మహిళా నేతల గళాల్ని ఎందుకు నొక్కేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మహిళానేతలు ఎవరు నోరు విప్పినా పురుషులు ఎందుకు దాడి చేస్తున్నారు;

Update: 2025-07-21 13:18 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మహిళానేతలు ఎవరు నోరు విప్పినా పురుషులు ఎందుకు దాడి చేస్తున్నారు? ఆకాశంలో సగం, అన్నింటా సమానం, రాజకీయ భాగస్వామ్యంలో సగం అంటూ ఉపన్యాసాలు దంచే వాళ్లు, అటువంటి పార్టీలు కూడా మహిళా నేతల విమర్శల్ని ఎందుకు సహించలేకపోతున్నారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా, మరో రాజకీయ నాయకురాలు వినూత కోట పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిలో ఎక్కువ మంది పురుషులే. అందరూ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులే. వీళ్లే ఇలా మాట్లాడితే సామాన్య కార్యకర్తలు ఇంకెంతగా రెచ్చిపోతారు.. దానివల్ల సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

భారత రాజకీయ వ్యవస్థ పితృస్వామిక సమాజపు ప్రతిబింబం. ఈ వ్యవస్థలో అధికశాతం పురుషులే. ఆర్ధిక బలం, బలగం, శక్తి, ప్రతిష్ఠ, నిర్ణయాధికారం వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు "రెబల్"గా కనిపిస్తూ, సమాజపు నియమాలను ప్రశ్నించే వారిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాస్త ఎదుగుతున్నారని అభిప్రాయం రావడంతోనే వారిపై వ్యక్తిగత విమర్శలు, లైంగిక వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ విధంగా వాళ్లను రాజకీయాలకు దూరం చేసే ఓ కుట్ర నడుస్తోందని మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు.
మహిళా నేతలపై వ్యక్తిగత దాడుల స్వభావం
పురుష నేతలపై రాజకీయ విమర్శలు సాధారణంగా పాలన, విధానాలపై ఉండగా, మహిళా నాయకులపై దాడులు శరీర లక్షణాలు, వ్యక్తిగత జీవితం, సంబంధాలు, తీరు–ధోరణులపై కేంద్రీకృతమవుతున్నాయి. ఇందుకు మమతా బెనర్జీ, స్మృతి ఇరానీ, రేణుకా చౌదరి మొదలు పీతల సుజాత, వంగలపూడి అనిత, విడదల రజనీ, వాసిరెడ్డి పద్మ, రోజా వరకు ఎవరూ మినహాయింపు కాకుండా ఉంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా మహిళా రాజకీయ నేతలను మరింతగా టార్గెట్ చేసే సాధనంగా మారింది. ‘డీప్‌ఫేక్’, ‘మార్ఫింగ్’, తప్పుడు కథనాలు మహిళలను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఇది వారిని వెనక్కి తగ్గేలా చేసే ప్రయత్నంగా మారింది. పురుష నాయకులకు సంబంధించిన విమర్శలు కేవలం వ్యంగమో, హాస్యరూపంలో ఉంటే, మహిళలపై మాత్రం విషప్రచారంగా మారుతుంది.
మదింపు లేనితనంతో కూడిన రాజకీయ పటిష్టత
మహిళా నాయకుల తీరుపై కొందరు పురుషులు ఏకంగా తీర్పే ఇచ్చేస్తున్న ధోరణి బాగా ప్రబలింది. "మహిళల సామర్థ్యాన్ని"ను ప్రశ్నించడమే ఇందులో కేంద్ర బిందువు. వారి హోదాతో నిమిత్తం లేకుండా ఈ తీర్పులు ఉంటున్నాయి. అటు పురుషులైనా ఇటు మహిళలైనా ప్రజల ఓట్ల ద్వారానే గెలుస్తారు. మహిళలు ఎవరైనా గెలిస్తే ఓ రకమైన చులకన భావంతో.. ఆ.. ఆమెదేముందిలే, కుటుంబ వారసత్వమనో, డబ్బులనో చెబుతూ వారికి "అర్హత లేదు" అనే వాదనను చేస్తుంటారు. అదే సూత్రాన్ని పురుషులకు అప్లై చేయాల్సి వచ్చినపుడు అతడు ఇంద్రుడు, చంద్రుడంటూ కీర్తిస్తుంటారు.
గెలిచినా, ఓడినా మహిళలపైన్నే దాడులు..
మహిళలు గెలిచినా, ఓడినా విమర్శల దాడులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అర్హతలతో నిమిత్తం లేకుండా ఈ విమర్శలు ఉంటుంటాయి. పొరపాటున ఓడిపోతే "ఆమెకు అర్హత లేదు" అనే విమర్శలు వస్తాయి. ఇక్కడే మహిళ నాయకుల చుట్టూ నెలకున్న అసమానత బయటపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు తక్కువమందే ఉన్నారు. కానీ వాళ్లెవరైనా ధాటిగా మాట్లాడితే, ప్రజల ముందుకు వస్తే, సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే – వెంటనే ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు ఎదురవుతాయి. అధికారపక్షమా, ప్రతిపక్షమా అనే తేడా లేకుండా మహిళా నేతలే లక్ష్యం అవుతున్నారు. ఇదొక సామాజిక సంక్షోభానికి సంకేతం. రాజకీయాల్లో మహిళా గళాలను సహించలేని తనాన్ని సూచించే సంకేతం.
ప్రజాస్వామ్యంలో విమర్శలకే ప్రాధాన్యం ఉంటుంది. అటువంటి వాటిని లైంగికంగా మలచడమే తప్పు. రాజకీయాల్లో విమర్శలు సహజం – మహిళలు మినహాయింపు కాదు. కాకపోతే సంయమనం అవసరం.
మహిళలపై ట్రోలింగ్ చేయడంలో కనిపించే 5 ప్రధాన ధోరణులు..
1. ‘స్త్రీ’గా కనిపించడమే సమస్యా?
మహిళలు ప్రజల ముందుకు వస్తే, వారి బాడీ లాంగ్వేజ్, దుస్తులు, నవ్వు – అన్నీ విమర్శలకు కారణాలు అవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష రుజువు మాజీ మంత్రి పీతల సుజాతపై రాజకీయ ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలు ఆమె దేహ స్వరూపానికి సంబంధించినవి. ఇది విమర్శ కాదు, వేధింపు. ఇది స్త్రీగా ఆమె ఉండటానికే పెట్టే శిక్ష.
2. కుటుంబ బంధాలు...
చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆమెపై జరిగిన ట్రోలింగ్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శం. ఆమె తండ్రి నందమూరి తారక రామారావు. ఆయనకు గుర్తింపు లేకుండా చేసి చంద్రబాబు భార్యగా చూపి ట్రోలింగ్ చేయడం, ఆమెను, ఆమె కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం. రాజకీయ చర్చల మధ్య ఆమెను వ్యక్తిగా కాకుండా, ఎవరి భార్యగానో చూసేవిధంగా కామెంట్లు పెట్టి వేధించారు. ఇది ఆమె రాజకీయతకు అవమానం. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాగే మిగతా వాళ్ల విషయంలోనూ జరుగుతోంది.
3. సరిగా మాట్లాడడం కూడా శిక్షనే...
ఉదాహరణ వంగలపూడి అనిత, వాసిరెడ్డి పద్మ గట్టిగా, స్పష్టంగా మాట్లాడగలిగే నాయకులు. కానీ వాళ్లపై సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన, లైంగిక స్ధాయికి దిగజారిన వ్యాఖ్యలు వాళ్ల సామర్థ్యానికి ప్రతిస్పందన కాదు — ఆ సామర్థ్యాన్ని అణిచివేయాలన్న ప్రయత్నం.
4. పేరున్న నేతల విషయంలో అశ్లీలీకరణ
మాజీ మంత్రి ఆర్కే రోజా, జనసేన నేత కొటా వినూత లాంటి యువనేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన వెంటనే వారిపై మూకుమ్మడిగా చేసే ట్రోలింగ్ అసహ్యం కలిగించే రీతిలో ఉంటుంది. ట్రోలింగ్ యంత్రాంగం వారిని నాయకురాలిగా కాకుండా ఒక గ్లామర్ వస్తువుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది.
5. పదవుల పట్లే అపహాస్యం
ఎవరైనా మహిళా నేతలు నేషనల్ మీడియా ముందు వాస్తవాల ఆధారంగా మాట్లాడితే చాలు వాళ్ల పాత్రను క్రియాశీలకంగా చర్చించకుండా వ్యక్తిగతంగా ముద్రవేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది మహిళ పదవిని ఓ అలంకార వస్తువుగా చూడాలన్న సంకుచితత్వం.

