బాధ్యతలు స్వీకరించిన మంత్రులు.. 80 శాతం నిధులు ఖాళీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా మరో ఇద్దరు నేతలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రాన్ని వైసీపీ అన్ని దశల్లో బ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-06-26 14:25 GMT
మంత్రి బాల వీరాంజనేయ స్వామి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఔరా అనిపించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి శాఖ కూడా అధికారులను పరుగులు పెట్టిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు కూడా స్వయంగా ప్రజల చెంతకు వెళ్లి మరీ వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేడపండితుల ఆశీర్వచనం అందుకున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరంచారు. బాధ్యతలతో పాటు పలు కీలక అంశాలకు సంబంధించిన దస్త్రాలపై సంతకం కూడా చేశారు.

బాల వీరాంజనేయ స్వామి కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి తాను స్వీకరించిన ఈ శాఖల ద్వారా ప్రజలకు, పేదలకు మేలు జరిగేలా పని చేస్తానని చెప్పారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే ధ్యేయంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. బాధ్యతల నిర్వహణలో రాగద్వేషాలకు తావివ్వను అని మరోసారి పునరుద్ఘాటించారు. తన చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వనని, గురుకుల పాఠశాలల్లో రద్దయిన సీట్లను పునరుద్దరిస్తామని వెల్లడించారు.

వాలంటీర్లపై అన్నీ తప్పుడు ప్రచారాలే!

విద్యార్థులకు బకాయిలు ఉన్నప్పటికీ వారికి కూడా స్కాలర్‌షిప్‌లు విడుదల చేస్తామని వెల్లడించారు. ‘‘ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ.199 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ.5.69 కోట్లు బకాయిలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. బెస్ట్ ఎవైలబులు స్కూళ్లను గత ప్రభుత్వం రద్దు చేసి రూ.6.10కోట్లు బకాయిలు పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్థికశాఖ నుంచి రూ.21.81 కోట్లు ఉన్నాయి. అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో ఉన్న బకాయిల మొత్తం రూ.3,573.22 కోట్లు’’ అని ఆయన వివరించారు.




 

46శాతమే ఖర్చు: జనార్ధన్

బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. ‘‘2019-2019 మధ్య ఆర్‌ అండ్ బీ శాఖ బడ్జెట్‌లో రూ.14,970 వేల కోట్లు కేటాయించగా నాటికి రూ.12,064 కోట్లు ఖర్చు అయ్యాయి. అంటే 80శాతం నిధులు వినియోగించాం. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటూ వైసీపీ సర్కార్ 2019-2024 మధ్య ఆర్‌ అండ్ బీ శాఖకు రూ.19,428 కోట్లు కేటాయించింది. కానీ అందులో కేవలం రూ.9,014 కోట్లే ఖర్చు చేసింది. అంటే కేవలం 46శాతం నిధులనే వినియోగించింది. గత ప్రభుత్వం తమ హయాంలో వచ్చిన రూ.2,261 కోట్ల బిల్లులను చెల్లించలేదు. దాని వల్ల కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఏది ఏమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తామని చెప్పార బీసీ జనార్థన్ రెడ్డి.

Tags:    

Similar News