నటి కాదంబరి కేసులో కీలక ట్విస్ట్.. పోలీసులతో పాటు వైసీపీ నేతపై యాక్షన్

ముంబై నటి కాదంబరి జిత్వానీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడం మొదలైంది.

Update: 2024-09-14 10:02 GMT

ముంబై నటి కాదంబరి జిత్వానీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడం మొదలైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. తాజాగా ఒక వైసీపీ నేతపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన ఐపీఎస్‌లు పీ సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరిపై అతి తక్కువ రోజుల్లో యాక్షన్ స్టార్ట్ కావొచ్చని సమాచారం. తాజాగా ఈ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. న్యాయ సలహా తీసుకునే కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

ఇబ్రహీంపట్నం చేరుకున్న జిత్వానీ కేసు

కాదంబరి జిత్వానీ కేసు మరోసారి ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశారని జిత్వానీ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్లు 192, 211, 218,220, 35, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి కింద వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగానే జిత్వానీ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించారు.

అసలేంటి వివాదం

ముంబయి హీరోయిన్‌ కాదంబరి జత్వాని ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌కు ప్రేమాయణమో, అక్రమ సంబంధమో, మరే రాచకార్యమో గానీ గట్టి సంబంధం ఉంది. కొంతకాలం బాగానే నడిచినా అది బెడిసి కొట్టి ఇద్దరు విడిపోయారు. వారి మధ్య ఉన్న గొడవలు ముదిరిపోయి జత్వాని ముంబయిలో సజ్జన్‌పై రేప్‌ కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్‌ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్‌ను అప్పట్లో ఆశ్రయించారు. ఎక్కడో ముంబయిలో జరిగినదానికి తానేం చేయగలనని ఆయన సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక సంబంధాలు ఆ పని చేయనివ్వలేదు. మిత్రుణ్ణి ఎలాగైనా బయటపడేయాలని తన వందిమాగధులకు పురమాయించేశాడు.

జత్వానీకి వైఎస్సార్‌సీపీతో దూరపు సంబంధం ఉన్న కుక్కల విద్యా సాగర్‌తోనూ లింకు ఉంది. సజ్జన్‌ జిందాల్, జత్వానీ, కుక్కల విద్యా సాగర్‌.. ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమే ఇప్పుడు బయటకు వచ్చిన ఇన్ని ట్విస్ట్ లకు కారణమైంది. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌కు ఉన్న భూమిని జత్వానీ కొనుగోలు చేసిందట. ఎక్కడో ముంబయిలో ఉండే సినీ నటి తనకు ఏమాత్రం పరిచయం లేని, అసలు తనకు తెలియని విజయవాడలో భూమి కొనడం ఏమిటి? అంటే విద్యా సాగర్‌తోనూ ఏదో బలమైన బంధమే ఉండి ఉండాలి. దానికి సంబంధించిన లావాదేవీపైనే కుక్కల విద్యా సాగర్‌ ఆమెపై కేసు పెట్టాడు. సజ్జన్‌ కోసం తెలివిగా విద్యా సాగర్‌తో ఈ కేసు పెట్టించారనేది ప్రస్తుతం జగన్ పై ఆరోపణ. విద్యా సాగర్‌కి, జత్వానీకి మధ్య కూడా గాఢమైన బంధమే ఉందని చెబుతున్నారు. దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకుని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబయిలో సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారనటంలో సందేహం లేదని చెప్పొచ్చు. ఇందులో అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీది కీలకపాత్ర ఉందని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంట్‌ చేయకతప్పలేదు. మధ్యలో సెటిల్మెంట్‌ ఎంతవరకు వచ్చిందో ఫాలోఅప్‌ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి చేశారనేది వాస్తవమని పలువురు అంటున్నారు. పూర్తిగా అప్పటి సీఎం జగన్‌ కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా నడిచిందని ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News