Tirupati tragedy | వైకుంఠ దర్శనం : ఆరుగురి మృతి.. 44 మందికి గాయాలు
తిరుపతిలో మరణించిన వారిలో నలుగురు విశాఖ వాసులు, ఇద్దరు తమిళనాడు మహిళలు ఉన్నారు. మరో 44 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.;
By : The Federal
Update: 2025-01-09 03:49 GMT
తిరుపతి ఆధ్మాత్మక నగరంలో ఘోరం జరిగింది. తిరుమల శ్రీవారి క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా యాత్రికులు వచ్చారు. వారికి టోకెన్లు జారీ చేయడానికి తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరో 44 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో తిరుపతి నగరం ఉలిక్కి పడింది. మొదటిసారి ఇంతటి విషాధ ఘటన జరిగింది. మరణించిన వారిలో
1. లావణ్యస్వాతి, తాటిచెట్లపాలెం, విశాఖపట్టణం
2.శాంతి, కంచరపాలెం, విశాఖపట్టణం
3.బాబు నాయుడు నరసరావుపేట, రామచంద్రపురం (వైజాగ్ )
4.రజిని మద్దిలపాలెం, వైజాగ్
5. నిర్మల , తమళనాడులోని పొల్లాచి
6. మల్లిక, సెలం, మెట్టూరు, తమిళనాడుగా గుర్తించారు.
వారిలో నిర్మల, రజని మృతదేహాలు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో ఉన్నాయి. మిగతా నలుగురి మృతదేహాలు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉన్నాయి.
టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిలో రుయా ఆస్పత్రిలో 31 మంది, స్విమ్స్ ఆస్పత్రికి తరలించిన వారిలోొ 13 మందికి చికిత్స అందిస్తున్నారు.
ఊపిరి ఆడకపోవడం వల్లే...
దర్శనం టికెట్ల కోసం క్యూ లైన్ లోకి వెళ్ళిన భక్తులు ఊపిరాడక నలిగిపోయారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తిరుపతిలోని కౌంటర్ల వద్ద భారీగా చేరుకున్న భక్తజనం మధ్య బుధవారం తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో విష్ణునివాసం, బైరాగిపట్టెడ, భూదేవి కాంప్లెక్స్, బుధవారం రాత్రి తోపులాటలో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే ఎక్కువ మంది గాయపడడం, మరణించడానికి దారితీసింది.
తిరుమలలో వైకుంఠ దర్శనం కోసం ఈనెల 10 ,11, 12 తేదీల మూడు రోజులకు గాను సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ తిరుపతిలో 8 ప్రాంతాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేసింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి టోకెన్లు తీసుకునేందుకు తిరుపతిలో గురువారం ఉదయం ఐదు గంటలకు ఈ టోకెన్లు జారీ చేస్తారు అని తెలిసి కూడా ముందు రోజైన అంటే బుధవారం మధ్యాహ్నం నుంచి భారీగా కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. వారిని క్యూలోకి ప్రవేశించకుండా బయట రోడ్డుపైనే నియంత్రించిన పోలీసులు ఆ తరువాత రాత్రి 9 గంటల ప్రాంతంలో కింద పడిన ఓ మహిళను పైకి లేపడానికి చేసిన యత్నంలో గేటు తెరుచుకుకోవడంతో ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో దుర్ఘటన తీవ్రత ఎక్కువైంది.
1.తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు గాయపడ్డారు.
2. బైరాగి పట్టెడ ప్రాంతంలో రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇదేవిధంగా ఒక మహిళను వెలుపలికి పంపే క్రమంలో గేటు తోసుకుంటూ లోనికి వెళ్ళిన భక్తులు మధ్య తొక్కేసినట్టు జరిగి దాదాపు తొమ్మిది మంది ఊపిరాడక భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
3.అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కొంతమంది భక్తులు తోపులాటకు గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.
ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఇంకా ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు.
సంఘటన జరిగిన కొన్ని గంటల తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అంతకుముందు ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి తిరుపతి రుయా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచన చేశారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని కూడా వారు పమార్శించారు. స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్వీ. కుమార్ తో మాట్లాడారు. టీటీడీా పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాశ్ రెడ్డి వారి వెంట ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.