ఈ ధోరణిలో రాజకీయ పార్టీలు కూడా పాలుపంచుకుంటున్నాయి. తమ పార్టీలకు చెందని మహిళా నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కాంటెంట్లు, అభద్రకర పోస్టర్లు సృష్టిస్తూ రాజకీయాల్లోకి ఎదుకొచ్చాం రా బాబూ అనేలా చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీని విమర్శించే వాళ్లను – “పార్టీకో బాద్యతాయుతమైన మహిళా ప్రతినిధిగా” చూసే సంస్కృతి కనిపించడం లేదు.
ఈ ధోరణిని అరికట్టాల్సిన రాజకీయ పార్టీలు కూడా ఈ తరహా విమర్శలు, వ్యక్తిగత విమర్శల నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూరక పోతుందా అని ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దోరణిని అన్ని పార్టీల నేతలు అరికట్టగలిగితే ఈ అసమాన సమాజంలో మహిళలు ముందుకు రాగలుగుతారు. మహిళా నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది. ట్రోలింగ్ చర్యలపై పార్టీలు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. మార్పు కోసం అవసరమైన దిశగా చర్యలు చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు ఓటర్లగానే కాకుండా నాయకులుగా ముందుకు రావాలంటే సామాజిక చైతన్యం అవసరం. ‘ఓటేయ్యమ్మో’ అని అడిగే సమాజమే, ఆ తర్వాత రాజకీయంగా అభివృద్ధి చెందిన మహిళా నేతలను అశ్లీలంగా చూపడం, విమర్శలకు దిగడం అత్యంత దుర్మార్గం. ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది సామాజిక సమస్య.
Tags:    

Similar News