ఇంతకీ.. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు..!?

పట్టు కోసం రెడ్ల మధ్య ద్విముఖ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. నెల్లూరు కేంద్రంగా ఏర్పడిన రాజకీయ తుఫాన్ జిల్లాకు వ్యాపించింది.

Update: 2024-04-02 15:22 GMT
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: పెద్ద రెడ్ల మధ్య పోటీ సింహపురిలో రసవత్తరంగా మారింది. ఎవరికి ఎవరూ తీసిపోని విధంగా పట్టు కోసం కుస్తీ పడుతున్నారు. పార్టీలు మారాయి. మనుషులు విడిపోయారు. నియోజకవర్గాలు కూడా వేరు అయ్యాయి. సంవత్సరంలో పరిస్థితులు తిరగబడ్డాయి. ఇది కాస్తా... సింహపురి రాజకీయం.. వేసవి ఎండలకు ధీటుగా మండుతోంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ ఎపిసోడ్‌కు ప్రధానంగా రెండే కారణాలు. ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, రెండోది రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మిగిలిన చిచ్చు. ఇది కాస్త నెల్లూరు రాజకీయాన్ని తలకిందులు చేసిందనేది ఈ ప్రాంతంలో వినిపించే మాటలు. ఈ వ్యవహారాల నేపథ్యంలో..

ఆధిపత్యం కోసం అధికార వైఎస్ఆర్‌సిపి ఆరాటపడుతోంది. పట్టు సాధించాలని టిడిపి పాకులాడుతోంది. అనడం కంటే పార్టీల్లోని నాయకులకు వ్యక్తిగత ప్రతిష్టగా మారింది. ఎందుకంటే.. అధికార పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు తిరుగుబాటు చేయడం ఒకటైతే.. వారందరూ టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో..

అప్పుడు పదికి పది...

2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు ఏమాత్రం తీసుపోని రీతిలో నెల్లూరు జిల్లాలో కూడా పదికి పది స్థానాలు వైఎస్ఆర్‌సీపీ దక్కించుకుంది. అధికార వైఎస్ఆర్సీపీకి తిరుగు పోట్లు తగిలిన నేపథ్యంలో.. 2024 ఎన్నికల్లో.. నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల మినహా మిగతా ఏడు శాసనసభ స్థానాలు పార్లమెంటు స్థానంలో రెడ్డి సామాజిక వర్గమే ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈసారి ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఎలాగంటే...

మలుపుతిప్పిన ఘటన

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణపై ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్‌సీపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో.. పంచాయతీ విషయమై అప్పటి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో రగిలిన రగడ మరో మలుపు తీసుకుంది. వారంతా.. టిడిపిలోకి జంప్ అయ్యారు. అక్కడే సీన్ మారింది.


నెల్లూరు కేంద్రంగా రాజకీయ తుఫాన్

నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దించారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని బరిలో నిలపడంతో రాజకీయ తుఫాన్‌కు తెరలేసింది. ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కడంతో పాటు ఆ ప్రభావం జిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నెలకు ఒక దేశంలో ఉంటారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన.. నెల్లూరు జిల్లాకు ఇన్నేళ్ల పదవీకాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నలతో విజయసాయిరెడ్డిని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఇది మర్చిపో ఒకటే ఇలాంటి ఆరోపణలు మాటల తూటాలు పేలుతున్నాయి. కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీకి దిగారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ప్రశాంతంగానే ఉంది.


బస్తీమే సవాల్..

నెల్లూరు జిల్లా రాజకీయ చిత్రపటం రాజకీయాల్లో ఆనం కుటుంబం, మేకపాటి కుటుంబం కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి నేపథ్యం కలిగిన ఇద్దరు ఆత్మకూరులో తలపడుతున్నారు. "ఎవరొచ్చినా పర్వాలేదు. బలమైన వ్యక్తి నా పైకి పోటీకి రావాలి" అంటూ అనేకసార్లు ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి సవాల్ విసిరారు. ప్రశాంతమైన మాటలతో నిండుకుండలా ఉండే సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి.. టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో రామారాయం రెడ్డి వైఎస్ఆర్‌సీపీ వీడారు. ఇక్కడ పరిస్థితి నువ్వా నేనా అన్నట్లు ఉంది.


తగ్గేదెలా...! అన్నా.. ప్లీజ్

ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ వ్యవహారంలోనే బయటికి వచ్చిన పోతం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఘాటీగా మాట్లాడడంలో, నిగ్గదీయడంలో ఏమాత్రం తగ్గని వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈయనపై నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బదిలీపై రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. "అమ్మ... అన్నో... ఇదే నాకు కూడా ఎన్నిక. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను" అనే మాటల సెంటిమెంట్‌తో ఆదాల ప్రభాకర్ రెడ్డి జనంలో కలుస్తున్నారు. జనం కష్టం తన కష్టంగా భావించి వెళ్లే.. శ్రీధర్ రెడ్డి పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


బండారం బట్టబయలు..

