తిరుమల కొండ నిండా యాత్రికులే...
శ్రీవారిని శనివారం రికార్డు స్థాయిలో 92 వేల మంది దర్శనం చేసుకున్నారు.;
Byline : The Federal
Update: 2025-07-13 12:40 GMT
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. శిలాతోరణం క్యూలైన్ నుంచి భక్తులను దర్శనానికి తితిదే అధికారులు అనుమతిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, సామాన్య యాత్రికులు కిలోమీటర్ల కొద్ది శిలాతోరణం వరకు క్యూ లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమల ఆలయ షెడ్లు, క్యూలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అధికారులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, మజ్జిగ శ్రీవారి సేవకుల ద్వారా అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
వారాంతం కావడంతో యాత్రికుల రద్దీ భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది.
జూలై 12, 2025న 92,221 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 42,280 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం ₹3.51 కోట్లుగా నమోదైంది.
సాధారణ దర్శనం (సర్వదర్శనం) కోసం 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. దర్శనానికి సుమారు 12-14 గంటల సమయం పడుతుంది. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటలు, దివ్య దర్శనం (నడక మార్గం) వారికి 6-8 గంటలు పడుతోంది.
జూలై 11, 2025న 70,217 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
జూలై 10, 2025న 63,473 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకనల ఉన్న వారితో పాటు ఆర్జితసేవా టికెట్లు తీసుకున్న యాత్రికులు హాజరయ్యారు.
బ్రేక్ దర్శనాల రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా ఈనెల 15 నుంచి రెండు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టిటిడి ప్రకటించింది. అంటే 13వ తేదీనే సిఫారసులు లేఖలు అనుమతించరు.