ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిపై కేసులు తెరపైకి వచ్చాయి.;
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో సోమవారం విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. షేర్లకు సంబంధించిన కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్(కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్(కేఎస్‌జ్)లకు సంబందించి రూ. 3,600 కోట్ల విలువైన షేర్లను కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు) నుంచి బలవంతంగా లాగేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు విజయసాయిరెడ్డి మీద కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా మరో కేసును నమోదు చేసిన ఈడీ, అందుకు సంబంధించిన దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ గతంలోనే నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించింది. అయితే అదే సమయంలో పార్లమెంట్ సమావేశాల కారణంగా విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ విజయసారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.