సర్వేపల్లిలో ఈసారి ఎలాగైనా గెలవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు కూడా రంగంలో రెడ్డి గారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి అక్రమాలను బయటపెడుతూ, ఆధారాలతో దెబ్బ కొట్టి పైచేయి సాధించాలని సాగుతున్నారు. "కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అయితే.. అనవసరపు మాటలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారని" వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు ఎవరికీ తీసుకొని రీతిలో పరస్పరం ఆరోపణలు, విమర్శలతో టికెట్ లేని సినిమా చూపిస్తున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో చురుగ్గా ఉన్నారు.

కోటలో యుద్ధం...

వెంకటగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ లక్ష్మి సాయి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. అదే స్థాయిలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. మెజారిటీ నాయకుల నుంచి వర్గ పోరు మాత్రం తక్కువ లేదు. వెంకటగిరి కోటలో ఎవరు పాగా వేస్తారనేది ఆసక్తికరంగా.


ఎటు కాకుండా పోయారు

ఉదయగిరి నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది. కూడా ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో వైఎస్ఆర్సిపి నుంచి టిడిపిలో చేరారు. ఈయనకు కాకుండా టిడిపి అభ్యర్థిత్వం ఎన్నారై కాకర్ల సురేష్‌కు దక్కింది. రాజగోపాల్ రెడ్డి.. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో దగ్గరైన కాకర్ల సురేష్‌ను ఆదరిస్తారా? మేకపాటి వంశానికి ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందా అనేది చూడాలి.

శాంతం ... ప్రశాంతం..

గూడూరు ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పాశం సునీల్ కుమార్.. టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఆయన అభివృద్ధిత్వానికి దిక్సూచిగా నిలిచింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద రావు స్థానంలో వైఎస్ఆర్‌సీపీ.. మురళీధర్‌కు అవకాశం కల్పించింది. స్థానికేతరుడు అనే సమస్య ఆయనను వెంటాడుతున్నట్లు చెబుతున్నారు. మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం సూళ్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి టిడిపి అభ్యర్థిగా అవకాశం లభించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి.. టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు వద్ద మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. బీ ఫారాలు అభ్యర్థుల చేతికి దక్కే వరకు ఎవరు పోటీలో ఉంటారనేది ప్రశ్నార్థకమే. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్యతో పాటు టీడీపీ అభ్యర్థి విజయశ్రీ తండ్రి సీనియర్ నాయకుడు కావడం మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల దీటైన పోటీనే ఉందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మొత్తం మారడానికి ఒకే కారణం ఉంది. అందుకు ఇద్దరు వ్యక్తులే అని కూడా అంటున్నారు.


సునామీ సృష్టించిన సీటు..!

సాధారణంగా తుఫాను బంగాళాఖాతం ఇతర ప్రదేశాల్లో కేంద్రీకృతం అవుతుంది. సింహపురిలో 2024 ఎన్నికల రాజకీయ తుఫాను నెల్లూరు నగరంలో కేంద్రీకృతమైంది. ఇది జిల్లాను ముంచెత్తింది. వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి మధ్య రాజకీయంగా వైరుధ్యం ఏర్పడినట్లు సమాచారం. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసేందుకు బదిలీ జరిగింది. అయితే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌గా ఉన్న మహమ్మద్ ఖలీల్ అహ్మద్‌కు వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు నగర అసెంబ్లీ స్థానం టికెట్ ఇవ్వడమే చిచ్చుకు కారణమని తెలిసింది.

తన పట్టు నెగ్గించుకోలేకపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరుగుబాటు చేసి టిడిపిలో చేరారు. దీంతో ఆయనకు చెక్ పెట్టడానికే విజయసాయిరెడ్డిని సొంత జిల్లా నెల్లూరుకు పంపారని రాజకీయ వర్గాల్లో జరిగుతున్న చర్చ. వాస్తవం కూడా ..! దీంతో సింహపురి రాజకీయం మొత్తం ప్రస్తుతం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటానికి నాంది పలికిందని, ఎవరికి వారు తమ పట్టు సాధించడానికి తీవ్రంగా పోరాట రంగంలో సాగుతున్నట్లు కనిపిస్తుంది.

గమనిస్తున్న ఓటర్లు..

వీరి ఆరాటాన్ని అర్థం చేసుకునే ప్రజలు, ఎవరిని కనికరించి గట్టెక్కిస్తారు అనేది ఓటర్ల పై ఆధారపడి ఉంటుంది. ముమ్మరంగా సాగుతున్న ప్రచార హోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి బండారాన్ని మరొకరు బయట పెడుతున్నారు. వీటన్నిటిని మదింపు చేసుకునే ఓటర్లు మళ్లీ పదికి పది సీట్లు ఇస్తారా? చావు దెబ్బ కొడతారా? అనేది తెలియాలంటే పోలింగ్ వరకు ఆగక తప్పదు! ఆలోపు నెల్లూరు జిల్లాలో ఎలాంటి విడ్డూరమైన పరిస్థితులు కనిపిస్తాయి అనేది చూస్తూ ఉండాలి.

Tags:    

Similar News