తిరుమల టోకెన్ ఉంటే ఎన్ని లడ్లైనా కొనవచ్చు: టీటీడీ ఈఓ
కొందరే వేలల్లో లడ్డులు కొంటున్నారు. పెళ్లిళ్లలో వడిస్తున్నారు. అందుకే కొత్త లడ్డూ పాలసీ
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు చుట్టూ కొన్ని రోజులు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. దళారీ వ్యవస్థను మట్టుబెట్టడానికి టీటీడీ యాజమాన్యం అనేక చర్యలు చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాటికి ధీటుగా మరెన్నో ఇతర వార్తలు భక్తులను అయోమయంలో పడేస్తున్నాయి. ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూ ప్రసాదమని, అది కూడా ఒక భక్తులు నెలకు ఒక్కసారి మాత్రమే లడ్డూ ప్రసాదం పొందుతాడంటూ అనేక వార్తలు రెండు మూడు రోజులుగా భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అదే విధంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చి టోకెన్లు లేని భక్తులు ఆధార్ కార్డు సహాయంతో లడ్డు ప్రసాదం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఏఈఓ తెలిపారు. తాజాగా ఈ లడ్డూ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామల రావు పలు కీలక విషయాలు వెల్లడించారు. లడ్డూ ప్రసాదంతో వ్యాపారాలు చేస్తున్న దళారీవ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన లడ్డు ప్రసాద వ్యవహారంపై స్పందించారు.
సరికొత్త లడ్డు పాలసి
అనంతరం లడ్డూల వ్యవహారంలో ఐటీ విభాగం పనితీరుపై ఈఓ శ్యామలరావు కీలక విషయాలు చెప్పారు. ‘‘ప్రతిరోజూ 3.5 లక్షల లడ్డూలను కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నాం. ఎటువంటి టోకెన్ లేకుండా ప్రతి రోజూ లక్ష లడ్డూల వరకు అందిస్తున్నాం. అతి త్వరలోనే ప్రత్యేక లడ్డూ పాలసీ తీసుకొస్తాం. ఆధార్ కార్డు లేకుండా దర్శనం చేసుకున్నా లడ్డు ప్రసాదం ఇవ్వరని ప్రచారాలు జరుగుతున్నాయి. దర్శనం చేసుకున్నా సరే ఒక్కొక్కరికి రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వబడతాయని ప్రచారం జోరుగా సాగుతోంది. వాటిలో వాస్తవం లేదు. దర్శనం లేకుంటే ఆధార్ కార్డుతో 2 లడ్డూలు, దర్శనం టోకెన్ ఉంటే అదనంగా ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు అందిస్తాం. బయట ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌లలో లడ్డూలు కేటాయిస్తున్నాం. అక్కడ కూడా లడ్డూల కోటా పెంచాలని డిమాండు ఉంది. దానిని పరిశీలిస్తున్నాం’’ అని వివరించారు.
సరిగాలేని ఐటీ విభాగం పని
ఈ సందర్భంగా లడ్డూల వ్యవహారంలో ఐటీ విభాగం పనితీరుపై ఈఓ శ్యామలరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీ విభాగం పనితీరు ఏమాత్రం బాగోలేదని అన్నారు. ‘‘ఐటీ సిస్టంలో ఆధార్‌తో ఎవరికి లడ్డూలు అందిస్తున్నాం అనే వివరాలు తెలుసుకుంటున్నాం. కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా బ్లాక్ మార్కెట్‌లో లడ్డులను విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కొన్ని కౌంటర్లలో 186, మరో కౌంటర్లో 1100 లడ్డూలు ఇచ్చినట్లు గుర్తించాం. 600 వందల సార్లు లడ్డూలు ఎక్కువగా కేటాయించినట్లుగా గుర్తించాం. లడ్డూల అక్రమ విక్రయాలు అరికట్టడానికి చర్యలు చేపట్టాక దర్శనానికి పోయి వచ్చిన సామాన్య భక్తులకు కావాల్సిన లడ్డూలను అందిస్తున్నాం. ఎవరికైనా పది లడ్డూలలోపే కేటాయిస్తున్నాం వందల లడ్లు తీసుకోవడానికి అవకాశం లేదు’’ అని చెప్పారు.
పెరిగిన అన్నప్రసాద నాణ్యత
‘‘శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గత రెండున్నర నెలలుగా అనేక మంచి మార్పులు తీసుకొచ్చాం. భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటిపై దృష్టిసారిస్తున్నాం. వాటిలో అన్నప్రసాద నాణ్యత విషయంలో చర్యలు తీసుకున్నాం. అన్నప్రసాద నాణ్యతను పెంచడం జరిగింది. స్టేటెడ్ దర్శనం టొకెన్ల సంఖ్యను పెంచాం. గతంలో వారానికి లక్ష ఐదువేల స్లేటెడ్ దర్శనం టోకెన్లు అందించే వాళ్లం. ఇప్పుడు వాటి సంఖ్యను లక్ష అరవై వేలకు పెంచాం. బయట రాష్ట్రాల్లో జరిగిన పెళ్ళి వేడుకల్లో కూడా స్వామివారి లడ్డు ప్రసాదం పెట్టడం చూసి ఆశ్చర్యపోయాం’’ అని చెప్పాం.