Best Panchayat Award | ఢిల్లీ ఆహ్వానంతో కదిలిన పల్లె ప్రతినిధులు
ఆ పల్లెకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. పౌరసన్మానం అందుకున్న స్థానిక ప్రతినిధులు, అధికారులు ఢిల్లీకి బయలుదేరారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-10 07:17 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ అవార్డు ఆ పంచాయతీకి పండుగ తీసుకువచ్చింది. ఆ పల్లెలో అధికారులు మురిసిపోయారు. జనం సంబరపడిపోతున్నారు. వారందరికీ ఘనంగా పౌర సన్మానం ఘనంగా జరిగింది.
2020-23 ఆర్థిక సంవత్సరంలో బొమ్మసముద్రం పంచాయతీలో ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీనికి ప్రధానంగా, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపరచడంతో పాటు, మురుగునీటి కాలువల్లో నిలువ లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో దోమలు లేకపోవడం వంటి కారణంతో జ్వరాలు వ్యాపించకుండా పంచాయితీ, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ఢిల్లీ తలుపు తట్టిన ఆ పల్లెలో పండుగ వాతావరణం ఏర్పడింది. పంచాయతీ, వైద్యశాఖ, అంగన్వాడి, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఎవరిని పలకరించిన వారి మాటల్లో ఆనందం తాండవిస్తోంది. అందుకు కారణం ఒకటే, ఢిల్లీకి వేలమైళ్ల దూరంలో ఉన్న మా పల్లెను గుర్తించారు. ఉత్తమ పంచాయతీ అవార్డు ఇచ్చారనేది వారి ఆనందానికి కారణమైంది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా డాక్టర్ మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గం ఐరాల మండలం బొమ్మసముద్రం ఎస్సీ రిజర్వుడు పంచాయతీకి రఘు సర్పంచ్.
కేంద్ర ప్రభుత్వం ఏటా దేశంలో ఉత్తమ పంచాయతీలను గుర్తించడంతోపాటు వారికి రాష్ట్రపతి ద్వారా పౌర సన్మానంతో అవార్డు అందిస్తారు. ఆ పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయలు నజరానాగా ఇవ్వడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం పంచాయతీ ఆరోగ్య విభాగంలో ఉత్తమ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి విధితమే. ఈ సమాచారం అందుకున్న పంచాయతీ, మండల అధికారులకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందాయి.
ప్రతినిధులకు పౌర సన్మానం
ఎక్కడో మారుమూల ఉన్న గ్రామ పంచాయతీకి ఆరోగ్య విభాగంలో కేంద్రం ఉత్తమ అవార్డు ప్రకటించింది. బొమ్మసముద్రం పంచాయతీ సచివాలయ కార్యదర్శి మౌనిక ఇందులో ఐరాల వైద్యాధికారులు డాక్టర్ స్వాతి సింధూర, డాక్టర్ రాజేశ్వరి, అంగన్‌వాడీ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ప్రధానపాత్ర పోషించారు. వారందరినీ సమన్వయం చేయడంలోనే కాకుండా, ప్రజాప్రతినిధిగా సర్పంచ్ వై. రఘు కీలకపాత్ర పోషించారు. వారందరి సమన్వయం కారణంగా బొమ్మసముద్రం పంచాయతీకి ఉత్తమ అవార్డు దక్కేలా చేసింది. దీంతో
బొమ్మసముద్రంలో అధికారులను ఘనంగా సత్కరించారు. కార్యాలయం ముందు సోమవారం సాయంత్ర జరిగిన కార్యక్రమంలో అవార్డు రావడానికి కారణమైన మండల, పంచాయతీ అధికారులను శాలువలతో సత్కరించి, గ్రామంలో పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకరరావు సత్కరించి, మాట్లాడారు.
"జాతీయ స్థాయిలో ఉత్తమ ఆరోగ్య పంచాయతీ అవార్డు దక్కడం జిల్లాకే గర్వకారణం. క్షేత్రస్థాయి యువ అధికారుల పనితీరు వల్ల జిల్లా ప్రతిష్ఠ మరింత ఇనుమడించింది" అని డీపీఓ సుధాకరరావు సిబ్బందిని అభినందించారు.
"ఈ పంచాయతీ అధికారులను మిగతా సిబ్బంది స్ఫౌర్తిగా తీసుకోవాలి" అని సూచించారు. ఉత్తమ పంచాయతీ మరింత అభివృద్దికి మరింత సహకారం అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం డీఎల్పిఓ (Divisional Panchayat Officer - DLPO) పార్వతి, ఓపిఆర్డి (Eoprd) కుసుమకుమారి, సర్పంచ్ వై. రఘు,ఎంపీడీఓ ధనలక్ష్మి,పంచాయతీ సెక్రటరీ మౌనిక, ఐరాల పీహెచ్సి అధికారి డాక్టర్ స్వాతిసింధూర, డాక్టర్ రాజేశ్వరి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రీన్ అంబాసిడర్లు, ఎంపీటీసీ విజయ్ కుమారి పాల్గొన్నారు.
ఢిల్లీకి పయనం
ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకోవడానికి సర్పంచ్ రఘు, పంచాయతీ, జిల్లా అధికారులు మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీఎంతో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ వెళ్లలేకపోయారని తెలిసింది. బుధవారం ఉదయం ఢిల్లిలో జరిగే కార్యక్రమంలో బొమ్మసముద్రం సర్పంచ్ రఘు రాష్టపతి ద్రౌపదీముర్ము నుంచి అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డు రావడంలో కీలకపాత్ర పోషించిన వారిలో వైద్య శాఖ నుంచి డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రతినిధులు ఎవరూ లేరు.