో ఉన్న సేవలకు నుంచి కూడా సాయం పొందవచ్చు* అని విశాఖకు చెందిన త్రినాథ్ అనే అడ్మిన్ * ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్* ప్రతినిధితో చెప్పారు.
వయోవ్రుద్ధులకు సాంత్వన
టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాకుల ద్వారా వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరికి సాంత్వన లభిస్తుందని, సహాయకులు అండగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటంతో సీనియర్ సిటిజన్లకు ఒంటరితనం అనే భావన ఉండేది కాదని, ఇప్పుడు పరిస్థితులు మారటం వల్ల వారు ఒంటరిగా మారుతున్నారన్నారు. రోజువారీ అవసరాలలో, వారి భావోద్వేగ అవసరాలలో ఇతరుల తోడు అవసరమవుతుందని, ఈ టైమ్ బ్యాంక్ భావనతో ఆ పరిస్థితిని మార్చుకోవచ్చని కలెక్టర్ అన్నారు. టమ్ బ్యాంకుతో భవిష్యత్తులో వృద్ధులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
సేవా ద్రుక్పథం ఉన్న వారికిదో అవకాశం..
టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ లో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు www.timebankofindia.com అనే వెబ్ అడ్రస్ లో లేదా time bank India అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్, సేవ, పాస్ బుక్ పొందడం వంటివన్నీ ఉచితంగా లభిస్తాయి. యువకులు మాత్రమే కాకుండా, సహాయం అందించడానికి అర్హులైన వారందరూ స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. ఆ మేరకు వారి సమయం వారి పాస్ పుస్తకాలలో జమ అవుతుంది. వారికి అవసరమైనప్పుడు ఇతరుల నుంచి ఉచితంగా సహాయం పొందవచ్చు. నమోదైన సభ్యులను స్థానిక నిర్వాహకుల ద్వారా వారి KYC ధృవీకరిస్తాం. పోలీస్ వెరిఫికేషన్ కు కూడా పంపిస్తాం. తర్వాత పిన్ కోడ్, ప్రాక్సీలో ఉన్న చిన్న ప్రాంతాలను ఒక యూనిట్‌గా తీసుకొని వెబ్/మొబైల్ యాప్ లో వచ్చిన రిక్వెస్ట్ మేరకు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సేవా ద్రుక్పథం ఉన్న వారికిదో వరం లాంటిదని చొప్పవచ్చు. పైలట్ జిల్లాగా ఎంపికైన విశాఖపట్టణంలో ఈ కాన్సప్ట్ అమలుకు అన్నిచర్యలు తీసుకుంటాం. దీనికి ప్రజల సహకారం కావాలి* అని ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షిస్తున్న విశాఖపట్నం జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ జల్లేపల్లి మాధవి ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.