విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధి పెరగనుందా?
టీడీపీ హయాంలో విజయవాడ సీపీగా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తే వైఎస్‌ఆర్‌సీపీ దానిని ఐజీ స్థాయికి కుదించింది. వైజాగ్‌లో అదనపు డీజీ స్థాయికి పెంచింది.
Byline : The Federal
Update: 2024-06-11 07:01 GMT
విజయవాడ పోలీసు కమిషనరేట్ అత్యంత కీలకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దీనికి పెద్ద పీట వేశారు. అందుకే వ్యాస్, దినేష్‌రెడ్డి, డీటీ నాయక్, అరవింద్‌రావు, సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, టీ కృష్ణప్రసాద్, సీవీ ఆనంద్ వంటి హేమా హేమీలైన సీనియర్ ఐపీఎస్ అధికారులను సీపీలగా నియమించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా దీని విలువను ఏమాత్రం తగ్గ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో విజయవాడ ఒకటి కావడం, అప్పటికే వాణిజ్య కేంద్రంగా పేరు ఉండటం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది పెద్ద సవాలుగానే ఉండేది. ఈ నేపథ్యంలో పేరున్న అధికారులను సీపీలుగా నియమించారు.
మరో వైపు రాష్ట్ర విభజన అనంతరం దీని స్థాయిని పెంచారు. రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండటం శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నాటి టీడీపీ ప్రభుత్వం స్థాయిని పెంచి అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి వరకు డీఐజీ స్థాయి అధికారులు విజయవాడకు సీపీలుగా ఉండేవారు. 2014 తర్వాత దానిని మార్పు చేస్తూ అదనపు డీజీ స్థాయి అధికారులను సీపీలుగా నియమించాలని నిర్ణయించారు. ఏబీ వెంకటేశ్వరరావు, గౌతం సవాంగ్, సిహెచ్ ద్వారకాతిరుమలరావును విజయవాడ సీపీలుగా నియమించింది.
తర్వాత 2019లో ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ వ్యవహరించిన తీరుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. అప్పటి వరకు ఉన్న సీపీ స్థాయిని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అదనపు డీజీ స్థాయి నుంచి ఐజీ స్థాయికి కుదించింది. దీంతో ఐజీ స్థాయి అధికారులను విజయవాడ సీపీలుగా నియమించింది. తొలుత ఐజీ హోదా కలిగిన బీ శ్రీనివాసులును సీపీగా నియమించిన జగన్ ప్రభుత్వం ఆయన పదవీ విరమణ తర్వాత అదే ర్యాంకు కలిగిన కాంతిరాణా టాటాను సీపీగా నియమించింది. విశాఖపట్నం పోలీసు కమిషనర్ స్థాయిని ఐజీ స్థాయి నుంచి అదనపు డీజీ స్థాయికి పెంచింది. అయితే ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కాంతిరాణా టాటాను అక్కడ నుంచి బదిలీ చేసి పిహెచ్‌డి రామకృష్ణను విజయవాడ సీపీగా నియమించింది. ప్రస్తుతం ఆయనే సీపీగా కొనసాగుతున్నారు.
2022లో చేపట్టిన జిల్లాల పునర్విభజన విజయవాడ పోలీసు కమిషనరేట్ కాస్తా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్‌గా మారిపోయింది. పరిధి కూడా మారి పోయింది. అప్పటి వరకు పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లు ఉండేవి. గన్నవరం, ఆత్కూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిమొక్కల తూర్పు జోన్ పరిధిలో ఉండేవి. పెనమలూరు, కంకిపాడు సెంట్రల్ జోన్‌లో ఉండేవి. జిల్లాల విభజన తర్వాత అవి కృష్ణా ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో గతంలో సీపీ పరిధిలో ఉండే గన్నవరం విమానాశ్రయం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లి పోయింది. విమానాశ్రయం నుంచి వీఐపీలు విజయవాడ రావడం, విఐపీల భద్రత పర్యవేక్షణకు బాంబు స్క్వాడ్ బృందాలను గన్నవరంకు దాదాపు 60 కిమీ దూరం ఉన్న మచిలీపట్నం నుంచి పంపాల్సి రావడం వంటి సమస్యలు తరచు నెలకొంటున్నాయి.
తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల్లో ఓడిపోవడం, టీడీపీ అధికారంలోకి రావడం, రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీల సెక్యురిటీ సమస్యల దృష్ట్యా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిని పెంచడం, అదనపు డీజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో అదే ర్యాంకు కలిగిన అధికారిని సీపీగా నియమించేందుకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.