'సీఐడీ' సంజయ్‌ ముందస్తు బెయిల్ ని 'సుప్రీం' ఎందుకు రద్దు చేసిందంటే..

సంజయ్‌ కోర్టు ముందు లొంగిపోవడానికి సుప్రీంకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది;

Update: 2025-07-31 11:17 GMT
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్
ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ మాజీ డైరెక్టర్‌ సంజయ్‌కి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టి లతో కూడిన ధర్మాసనం జూలై 31న ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఇచ్చిన 49 పేజీల తీర్పు విషయంలో ధర్మాసనం గత విచారణలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ పూర్తయినట్టుగా తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించింది. సంజయ్ నిర్వహించిన ప్రతీ అవగాహన సదస్సులో 350 మందే హాజరయ్యారని చూపడంపై "ఇది ఎలా సాధ్యం?" అని కోర్టు ప్రశ్నించింది. ప్రతి సదస్సులో ఒక్కరు తక్కువ, ఒక్కరు ఎక్కువ లేకుండా ఎలా ఉంటుంది? అని విస్మయం వ్యక్తం చేసింది.
మూడు వారాల్లో కోర్టు ఎదుట లొంగాలని ఆదేశం
సంజయ్‌ కోర్టు ముందు లొంగిపోవడానికి సుప్రీంకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఆయన కస్టడీకి సంబంధించి దర్యాప్తు సంస్థ- మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయవచ్చని తెలిపింది. అలాగే సంజయ్‌ కూడా బెయిల్ కోసం మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని పేర్కొంది.
అవినీతి కేసులో ముందస్తు బెయిల్‌పై వివాదం
అగ్నిమాపక శాఖలో ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఆన్ లైన్లో జారీకి సంబంధించిన అవినీతి కేసులో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం వచ్చింది.
సొంత సంస్థలకు కాంట్రాక్టులు, నష్టం రూ.2 కోట్లు
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నివేదిక ప్రకారం, సంజయ్‌ రెండు ప్రైవేట్‌ సంస్థలకు పని జరగకపోయినా రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించారు. అగ్నిమాపక శాఖలో అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధికి, 150 టాబ్స్ (computer tabs) కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టు ను సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించి రూ.59.93 లక్షలు చెల్లించారు.
సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన సదస్సులకు సంబంధించి క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు కాంట్రాక్టు అప్పగించి రూ.1.19 కోట్లు చెల్లించారు. అయితే సదస్సులు సీఐడీ అధికారులు నిర్వహించారని సంబంధిత వ్యక్తులు చెప్పారు. అయినా బిల్లులు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2 కోట్ల మేర నష్టం జరిగింది. దీని ఆధారంగా ఏసీబీ సంజయ్‌పై కేసు నమోదు చేసింది.
Tags:    

Similar News