నెయ్యిలో కల్తీ ఉందన్న ఈవో.. ఆరోపణలను తోసిపుచ్చిన ఏఆర్ డైరీ

తిరుమల తిరుపతి ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈఓ శ్యామల రావు నిర్ధారించారు. ఈ అంశంపై నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఘాటుగా స్పందించింది.

Update: 2024-09-20 10:31 GMT

తిరుమల తిరుపతి ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈఓ శ్యామల రావు నిర్ధారించారు. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిసిందంటూ ఎన్‌డీడీబీ తన నివేదికలో పేర్కొందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, ఇందులో నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే నిజం అయితే బాధ్యులను కఠినాతి కఠినంగా శిక్షించాలని, ఇది ఒక వ్యక్తి అవినీతికి సంబంధించిన అంశం కాదని కోట్ల మంది హిందువుల మనోభావాలకు చెందిన సమస్య అని ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్య బోర్డు ఈవో శ్యామల రావు ఈ అంశంపై స్పందించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చి చెప్పారు. ఆయన చేసిన ఈ ప్రకటన మరింత దుమారం రేపుతుంది. అంతేకాకుండా అంత తక్కువ ధరకు నాణ్యమైన ఆవు నెయ్యి ఎలా లభిస్తుందని, సంస్థ వాడు తాను నష్టం భరిస్తూ మనకు లాభం ఎందుకు చేకూరస్తారని ఆయన ప్రశ్నించారు.

‘‘శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో లడ్డూ నాణ్యతపై దృష్టిసారించి పోటు సిబ్బందితో చర్చించాను. వారు కూడా లడ్డూ నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యంగా ఉండాలని అందులో వాడే నెయ్యి నాణ్యంగా ఉండాలని వివరించారు. నెయ్యి నాసిరకంగా ఉన్న కారణంగా లడ్డూ నాణ్యత కోల్పోయిందని చెప్పారు. ఈ విషయాన్ని గుత్తేదారు దృష్టికి కూడా తీసుకెల్లాం. నెయ్యిలో నాణ్యత లోపాన్ని నేను కూడా గుర్తించాను. నెయ్యి నాణ్యతను నిర్ధారించడానికి టీటీడీకి సొంత ప్రయోగశాల లేదు. గతంలో ఉన్న అధికారులు నెయ్యి నాణ్యతపై పరీక్షలు చేయించలేదు. అందుకే నెయ్యి నాణ్యత తెలుసుకోవడం కోసం బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఏఆర్ సంస్థ వాళ్లు రూ.411కే కిలో నెయ్యి అందించారు. నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా వస్తుంది. ఎలా సరఫరా చేస్తున్నారు? ఎవరూ రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేయలేరు. మేము హెచ్చరించిన తర్వాత గుత్తేదారు నాణ్యత పెంచారు’’ అని తెలిపారు.

ఆ నెయ్యి వాడకం ఆపేశాం

‘‘ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో ఆ సంస్థ నెయ్యి వాడకాన్ని నిలిపేశాం. లడ్డూ తయారీలో ఏఆర్ డైరీ నెయ్యిని ఏమాత్రం వినియోగించడం లేదు. జూలై 5, 6 తేదీల్లో రెండు నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ తీసుకుని బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయించాం. ఏఆర్ డైరీ నెయ్యిలో కల్తీ జరిగిందని ఆ పరీక్షలు తేల్చాయి. దీంతో ఆ నెయ్యిని ఆపేసి కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ఖరారు చేశాం’’ అని ఈవో శ్యామల రావు వెల్లడించారు. కాగా తమపై వెలువడుతున్న ఆరోపణలను ఏఆర్ డైరీ తీవ్రంగా ఖండించింది. ఇది సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విష ప్రచారం తగదు: ఏఆర్ డైరీ

‘‘ఏఆర్ డైరీ నుంచి జూన్, జూలై నెలలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు టీటీడీకి మా సంస్థ నెయ్యి సరఫరా చేయడం లేదు. మేము 25 ఏళ్లుగా డైరీ సేవలు అందిస్తున్నాం. మా ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొలేదు. ఎక్కడా ఇలాంటి ఆరోపణలు కూడా మేము ఎదుర్కోలేదు. మాపై ఇటువంటి విషప్రచారం చేయడం తగదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఏఆర్ డైరీ.

Tags:    

Similar News