TIRUMALA | Tokens for Vaikuntha Ekadashi from January 9th
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో 1.20 లక్షల మందికి దర్శనం కల్పిస్తారు.
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-26 05:36 GMT
తిరుమలలో వైకుంఠ ఏకాదశి నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతితో పాటు తిరుమలలో జనవరి 9వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్ల జారీ చేయడానికి జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈఓ జే. శ్యామలరావు పరిశీలించారు. మూడు రోజుల తరువాత అంటే 11వ తేదీ నుంచి జారీ చేసే టోకెన్ తీసుకున్న యాత్రికుడికి అదే రోజు శ్రీవారి దర్శనం కల్పించడానికి అనువుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
2025 జనవరి పదో తేదీ నుంచి పది రోజుల పాటు టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ప్రకటించింది.
టైం స్లాట్ టోకెన్లు జారీ ఎక్కడంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు (Time slat Tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుంచి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని ఆయన వెల్లడించారు. ఆ తరువాత రోజులకు ఏ రోజుకు రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు.
తిరుపతి: రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్,
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయం
రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణునివాసం యాత్రికుల సముదాయం
బైరాగిపట్టెడ వద్ద ఉన్న రామానాయుడు హైస్కూల్,
ఎం.ఆర్. పల్లి స్కూల్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల: బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ కేంద్రంగా అక్కడి స్థానికులకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కేంద్రాలలో కౌంటర్ల ఏర్పాటుకు టీటీడీ ఈఓ జే. శ్యామలరావు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ కేంద్రాల వద్ద యాత్రికులకు కనీస సదుపాయాల కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఈఓ శ్యామలరావు ఆదేశించారు.
ఆధార్ కార్డు తప్పనిసరి
తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలోని 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
2.60 లక్షల మందికి దర్శనం
ఆన్ లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ ద్వార దర్శనానికి (Special Entrence Darsan) 1.40 లక్షల టికెట్లు అరగంటలోపే పూర్తయ్యాయి. మంగళవారం ఆన్ లైన్ లో ఈ టికెట్లు యాత్రికులు కొనుగోలు చేశారు. టికెట్ల కోసం 14 లక్షల మంది టీటీడీ సైట్ ను సందర్శించారు. కాగా, తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వారంలో పది రోజులపాటు శ్రీవారి దర్శనానికి 1.20 లక్షల మందిని అనుమతించనున్నారు. అంటే జనవరి పదో తేదీ నుంచి మూడు రోజుల పాటు 2.60 లక్షల మందికి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ప్రకటించింది.
వీఐపీలకు లెక్కలేదు...
వైకుంఠ ఏకాదశి, మరుసట రోజు ద్వాదశి ఘడియల్లో శ్రీవారి దర్శనానికి వీఐపీలు, వీవీఐపీలు, ప్రొటోకాల్ ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక దర్శనానికి కొదవ లేదు వారికి ప్రత్యేకంగా పాసులు కూడా జారీ చేస్తారు. వారి సంఖ్య ఎన్ని వేలల్లో ఉంటుంది? ఎన్ని పాసులు జారీ చేస్తారనేది మాత్రం టీటీడీ వెల్లడించదు. అదో చిదంబర రహస్యం.