Tirupati| తిరుపతి స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం

సుదీర్ఘ విరామం తరువాత తిరుపతి ప్రాంత ప్రజలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చింది. ఉచిత దర్శనం టోకెన్లు సోమవారం జారీ చేయనున్నారు.

Update: 2024-11-30 05:59 GMT

తిరుపతి ప్రాంత ప్రజలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంది. సోమవారం (డిసెంబర్ రెండో తేదీ) తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈఓ జే.శ్యామలరావు ప్రకటించారు.

వాస్తవానికి ఆదివారం ఉదయం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. తుపాను కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. ఆ రోజు టోకెన్లు తీసుకున్న వారికి మంగళవారం అంటే డిసెంబర్ మూడో తేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది.

టోకెన్లు వారికే

తిరుపతి స్థానికులు అని టీటీడీ మొదట చెప్పినప్పుడు చాలామంది ధర్మసందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. తిరుపతి నగరం తోపాటు రూరల్ మండలం, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన వారికి ఆధార్ కార్డు ప్రామాణికంగా టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది.

ఎక్కడ ఇస్తారంటే...

ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు టికెట్లు జారీ చేయడానికి రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి నగరం ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న టీటీడీ మహతి ఆడిటోరియంలో ఒక కౌంటర్, సుమారు 1200 కుటుంబాలు నివాసం ఉన్న తిరుమల కమ్యూనిటీ హాల్ లో మరో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి ఒక రోజు ముందే టోకెన్లు జారీ చేయనున్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నెల 18వ తేదీ టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి మొదటి సమావేశంలోనే తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే డిమాండ్ కు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది డిసెంబర్రెండో తేదీ నుంచి టోకెన్ల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. టోకెన్లు తీసుకున్న యాత్రికులకు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించడానికి వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

ప్రధానంగా టోకెన్లు తీసుకోవడానికి ఆధార్ కార్డు తీసుకుని రావాల్సి ఉంటుంది. అది కూడా తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల వారికే టోకెన్లు జారీ చేస్తారనే ప్రకటించారు.

Tags:    

Similar News