TIRUMAL:A | తిరుమల: వైకుంఠ దర్శనాలపై కీలక నిర్ణయం
టిటిడి బోర్డు అత్యవసర సమావేశం మరో గంటలో ప్రారంభం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-10 11:08 GMT
తిరుపతిలో రెండు రోజుల కిందట జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు యాత్రికులు చనిపోయిన సంఘటన టీటీడీని ఉలిక్కిపడేలా చేసింది. సీఎం చంద్రబాబు స్వయంగా తిరుపతికి వచ్చి టీటీడీ, పోలీస్, రెవెన్యూ శాఖలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దుమ్ము దులిపారు. 24 గంటలు కూడా గడపకుండానే శుక్రవారం ( మరో గంటలో) టిటిడి పాలకమండలి తిరుమలలో అత్యవసరంగా సమావేశం అవుతోంది.
తిరుమలలో సమావేశమయ్యే టిటిడి మండలి ఏం చర్చించబోతోంది? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు.
తిరుమలలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలను కుదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
సాధారణంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వైకుంఠ ద్వారంలో వెళితే జన్మ సార్థకం అవుతుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఐదేళ్ల కిందటి వరకు ఏకాదశి గడియల్లో తిరుమల శ్రీవారి సన్నిధిలోని ద్వారాలు ఏడాదికి ఒకసారి మాత్రమే తెరిచి ద్వాదశ ఘడియలు ముగిసిన తర్వాత అంటే రెండో రోజు మూసివేసేవారు.
సామాన్య భక్తుల కోసం
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే కోరిక ఎక్కువ మందిలో ఉంటుంది. వీఐపీలు, వివిఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. సామాన్య భక్తులకు చాలా తక్కువ మందికి ఈ దర్శనం లభించేది. అలా కాకుండా సామాన్య భక్తుల మనోభావాలకు వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చారు.
2021 నుంచి తిరుమలలో కూడా వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు కొనసాగించడానికి వీలుగా నిర్ణయం తీసుకున్నారు.. ఆమేరకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వాహణలో మేటిగా ఉన్న టిటిడి తిరుపతిలో ప్రత్యేకంగా 9 కౌంటర్లు, తిరుమలలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి సామాన్య భక్తులు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి మార్గం ఏర్పాటు చేసింది.
2024 మధ్యలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో మొదటిసారి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు గతంలో మాదిరే కొనసాగించడానికి ఏర్పాటు చేశారు.. అయితే,
తొక్కిసలాట నేపథ్యంలో..
ఊహించని విధంగా.. తిరుపటి నగరంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంఘటన కలకలం రేపింది. దీనిపై.. సీఎం చంద్రబాబు గురువారం స్వయంగా రంగంలోకి దిగి సమీక్షించారు. తిరుపతిలో జరిగిన సంఘటన ప్రదేశాలను పరిశీలించారు.
"వాడెవడో చేశాడని అదే పద్ధతి కొనసాగించడం ఏంటి? సమీక్షించలేరా?" అని టిటిడి ఈవో శ్యామల రావు తో పాటు అధికారులు అందరికీ సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారు. జరిగిన దుర్ఘటనకు బాధ్యతారాహిత్యం, సమన్వయం లోపం ఉందంటూ, అందుకు బాధ్యులుగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సి వి ఎస్ ఓ శ్రీధర్ ను బదిలీ చేశారు. బైరాగి పట్టడం వద్ద జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ డిఎస్పి రమణ కుమార్, టిటిడి గోశాల డైరెక్టర్ నో సస్పెండ్ చేశారు.
"తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు ఆగమశాస్త్రం అనుమతిస్తుందా? దీనిపై పండితులు నిర్ణయించాలి" అని కూడా సీఎం చంద్రబాబు బంతిని టిటిడి కోర్టులో వదిలారు. "అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో వున్నా నేను మాత్రం సామాన్య భక్తుడుగానే వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటా" అని కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలను టిటిడి సమీక్షించింది. సీఎం చంద్రబాబు పరోక్షంగా 10 రోజుల దర్శనాలను రద్దు చేయాలని సంకేతం ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా,
తిరుమలలో నిర్ణీత సమయానికి శుక్రవారం ఎక్కువ జమున శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వారాలు తెరిచి, శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ సమయంలో కూడా వీఐపీలు, వివిఐపీలు, పదుల సంఖ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులతో పాటు ప్రోటోకాల్ దర్శనాలతో శ్రీవారి ఆలయ సన్నిధిలోని వైకుంఠ ద్వార ప్రవేశాలు కిటకిటలాడాయి.
అత్యవసర బోర్డు మీటింగ్ ఎందుకు?
తిరుమల శ్రీవారి సన్నిధిలో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడంపై సాక్షాత్తు సీఎం చంద్రబాబు టిటిడి అధికారులకు అక్షింతలు వేశారు. దీంతో ఈ వ్యవహారంపై కొద్దిసేపట్లో సమావేశం కానున్న టిటిడి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పది రోజుల దర్శనాలు రద్దు?
తిరుమలలో వచ్చే ఏడాది నుంచి ఏకాదశి కి పది రోజులపాటు దర్శనాలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం టిటిడి పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్షంలో సీఎం చంద్రబాబు పరోక్షంగా ఇచ్చిన సంకేతం నేపథ్యంలోనే టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీ కావడానికి దారితీసిందని భావిస్తున్నారు.
కేంద్రాల కుదింపుతో శ్రీకారం!
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కోసం తిరుపతిలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయానికి 1.20 టోకెన్లు జారీ చేశారు. అంటే పదవ తేదీ నుంచి 12వ తేదీ వరకు టోకెన్లు మంజూరు పూర్తయింది. ఇక 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టోకెన్లు చేయాల్సి ఉంది. అయితే తిరుపతిలోని ఎనిమిది కౌంటర్లు ఉంటే శుక్రవారం నుంచి వాటిలో ఐదు రద్దు చేశారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాస యాత్రికుల సమదాయం లో మాత్రమే టోకన్లు జారీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ వ్యవహారం లో టిటిడి పాలకమండలి వ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.