మిన్నంటిన హాహాకారాలు
తిరుపతి నగరంలో బుధవారం రాత్రి ఉన్నట్టుండి గతంలో ఎన్నడూ లేని విధంగా తోపులాట జరగడంతో హాహాకారాలు మిన్నంటాయి. సమీక్షలతో కాలం సాగదీసిన అధికారులు తీరా ఆ సమయం వచ్చే సరికి జనాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందారు. ఈ తోపులాటలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించాల్సిన అంబులెన్సులు సంఘటన స్థలంలో డ్రైవర్లు లేక ఖాళీగా ఉండటం కనిపించింది. డ్రైవర్లు ఎక్కడికెళ్లారో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇదే సందర్భంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి వ్యవహారంపై భక్తులు ఆగ్రహంతో మండిపడ్డారు. భక్తుల రద్దీ పరిస్థితి, అందుకు ముందస్తుగా ఏర్పాటు చేయాల్సిన భద్రత పరిస్థితులు, సౌకర్యాల కల్పన లో అంచనా వేయడంలో టిటిడి అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.
వైద్య సేవల్లో ఆలస్యం
తిరుపతిలోని అనేక కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి సీపీఆర్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, రుయా ఆస్పత్రికి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తరలించారు. అయితే అది డ్యూటీ మారే సమమం కావడం, డాక్టర్లు విధులకు రావడంలో జరిగిన జాప్యం కూడా కొంత నష్టం కలిగించినట్టు రుయా ఆసపత్రి వద్ద కనిపించింది.
నేడు తిరుపతికి సీఎం
గతంలో ఎన్నడు లేని విధంగా తిరుపతిలో శ్రీవారు భక్తులు తొక్కిసలాట జరిగి ఆరు మంది మృతి చెందడంతో సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనకు ఏర్పాట్లపై అప్పటికప్పుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తుల సంఖ్యకు తగిన విధంగా ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ టిటిడి అధికారులపై మండిపడ్డారు. భద్రతా ఏర్పాట్లు కూడా తగిన స్థాయిలో చేయకపోవడంపై ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడుతో కలిసి రాష్ట్ర డిజిపి, హోంమంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఉన్నతాధికారులతో అప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి తక్షణమే తిరుపతిలో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సంఘటనా స్థలంలో అధికారులు..
సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తదితర అధికారులు తోపులాటలో తొక్కేసినట్లు జరిగిన ప్రాంతాలైన విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం రామానాయుడు స్కూల్, సత్యనారాయణపురం సర్కిల్ తదితర ప్రాంతాలకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేలా తిరుపతి రుయా స్విమ్స్, ఆసుపత్రిల వద్దకు చేరుకొని ఏర్పాట్లు చేపట్టారు. రాత్రి 11:00 కల్లా అన్ని కౌంటర్లలో వద్ద భద్రతా పరిస్థితి అదుపులోకి వచ్చింది. యధావిధిగా శ్రీవారి భక్తులకు టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. స్వామి వారి భక్తుల రద్దీ అధికం కావడంతోనే అనుకున్న సమయం కంటే ముందుగా టోకెన్ల జారీని చేపట్టాల్సి వచ్చిందని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇంటెలిజెన్సీ వైఫల్యం : టీటీడీ చైర్మన్
ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. భక్తుల కుటుంబాలకు అండగా ఉంటామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి ఆయన తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లి, బాధితులను పరామర్శించారు. ఇందులో ఇంటిలిజెన్సీ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. దీనికి ముందుగానే కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై హెచ్చరిస్తూనే వచ్చామని గుర్తు చేశారు. ఏర్పాట్లపై కూడా శ్రీవారి ఆలయంలో ఉండగా ఎస్పీ సుబ్బరాయుడు పదేపదే జాగ్రత్త పడమని చెప్పానన్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్యలు తప్పవేమో..
తిరుపతిలోని భక్తుల తోపులాట మృతుల సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం అన్నారు. ఏర్పాట్లు, ముందుజాగ్రత్తల్లో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.