తెరపైకి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు.. అమరావతికి అనుసంధానం

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వంలో దీని ప్రస్తావనే లేకుండా పోయింది.

Update: 2024-10-22 12:13 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తిరిగి తెరపైకి వచ్చింది. ఇప్పటికే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీగా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారాయణ ఢిల్లీ పెద్దలతో దీనిపై చర్చించారు. మంగళవారం కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఈ ప్రాజెక్టు గురించి చర్చించారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రో రైలును అమరావతికి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు కేంద్ర మంత్రి ఖట్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఖట్టర్‌ త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2014–19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కింద పలు కార్యక్రమాలు చేపట్టారు. టెండర్ల దశ వరకు వెళ్లింది. భూ సేకరణకు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను ఉపసంహరించింది.


Tags:    

Similar News