కడప ఎన్నికల్లో వివేకా హత్యే ప్రచారాస్త్రం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా అందరినీ కడపవైపు వేలెత్తి చూపిస్తోంది. ఎందుకు అక్కడి ప్రచారం అంత ప్రత్యేకమైనది.
కడప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రచారాస్త్రంగా మారింది. ఈ హత్య అధికారంలో ఉన్నవారే చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప పార్లమెంట్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం సంకేతాలు ఇచ్చారు. ఇక షర్మిల రంగంలోకి దిగితే పాలకుల తీరును ఏకిపారేసే అవకాశం వుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన మంత్రితో పోరాడి సాధించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె పలు మార్లు చెప్పారు.
ఇవి ప్రభుత్వ తప్పులు కావా?
షర్మిల చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందే వాదనను ఆమె వినిపిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలిసే హత్య జరిగిందని, ఇందులో అవినాష్ ప్రధాన పాత్రధారి అని ఆమె పలు మార్లు చెప్పారు. సీబీఐ వారు కేసు నమోదు చేసి విచారణకు పిలిపించినా అరెస్ట్ కాకుండా వున్నాడంటే దాని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని షర్మిల చెబుతున్నారు. తన తండ్రి చావుకు అవినాష్ రుడ్డి ప్రధాన కారణమని, ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేదని వివేకా కుమార్తె సునీత పలు మార్లు నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న మా అన్నకు కూడా విషయం తెలుసునని, అయినా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బంధువులే హత్యకు కారకులైతే ఎవరికి చెప్పుకోవాలని ఆమె వాపోయారు.
టీడీపీ కూడా వివేకా హత్యను ప్రచారాస్త్రంగా వాడుకోనుంది...
తెలుగుదేశం పార్టీ కూడా వివేకా హత్యను ప్రచారాస్త్రంగా వాడుకోనుంది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా వివేకా హత్యను ఇంట్లో వారే చేయించారని, అందుకు ఆధారాలు ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అప్రువర్స్ గా మారిన వారు కూడా ఇదే చెబుతున్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా టీడీపీ ప్రకటించలేదు. జి వీరశివారెడ్డిని ప్రకటించే అవకాశం వుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన కాకుంటే మరో వ్యక్తి శ్రీనివాసరెడ్డి కూడా రేస్ లో ఉన్నట్లు సమాచారం.
అప్రువర్స్ ఏమి చెబుతున్నారు..
వివేకా హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ దస్తగిరి ప్రధాన నిందితులు. దస్తగిరి మొదటి నిందితుడు. దస్తగిరి అప్రువర్ గా మారి జరిగిన విషయాన్ని సీబీఐ వారికి వివరించారు. దీంతో విషయం బయటకు వచ్చింది. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో నరికాడు. కింద పడిపోగానే దస్తగిరి చేతిపై నరికాడు. ఈ విషయాన్ని సీబిఐ ముందు అంగీకరించారు. ఇంటిబయట బాగా మద్య సేవించి ఇంట్లోకి పోయి బెంగుళూరు గొడవ తీసుకొచ్చి ఆపై హత్య చేశారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు చేయించారని దస్తగిరి సీబిఐకి చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. నాకు ఐదు కోట్లు ఇస్తామని చెప్పి అడ్వాన్స్ గా కోటి ఇచ్చారు. సీబీఐ వారు ఖర్చవగా మిగిలిన డబ్బును నా నుంచి స్వాధీనం చేసుకున్నారని దస్తగిరి వివరించడం కూడా సంచనంగా మారింది. 2019 మార్చి 14 తెల్లవారు ఝామున హత్య జరిగింది. హత్య జరిగిన రోజు వివేకా హైదరాబాద్ పోవాల్సి ఉంది. అయితే ఎర్రగంగిరెడ్డి పోకుండా ఏవో చెప్పి ఆపారు. జమ్మల మడుగులో ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చే సరికి వాచ్ మెన్ రంగన్న మాత్రమే ఇంటివద్ద ఉన్నారు. రెగ్యులర్ గా ఉండే వాచ్ మెన్ ను కాణిపాకం దేవుని దర్శనానికి పంపించారు. నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నందున వివేకా ఇంటికి రాగానే హత్యకు హ్యూహం పన్నిన వారందరినీ పిలిపించి హత్య చేశారు. గవర్నమెంట్ వచ్చి ఐదు సంవత్సరాలు. వాళ్ల బాబాయి కాకుండా వేరేవాళ్లు అయితే సీఎం జగన్ సెట్ వేసి హంతకుల అంతు చూసే వారు. నేనొక్కడిని ఎందుకు ఇరుక్కోవాలని అప్రువర్ గా మారాను అంటూ దస్తగిరి సీబీఐ ఎదుట వాగూమలం ఇవ్వటం విశేషం.
షర్మిల అస్త్రాలు పనిచేస్తాయా?
రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల సంధించే విమర్శనాస్త్రాలు ఏ మేరకు పని కేస్తాయనే చర్చ కూడా అక్కడి ప్రజల్లో సాగుతున్నది. ఇంతకాలం దూరంగా ఉండి ఇప్పుడు వచ్చి అన్నపై పోరాటం అంటే దీని వెనుక చంద్రబాబు హస్తం కూడా వుండి వుంటుందనే అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మనుషులను వేరే పార్టీల్లో కోవర్టులుగా నియమించుకుని తన పనిని సాఫీగా చేసుకు పోతున్నారనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా ఐదేళ్లుగా వివేకా హత్య కేసు సాగుతూ ఉండటం, అదే ఎన్నకల్లో విమర్శనాస్త్రంగా మారటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నది. వైఎస్ షర్మిల కూడా కడప నుంచే పోటీ చేసేందుకు సిద్ధం కావడం వల్ల జరగబోయే ప్రచారం తప్పకుండా వివేకా హత్య చుట్టే ఉంటుందనడంలో సందేహం లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితునిగా పేర్కొన్నందున ఈ హత్య అత్యంత తీవ్ర చర్చకు తావిచ్చింది.